
ఆ ఫ్రస్టేషన్‌లో ఇలా చేశాను.. పోలీసులకు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి క్షమాపణలు
పోలీసు అధికారులపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. తన మాటలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే బేషరతుగా క్షమాపణలు తెలుపుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.
కరీంనగర్ జిల్లా వీణవంకలో మినీ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్తున్న సమయంలో కొందరు పోలీసులు తనను అడ్డుకుని, తీవ్ర ఒత్తిడికి గురిచేశారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఆ సమయంలో కలిగిన ఫ్రస్ట్రేషన్, మానసిక ఒత్తిడిలోనే తెలియకుండా నోరు జారాను తప్ప, అవి ఉద్దేశపూర్వకంగా అన్న మాటలు కావు అని ఆయన వివరణ ఇచ్చారు. పోలీసులన్నా, అధికారులన్నా తనకు ఎంతో గౌరవం ఉందని ఆయన స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై, తన కుటుంబంపై రాజకీయ కక్షకు తెగబడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ చిన్న విషయాన్ని పట్టుకుని కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని ఆయన అందరినీ కోరారు.
కరీంనగర్ సీపీ, పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా మండిపడింది. సీపీ మతమార్పిడికి పాల్పడుతున్నారంటూ నిరాధార ఆరోపణలు చేయడాన్ని ఖండించిన సంఘం, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ ఒత్తిడికి దిగివచ్చిన కౌశిక్ రెడ్డి, అధికారుల మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు చెబుతున్నానని, ఒత్తిడిలోనే ఆ వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు.
