
ఆస్ట్రేలియాలో భారత కల్నల్ ప్రతీక్ రాయ్‌కు 'గెడ్డెస్ గావెల్ అవార్డు'
భారతదేశానికి, భారత సైన్యానికి ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం లభించింది. ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ ప్రతీక్ రాయ్ ఆస్ట్రేలియన్ డిఫెన్స్ కాలేజీలో 'డిఫెన్స్ స్ట్రాటజిక్ అండ్ స్టడీస్ కోర్సు'ను పూర్తి చేసిన సందర్భంగా ఆయనకు ప్రతిష్టాత్మకమైన 'గెడ్డేస్ గావెల్ అవార్డు' లభించింది. ఈ అవార్డును అందుకున్న మొదటి భారతీయుడు కూడా ఈయనే.
అవార్డు ప్రత్యేకత ఏమిటి?
ఈ అవార్డును కమాండర్ ఆస్ట్రేలియన్ డిఫెన్స్ కాలేజ్ అవార్డు అని కూడా పిలుస్తారు. ప్రాంతీయ సంబంధాలు, నిర్ణయాలు తీసుకోవడంపై ప్రభావం చూపే అంశాలపై విద్యార్థికి ఉన్న గొప్ప అవగాహనను గుర్తించి ఈ అవార్డును అందిస్తారు. రాజకీయ, దౌత్య, సైనిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాలలో ఉత్తమ జ్ఞానాన్ని ప్రదర్శించే విద్యార్థికి ఈ గౌరవం దక్కుతుంది. కల్నల్ ప్రతీక్ రాయ్‌కు ఈ అవార్డు రావడంపై కాన్‌బెర్రాలోని ఇండియన్ హైకమిషన్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా అభినందనలు తెలిపింది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య బలమైన రక్షణ బంధాలు
కల్నల్ ప్రతీక్ రాయ్ ఈ అవార్డును అందుకోవడం, భారత్-ఆస్ట్రేలియా మధ్య రోజురోజుకు బలపడుతున్న రక్షణ సంబంధాలను ప్రతిబింబిస్తుంది. గత నెలలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ భారతదేశాన్ని సందర్శించారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో కలిసి ఆమె, రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, భద్రత, రక్షణ సహకారంతో సహా అనేక రంగాలలో పురోగతిని సమీక్షించారు. రెండు దేశాల మంత్రులు స్వేచ్ఛాయుతమైన, బహిరంగ, సురక్షితమైన, సంపన్నమైన ఇండో-పసిఫిక్ ప్రాంతానికి తమ ఉమ్మడి కట్టుబాటును పునరుద్ఘాటించారు.
అంతకుముందు అక్టోబర్‌లో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఇరు దేశాలు కీలక రక్షణ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ కొత్త రక్షణ ఒప్పందాన్ని ఆస్ట్రేలియా రక్షణ మంత్రి మార్లెస్ "రెండు దేశాల సాయుధ దళాల మధ్య కార్యాచరణ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో అత్యంత ముఖ్యమైన అడుగు" అని అభివర్ణించారు. ఆపరేషన్స్ కమాండ్‌ల మధ్య సిబ్బంది చర్చలకు సంబంధించిన ఒప్పందం చాలా ముఖ్యమైనదని ఆయన అన్నారు. మొత్తం మీద ఈ సంఘటనలు భారత్-ఆస్ట్రేలియా మధ్య రక్షణ రంగంలో పెరుగుతున్న సహకారాన్ని, పరస్పర గౌరవాన్ని సూచిస్తున్నాయి.
