Let's talk: editor@tmv.in
ఆస్ట్రేలియాలో మళ్లీ కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి

ఆస్ట్రేలియాలో మళ్లీ కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి

Shaik Mohammad Shaffee
23 జనవరి, 2026

ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో గల లేక్ కార్గెల్లిగో పట్టణంలో గురువారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు తప్పించుకోవడంతో పోలీసులు ఆ ప్రాంతమంతా జల్లెడ పడుతున్నారు.

ఏం జరిగిందంటే?

సిడ్నీకి పశ్చిమ దిశలో సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చిన్న పట్టణంలో సాయంత్రం 4:30 గంటల సమయంలో కాల్పుల శబ్దం వినిపించింది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో దుండగుడు కాల్పులకు తెగబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర సేవల సిబ్బంది ముగ్గురు మరణించినట్లు గుర్తించారు. గాయపడిన వ్యక్తిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.

పట్టణంలో లాక్‌డౌన్

కాల్పులు జరిపిన వ్యక్తి వద్ద భారీ ఆయుధాలు ఉన్నాయని, అతడు వాహనంలో పారిపోయాడని సమాచారం అందడంతో పోలీసులు పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావొద్దని జియో-టార్గెటెడ్ మెసేజ్‌ల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. పట్టణంలోని దుకాణాలు, హోటళ్లను మూసివేయించారు. భారీగా ఆయుధాలు ధరించిన ప్రత్యేక బలగాలను పట్టణానికి రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు.

కుటుంబ కలహాలే కారణమా?

ప్రాథమిక విచారణలో ఈ దారుణం కుటుంబ కలహాల కారణంగా జరిగి ఉండొచ్చని స్థానిక మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. నిందితుడి ఆచూకీ తెలిసినప్పటికీ, అతడు ఇంకా పట్టుబడలేదు. మృతులు, గాయపడిన వారు అందరూ స్థానికులేనని అధికారులు తెలిపారు.

జాతీయ సంతాప దినం వేళ విషాదం

గత నెలలో సిడ్నీలోని బాండీ బీచ్‌లో జరిగిన హనుక్కా వేడుకల్లో కాల్పులు జరిగి 15 మంది మరణించిన విషయం తెలిసిందే. ఆ బాధితుల స్మారకార్థం ఆస్ట్రేలియా గురువారం నాడు 'జాతీయ సంతాప దినం' పాటించింది. కాగా దేశమంతా విషాదంలో ఉన్న సమయంలోనే మరోసారి కాల్పులు జరగడం అక్కడి ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

కఠినతరం అవుతున్న గన్ చట్టాలు

బాండీ బీచ్ ఘటన తర్వాత ఆస్ట్రేలియా ప్రభుత్వం గన్ చట్టాలను మరింత కఠినతరం చేసింది. తుపాకుల లైసెన్సుల తనిఖీలను పెంచడంతో పాటు, ఒక్కో వ్యక్తి గరిష్టంగా నాలుగు తుపాకులే కలిగి ఉండాలనే కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఈ చట్టాలు అమల్లోకి వచ్చిన రెండు రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం.