Let's talk: editor@tmv.in
ఆస్ట్రేలియా బాండీ బీచ్ కాల్పుల ఘటన: హైదరాబాద్ వాసికి సంబంధం లేదని తెలంగాణ పోలీసుల వెల్లడి

ఆస్ట్రేలియా బాండీ బీచ్ కాల్పుల ఘటన: హైదరాబాద్ వాసికి సంబంధం లేదని తెలంగాణ పోలీసుల వెల్లడి

Gaddamidi Naveen
17 డిసెంబర్, 2025

ఇటీవల ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో జరిగిన ఘోర కాల్పుల ఘటనలో మృతి చెందిన అనుమానితుల్లో ఒకరైన సాజిద్ అక్రమ్ (50) భారత పౌరుడిగా, హైదరాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించబడినట్లు తెలంగాణ పోలీస్ శాఖ మంగళవారం వెల్లడించింది. ఈ ఘటనలో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోగా, ఇది ఇస్లామిక్ స్టేట్ ప్రేరణతో జరిగిన ఉగ్రదాడిగా ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీసులు ప్రకటించారు.

సాజిద్ అక్రమ్ నేపథ్యం

తెలంగాణ డీజీపీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌లో బీకామ్ పూర్తి చేసి 1998 నవంబర్‌లో ఉద్యోగాన్వేషణలో భాగంగా ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. దాదాపు 27 సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్న అతడు, భారతీయ పాస్‌పోర్ట్‌ను కలిగి ఉన్నాడు. అయితే, ఈ కాలంలో తన కుటుంబ సభ్యులతో అతనికి పరిమిత సంబంధమే ఉండేదని పోలీసులు తెలిపారు.

ఆస్ట్రేలియాలో స్థిరపడిన అనంతరం, సాజిద్ అక్రమ్ యూరోపియన్ మూలాలు గల మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు నవీద్ (24), ఒక కుమార్తె ఉన్నారు. నవీద్ ఈ కాల్పుల ఘటనలో రెండో అనుమానితుడిగా గుర్తించబడగా, ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నవీద్ అతని సోదరి ఆస్ట్రేలియాలోనే జన్మించి అక్కడి పౌరులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు.

ఆస్ట్రేలియా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ కాల్పుల ఘటనకు తండ్రి, కుమారుడు కలిసి పాల్పడ్డారని అనుమానం వ్యక్తమవుతోంది. ఘటన సమయంలో సాజిద్ అక్రమ్ ను అక్కడికక్కడే కాల్చి చంపగా, అతని కుమారుడు గాయాలతో బయటపడ్డాడు.

తెలంగాణ పోలీసుల ప్రకారం, సాజిద్ అక్రమ్ ఆస్ట్రేలియాకు వెళ్లిన తర్వాత ఆరు సార్లు భారత్‌కు వచ్చాడు. ఆ పర్యటనలు ప్రధానంగా కుటుంబ సంబంధిత వ్యవహారాలు, ఆస్తి విషయాలు వృద్ధ తల్లిదండ్రులను కలుసుకోవడానికే పరిమితమయ్యాయి. అయితే, తన తండ్రి మరణించిన సమయంలో కూడా అతడు భారత్‌కు రాలేదని పోలీసులు పేర్కొన్నారు.

సాజిద్ అక్ఱమ్ కుటుంబ సభ్యులు అతనిలో లేదా అతని కుమారుడిలో ఎలాంటి తీవ్రవాద భావజాలం లేదా రాడికలైజేషన్ లక్షణాలు తమకు తెలియవని స్పష్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి తీవ్రవాదానికి దారితీసిన కారణాలకు భారత్ లేదా తెలంగాణలోని ఏ స్థానిక ప్రభావం లేదని తెలంగాణ పోలీస్ శాఖ స్పష్టంగా పేర్కొంది.

1998లో ఆస్ట్రేలియాకు వెళ్లే వరకు సాజిద్ అక్ఱమ్‌పై ఎలాంటి ప్రతికూల రికార్డులు లేవని, అతని గతంలో నేర చరిత్ర లేదని కూడా రాష్ట్ర పోలీసులు తెలిపారు. ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇతర ఏజెన్సీలతో అవసరమైతే పూర్తిగా సహకరిస్తామని తెలంగాణ పోలీసులు పేర్కొంటూ, నిర్ధారిత సమాచారం లేకుండా ఊహాగానాలు చేయవద్దని ప్రజలకు, మీడియాకు విజ్ఞప్తి చేశారు.

ఆస్ట్రేలియా బాండీ బీచ్ కాల్పుల ఘటన: హైదరాబాద్ వాసికి సంబంధం లేదని తెలంగాణ పోలీసుల వెల్లడి - Tholi Paluku