Let's talk: editor@tmv.in
ఆస్పత్రిలో చేరిన ప్రముఖ రచయిత రస్కిన్ బాండ్

ఆస్పత్రిలో చేరిన ప్రముఖ రచయిత రస్కిన్ బాండ్

Pinjari Chand
14 డిసెంబర్, 2025

భారతీయ ఆంగ్ల సాహిత్యంలో అత్యంత ప్రజాదరణ పొందిన రచయితల్లో ఒకరైన ప్రముఖులు రస్కిన్ బాండ్ కాలిలో అసౌకర్యంగా ఉండడంతో డెహ్రాడూన్‌లోని ఓ ఆస్పత్రిలో ఆయన చేరారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. రస్కిన్ బాండ్ కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం ఆయన కాళ్లలో ఒకటి బలహీనపడటంతో నడవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయితే చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని తెలిపారు. వచ్చే కొన్ని రోజుల్లో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వివరించారు.

1934 మే 19న హిమాచల్ ప్రదేశ్‌లోని కసౌలిలో జన్మించిన రస్కిన్ బాండ్, ప్రకృతి సౌందర్యం, కొండ ప్రాంతాల ప్రశాంతతను ప్రతిబింబించే రచనలతో ప్రసిద్ధి గాంచారు. కేవలం 17 ఏళ్ల వయసులోనే ఆయన తొలి నవల ‘ది రూమ్ ఆన్ ది రూఫ్’ను ప్రచురించగా, అది 1957లో ప్రతిష్ఠాత్మక జాన్ ల్యూయెలిన్ రీస్(యూనైటెడ్ కింగ్డమ్–యూకే ) అవార్డును అందుకుంది.

ఇప్పటివరకు 500కు పైగా చిన్న కథలు, నవలలు, వ్యాసాలు, కవితలు, పిల్లల పుస్తకాలు రాసిన ఆయన రచనలు చిన్న పట్టణాల జీవితం, సాదాసీదా మనుషుల భావోద్వేగాలు, నోస్టాల్జియాతో నిండిన కథన శైలికి ప్రతీకగా నిలిచాయి.

‘వాగ్రెంట్స్ ఇన్ ది వ్యాలీ’, ‘ఏ ఫ్లైట్ ఆఫ్ పిజన్స్’, ‘ది బ్లూ అంబ్రెల్లా’ వంటి నవలలతో పాటు

‘ది నైట్ ట్రైన్ అట్ డియోలీ’, ‘టైమ్ స్టాప్స్ అట్ షామ్లీ’, ‘డెల్హీ ఈజ్ నాట్ ఫార్’ వంటి చిన్న కథలు ఆయనకు అపారమైన గుర్తింపు తెచ్చాయి. 91 ఏళ్ల వయసులోనూ అన్ని వయస్సుల పాఠకులను ఆకట్టుకుంటున్న రస్కిన్ బాండ్‌కు సాహిత్య అకాడమీ అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్ సహా అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి.

ఆస్పత్రిలో చేరిన ప్రముఖ రచయిత రస్కిన్ బాండ్ - Tholi Paluku