Let's talk: editor@tmv.in
ఆహార భద్రత సూచీలో ఏపీ దేశంలో తొలి పది స్థానాల్లో ఉండాలి:

ఆహార భద్రత సూచీలో ఏపీ దేశంలో తొలి పది స్థానాల్లో ఉండాలి:

Panthagani Anusha
15 మార్చి, 2026

రాష్ట్ర ఆహార భద్రత శాఖ తన పనితీరును సమూలంగా మెరుగుపరుచుకుని ఈ ఏడాది డిసెంబరు నాటికి జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచే మొదటి పది రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది మార్చిలో ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ఏపీ 28వ స్థానంలో ఉండటంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మార్పు రాకుండా ఉంటే ఇకపై ఉపేక్షించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం మంగళగిరిలోని కుంచనపల్లిలో ఉన్న డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ ప్రధాన కార్యాలయంలో ఫుడ్ సేఫ్టీ శాఖ పనితీరుపై మంత్రి లోతైన సమీక్ష నిర్వహించారు.

ఇక ప్రజారోగ్య సంరక్షణలో ఈ శాఖ అత్యంత కీలకమని కల్తీ నియంత్రణ సక్రమంగా జరిగితేనే క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులను అరికట్టగలమని పేర్కొన్నారు. అధికారులు తమ జడత్వాన్ని వీడి అంకితభావంతో పనిచేయాలని విధుల్లో అలసత్వం ప్రదర్శించే వారిని తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇకపై ప్రతి నెలా ఉన్నతాధికారులు ప్రతి మూడు నెలలకోసారి తాను స్వయంగా శాఖా పనితీరును సమీక్షిస్తానని వెల్లడించారు.

ఇదిలా ఉండగా క్షేత్రస్థాయిలో అధికారుల హాజరుపై మంత్రి తీవ్రంగా స్పందించారు. పలువురు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్లు తమకు కేటాయించిన ప్రాంతాల్లో ఉండకుండా వేరే చోట్ల నివాసం ఉంటున్నారని వర్చువల్ సమావేశాల్లో కూడా వారు పనిచేసే చోట కాకుండా ఇతర ప్రాంతాల నుంచి హాజరవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ముఖ ఆధారిత హాజరు విధానాన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు. ఎఫ్.ఆర్.ఎస్ ఆధారంగానే జీతాల చెల్లింపులు జరిగేలా చూడాలన్నారు. అదేవిదంగా కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్రంతో చర్చించి ఫుడ్ ల్యాబ్‌ల అభివృద్ధి కోసం సుమారు రూ.130 కోట్ల నిధులు పొందిందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మరోవైపు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ప్రతినెలా 12 నమూనాలు సేకరించడంలో ఎందుకు వెనుకబడుతున్నారని ప్రశ్నించారు. గడిచిన 11 నెలల్లో ప్రతి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 132 నమూనాలు తీయాల్సి ఉండగా కేవలం ఆరుగురు (40 మందిలో) మాత్రమే లక్ష్యాన్ని చేరుకున్నారని తెలిపారు. జాతీయ స్థాయిలో సేకరించిన నమూనాల్లో సగటున 20% వరకు నాణ్యత లేదని నిర్ధారణ అవుతుండగా రాష్ట్రంలో ఇది కేవలం 8% వరకు మాత్రమే ఉండడంలో అంతర్యమేమిటని కూడా నిలదీశారు. కేంద్రం నుంచి వచ్చిన 4 మొబైల్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్స్ (వాహనాలు) ఎందుకు ఉపయోగించడం లేదని అధికారులను మంత్రి ప్రశ్నించారు. 150 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనను దృష్టిలో ఉంచుకుని పాల నమూనాల సేకరణ పెంచాలని ఆదేశించారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ మాట్లాడుతూ శాఖలో కాగిత రహిత రిపోర్టింగ్ విధానాన్ని అమలు చేయాలని ఏ స్థాయిలోనూ కేసులు పెండింగ్‌లో ఉండకూడదని హెచ్చరించారు. నిర్దేశిత గడువులోగా కేసులను పరిష్కరించని పక్షంలో చర్యలు తప్పవన్నారు. ఆహార భద్రత శాఖ కమిషనర్ వీరపాండియన్, డైరెక్టర్ నీలకంఠారెడ్డి మాట్లాడుతూ ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ ప్రోటోకాల్ ప్రకారం తనిఖీలు నిర్వహించాలని, వ్యాపారులందరూ లైసెన్సులు పొందేలా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.