Let's talk: editor@tmv.in
ఆ ఏడుపే… చిన్నారి ప్రాణం తీసింది

ఆ ఏడుపే… చిన్నారి ప్రాణం తీసింది

Panthagani Anusha
21 సెప్టెంబర్, 2025

భార్యాభర్తల మధ్య తగాదాలు తరచూ చోటుచేసుకోవడం సాధారణమే. కానీ కొన్నిసార్లు ఆవేశం మితిమీరితే కుటుంబం మొత్తం ఆ ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఈ మధ్య కాలంలో తల్లిదండ్రుల మధ్య వివాదాలు పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. అలాంటి హృదయ విదారక సంఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసింది. తల్లిదండ్రుల గొడవ, కసాయి తండ్రి ఆవేశానికి మధ్య చిక్కుకుని ఏడాది పసిపాప ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదం మిగిల్చింది.

నాగారం మండలం కొత్తపల్లికి చెందిన వెంకటేష్‌, నాగమణి దంపతులు కొంతకాలంగా సూర్యాపేట పట్టణంలోని ప్రియాంక కాలనీలో నివసిస్తున్నారు. వీరికి ఏడాది క్రితం భవిజ్ఞ అనే పాప పుట్టింది. మొదట్లో సంతోషంగా సాగిన ఈ దాంపత్య జీవితంలో వీరు రోజులు గడిచేకొద్దీ చిన్న చిన్న విషయాలకు గొడవ పడడం మొదలుపెట్టారు. ఈ తగాదాల మధ్య శుక్రవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి చేరుకున్న వెంకటేష్ భార్యతో గొడవకు దిగాడు. మాటామాటా పెరిగి గొడవ తీవ్రరూపం దాల్చింది.

తల్లిదండ్రుల అరుపులకు భయపడిన చిన్నారి భవిజ్ఞ ఏడవడం ప్రారంభించింది. పాప ఏడుపు చుట్టుపక్కల వారికి వినిపిస్తుందనే కోపంతో వెంకటేష్ ఆ చిన్నారి నోరు బలవంతంగా మూయించాడు. ఊపిరాడక కొట్టుమిట్టాడుతున్న కూతురిని చూసి భయపడిన నాగమణి ఆపడానికి ప్రయత్నించింది. పాపను లాక్కోవడానికి యత్నించడంతో ఆవేశానికి గురైన వెంకటేష్ చేతిలో ఉన్నది తన కన్నకూతురన్న సంగతి మర్చిపోయి అతి కిరాతకంగా ఆ పసిపాపను నేలకేసి కొట్టాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో పాప ఉలుకు పలుకు లేకుండా పడిపోయింది. కూతురిని ఆ స్థితిలో చూసిన ఆ తల్లి ఒక్కసారిగా అరవడంతో ఆ కేకలు విన్న చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని హుటాహుటిన దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్రంగా గాయాలవడంతో పాప చాలాసేపు ప్రాణాలతో పోరాడి చివరికి చనిపోయింది.

ఈ ఘటన అనంతరం పారిపోవాలని చూసిన వెంకటేష్‌ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఇలాంటి ఘటనలు మన సమాజానికి ఒక గుణపాఠం కావాలి. కోపంలో జరిగే హింస క్షణిక ఆవేశాన్ని తీర్చవచ్చు కానీ దాని ఫలితాలు జీవితాంతం మరువలేని చేదు జ్ఞాపకాలను, మనల్ని మనం జీవితకాలం క్షమించుకోలేని విషయాలుగా మిగిలిపోతాయి.

ప్రతి జంట సమాజంలో మంచి భార్యభర్తలుగానే కాకుండా, పిల్లలకు మంచి తల్లిదండ్రులుగా ఉంటూ ఎల్లప్పుడు వారికి ఆదర్శంగా, అండగా నిలబడాలి. అంతేకాక చిన్నారుల సంరక్షణ, వారి పట్ల మమకారం, ప్రేమ చూపడం తల్లిదండ్రుల బాధ్యత. ప్రతి తల్లిదండ్రులు పిల్లల ముందు ఎలా ప్రవర్తిస్తే వారి జీవితం కూడా అలానే రూపుదిద్దుకుంటుంది. కాబట్టి ఈ సంఘటన తల్లిదండ్రులకు ఓ గుణపాఠంగా నిలుస్తోంది. ఒక తండ్రి ఎలా ఉండకూడదన్న దానికి ఉదాహరణగా మారింది.

ఆ ఏడుపే… చిన్నారి ప్రాణం తీసింది - Tholi Paluku