Let's talk: editor@tmv.in
ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమలు

ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమలు

Shaik Mohammad Shaffee
11 డిసెంబర్, 2025

పిల్లల భవిష్యత్తు, మానసిక ఆరోగ్యం కోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు సోషల్ మీడియాను వాడకుండా నిషేధిస్తూ తీసుకొచ్చిన కొత్త చట్టం డిసెంబర్ 10 (బుధవారం) నుంచి అమల్లోకి వచ్చింది. ప్రపంచంలోనే ఇలాంటి కఠిన నిబంధనను అమలు చేసిన మొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది.

ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ "ఆస్ట్రేలియా వ్యాప్తంగా 16 ఏళ్ల లోపు పిల్లలు ఈ రోజు (బుధవారం) సోషల్ మీడియా లేకుండా తమ రోజు ప్రారంభిస్తున్నారు. ఇది పెద్ద మార్పు, దీనిని అమలు చేయడానికి ప్రయత్నించిన ప్రపంచంలోని మొదటి దేశం మనమే. కానీ ఈ నిర్ణయం నిజంగా ఎంతో ముఖ్యమైనది. ఇది పిల్లలు నిజమైన బాల్యాన్ని అనుభవించేందుకు అవకాశం కల్పిస్తుంది. పిల్లలు పిల్లల్లా ఉండటానికి, తల్లిదండ్రులు ప్రశాంతంగా జీవించడానికి ఈ సంస్కరణ ఉపయోగపడుతుంది' అని పేర్కొన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా

ఈ చట్టం ప్రధానంగా 10 పెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు వర్తిస్తుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, యూట్యూబ్, స్నాప్‌చాట్,ఎక్స్ (గ‌తంలో ట్విట్టర్), థ్రెడ్స్, రెడ్డిట్, కిక్, ట్విచ్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీలు 16 ఏళ్ల లోపు ఆస్ట్రేలియన్ పిల్లల ఖాతాలను తొలగించడానికి 'తగిన చర్యలు' తీసుకోకపోతే, ఒక్కొక్కదానికి 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల వరకు భారీ జరిమానా ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ బాధ్యత పూర్తిగా టెక్ కంపెనీలపైనే ఉంటుంది, పిల్లలు లేదా తల్లిదండ్రులపై ఎలాంటి జరిమానాలు ఉండవు.

అమలు ఎలా జరుగుతుంది?

ఈ నిషేధాన్ని ఆస్ట్రేలియా ఈ సేఫ్టీ కమీషనర్ జూలీ ఇన్‌మన్‌ గ్రాంట్ పర్యవేక్షిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తమ వినియోగదారుల వయస్సును నిర్ధారించడానికి కొత్త సాంకేతిక పద్ధతులు (ఉదాహరణకు ఫోటో లేదా వీడియో ఆధారిత వయస్సు అంచనా) ఉపయోగించాల్సి ఉంటుంది. కేవలం వినియోగదారులు చెప్పే వయస్సుపై ఆధారపడటం సరిపోదు. నిషేధం అమలైన వెంటనే ఈ 10 కంపెనీలు తమ వయస్సు పరిమితిని ఎలా అమలు చేస్తున్నాయి, ఎన్ని అకౌంట్‌లు మూసివేశాయనే వివరాలు ఇవ్వాలని ఈ సేఫ్టీ కమీషనర్ గురువారం నోటీసులు పంపుతారు. కమ్యూనికేషన్స్ మంత్రి అనికా వెల్స్ మాట్లాడుతూ, తాత్కాలికంగా వేరే దేశపు వీపీఎన్ వాడి లేదా పెద్దల ముఖాన్ని స్కాన్ చేయించి తప్పించుకున్న పిల్లలు కూడా ఎప్పటికైనా పట్టుబడతారని హెచ్చరించారు. ఎందుకంటే, సోషల్ మీడియా కంపెనీలు పిల్లల పోస్ట్‌లు, సంభాషణలు, ప్రవర్తన ఆధారంగా వారి వయస్సును కనిపెట్టగలవు.

ఈ నిషేధంపై భిన్న రకాల స్పందనలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా కారణంగా ఆందోళన, నిరాశ, ఒంటరితనం, ఆన్‌లైన్ వేధింపుల నుంచి పిల్లలను రక్షించడానికి ఈ చట్టం ఎంతో ఉపయోగపడుతుందని ప్రభుత్వం, తల్లిదండ్రులు వాదిస్తుంటే, కొంతమంది యువత తమ ఫాలోవర్లను కోల్పోయి ఆర్థికంగా నష్టపోతామని వాపోతున్నారు. అంతేకాదు, సోషల్ మీడియా ద్వారానే తమలాంటి వ్యక్తులను కలుసుకోగలుగుతున్నామని, ఈ నిషేధం వల్ల తాము ఒంటరిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.

ప్రపంచం దృష్టి ఆస్ట్రేలియాపైనే

ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయాన్ని డెన్మార్క్, న్యూజిలాండ్, మలేషియా వంటి అనేక ఇతర దేశాలు చాలా నిశితంగా గమనిస్తున్నాయి. ఈ దేశాలు కూడా తమ యువత కోసం ఇలాంటి నిషేధాలు లేదా కఠినమైన నియంత్రణలను అమలు చేయాలా అని చర్చిస్తున్నాయి. నవంబర్ 2025లో యూరోపియన్ పార్లమెంట్ కూడా 15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్‌పై కఠిన నిబంధనలు లేదా నిషేధం కోసం తీర్మానాన్ని ఆమోదించింది. అయినప్పటికీ, ఆస్ట్రేలియా తరహాలో చట్టబద్ధంగా పూర్తి నిషేధం అమలులో ఉన్న ఏకైక దేశం ప్రస్తుతానికి అదే.

భారతదేశంలో..

భారతదేశంలో 16 ఏళ్ల లోపు పిల్లలకు ప్రత్యేకంగా సోషల్ మీడియాపై ప్రభుత్వ నిషేధం ప్రస్తుతం లేదు. అయితే, చట్టపరంగా, కంపెనీల నిబంధనల ప్రకారం కొన్ని నియంత్రణలు ఉన్నాయి. ఉదాహరణకు, చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తమ సేవా నిబంధనలలో కనీస వయస్సును 13 ఏళ్లుగా పేర్కొంటాయి. భారత ప్రభుత్వం, సోషల్ మీడియా నిషేధం కంటే నియంత్రణలు, డిజిటల్ భద్రతా మార్గదర్శకాలపై ఎక్కువ దృష్టి సారిస్తోంది. పిల్లలకు ఆన్‌లైన్ భద్రతపై అవగాహన కల్పించడం, తల్లిదండ్రుల పర్యవేక్షణను ప్రోత్సహించడం వంటి చర్యలను సమర్థిస్తోంది. పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ నియంత్రణలపై చట్టం చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను కూడా న్యాయస్థానం "ఇది విధానపరమైన అంశం, పార్లమెంట్ పరిధిలోనిది" అని పేర్కొంటూ తిరస్కరించింది. కాబట్టి ఆస్ట్రేలియా లాగా కఠిన నిషేధం కాకుండా, భారతదేశంలో ప్రస్తుతం తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో నియంత్రణ మాత్రమే ఉంది.

ఆస్ట్రేలియాలో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమలు - Tholi Paluku