
ఆస్తి పన్ను బకాయిలతో జయలలిత హైదరాబాద్ నివాసం తాత్కాలికంగా సీజ్
నగరంలో ఆస్తి పన్ను బకాయిల వసూళ్లపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జె. జయలలితకు చెందిన శ్రీనగర్ కాలనీలోని నివాసాన్ని అధికారులు తాత్కాలికంగా సీజ్ చేశారు. అయితే, ఆస్తి పన్ను బకాయిలను వెంటనే చెల్లిస్తామని కేర్‌టేకర్లు హామీ ఇవ్వడంతో మంగళవారం ఆ భవనాన్ని తిరిగి అప్పగించారు.
శ్రీనగర్ కాలనీలో ఉన్న ఈ 'గ్రౌండ్ ప్లస్ 4స (జీ+4) అంతస్తుల భవనానికి సంబంధించి 2017 నుంచి ఆస్తి పన్ను బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం వడ్డీపై 90 శాతం రాయితీ కల్పించిన తర్వాత కూడా సుమారు రూ.82 లక్షల పన్ను చెల్లించాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినా, స్వయంగా భవనం వద్దకు వెళ్లి అడిగినా స్పందన లేకపోవడంతో నిబంధనల మేరకు సీజ్ చేయాల్సి వచ్చిందని జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు తెలిపారు.
2016లో జయలలిత మరణించిన తర్వాత ఈ భవనం ఖాళీగానే ఉందని, అందుకే పన్నులో కొంత మినహాయింపు వేకెన్సీ రెమిషన్ ఇవ్వాలని భవన కేర్‌టేకర్లు అధికారులను కోరారు. ఇందుకు అధికారులు సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం ఈ భవనం జయలలిత పేరు మీదనే ఉందని, సరైన వారసత్వ ధృవీకరణ పత్రాలు సమర్పించిన తర్వాత యాజమాన్య హక్కులను బదిలీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఆస్తి వారసత్వానికి సంబంధించి ప్రస్తుతం న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతోంది.
నిజానికి ఇది నివాస భవనమే అయినప్పటికీ, గతంలో ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు చెందిన ఒక కంపెనీకి దీనిని అద్దెకు ఇవ్వడం వల్ల ఇది 'కమర్షియల్' కేటగిరీలోకి మారినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. అయితే, ఆ కంపెనీ 2017లోనే భవనాన్ని ఖాళీ చేసినట్లు అధికారులు గుర్తించారు. పన్ను బకాయిల చెల్లింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ భవనానికి సంబంధించి పూర్తి స్పష్టత రానుంది. నగరంలోని ప్రముఖుల ఆస్తులపై కూడా జీహెచ్‌ఎంసీ బకాయిల వసూళ్ల విషయంలో వెనక్కి తగ్గడం లేదని ఈ ఉదంతం నిరూపిస్తోంది.
