
ఆస్ట్రేలియా పర్యటనలో లోకేష్ - ఆంధ్రాలో ఇన్నోవేషన్ హబ్‌ల ఏర్పాటుకు పలు యూనివర్సిటీ లతో చర్చలు
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి లోకేష్ పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇందులో బాగంగా యూనివర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు, అగ్రికల్చరల్ టెక్నాలజీ పరిశోధకులతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ ఆధునీకరణకు వాతావరణ నిరోధక పంటలు, ప్రెసిషన్ ఫార్మింగ్‌లో నైపుణ్యాలను ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కలిసి పంచుకోవాలని వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ ని కోరారు . స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థలు, ఎఐ ఆధారిత వ్యవసాయ పరిష్కారాలను అభివృద్ధి చేసే ఇన్నోవేషన్ హబ్‌ల ఏర్పాటుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే బుధవారం గోల్డ్ కోస్ట్‌లోని గ్రిఫిత్ యూనివర్సిటీ సీనియర్ ప్రతినిధులు, ప్రొఫెసర్‌లను కలిశారు. అక్కడ జరిగిన చర్చలను ప్రస్తావిస్తూ గత ఒలింపిక్స్‌లో ఈ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఒక్కరే 10 బంగారు పతకాలు గెలుచుకున్నారని తెలుసుకుని నేను నిజంగా ఆశ్చర్యపోయాను. క్రీడలు క్రమశిక్షణ, కఠోర శ్రమ, పోటీతత్వం మరియు నాయకత్వ లక్షణాలను అలవర్చుతాయి. ప్రపంచంలోని ఇతర గొప్ప దేశాలతో సమానంగా భారతదేశం ఒక క్రీడా సంస్కృతిని నిర్మించాలని నేను నిజంగా నమ్ముతున్నాను. పబ్లిక్ పాలసీ, సుస్థిరత, ఆవిష్కరణలలో భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసే అవకాశాలపై నేను గ్రిఫిత్ యూనివర్సిటీ ప్రతినిధుల తో చర్చించాను. భారతదేశంలో ఒక స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా నేను గ్రిఫిత్ యూనివర్సిటీని ఆహ్వానించాను.ఇటువంటి భాగస్వామ్యాలు మన యువతలో క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి ఎంతో సహాయపడతాయి అని ఆయన X వేదికగా తెలియజేశారు.
అలాగే ఆస్ట్రేలియాలోని గ్రేటర్ సిడ్నీలో కీలక నగరం ఐన పారమట్టా ను సందర్శించారు. అక్కడ పారమట్టా లార్డ్ మేయర్ మార్టిన్ జైటర్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు . ఆయన పారమట్టాలో స్థానిక వ్యాపారాలను పెంచడం, ప్రజారవాణా,పెట్టుబడులను ఆకర్షించి గ్లోబల్ సిటీగా మార్చడం,గ్రీన్ స్పేసెస్ ను అభివృద్ధి చేయడంలో చొరవ చూపించి సిడ్ని అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. సార్టప్ స్టేట్ గా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన నగరాల అభివృద్ధికి సహకారం అందించాల్సిందిగా ఈ సందర్భంగా జైటర్ కు విజ్ఞప్తి చేశారు.
