Let's talk: editor@tmv.in
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026: సెమీస్‌లో జ్వెరెవ్‌తో అల్కరాజ్ ఢీ

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026: సెమీస్‌లో జ్వెరెవ్‌తో అల్కరాజ్ ఢీ

Shaik Mohammad Shaffee
28 జనవరి, 2026

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టైటిల్ వేట రసవత్తరంగా మారింది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ కార్లోస్ అల్కరాజ్ తన కెరీర్‌లో తొలిసారి ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. మంగళవారం జరిగిన క్వార్టర్-ఫైనల్‌లో స్థానిక స్టార్ అలెక్స్ డి మినార్‌ను 7-5, 6-2, 6-1 తేడాతో మట్టికరిపించాడు. ఈ విజయంతో అల్కరాజ్ ఇప్పుడు తన ప్రత్యర్థి, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో సెమీఫైనల్‌లో ఢీకొనబోతున్నాడు. గతేడాది ఇదే కోర్టులో తనను ఓడించిన జ్వెరెవ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని అల్కరాజ్ పట్టుదలతో ఉన్నాడు.

జ్వెరెవ్ 'ఏస్'ల వర్షం

జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ తన అనుభవాన్ని రంగరించి క్వార్టర్ ఫైనల్లో విజయం సాధించాడు. 20 ఏళ్ల యువ క్రీడాకారుడు టియెన్‌తో జరిగిన పోరులో జ్వెరెవ్ 6-3, 6-7, 6-1, 7-6 తేడాతో గెలిచాడు. ఈ మ్యాచ్‌లో జ్వెరెవ్ ఏకంగా 24 'ఏస్' సర్వీసులు సంధించి ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. తన కెరీర్‌లో గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్‌కు చేరుకోవడం జ్వెరెవ్‌కు ఇది 10వ సారి కావడం విశేషం.

సబలెంకా సంచలనం

మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్, డిఫెండింగ్ ఛాంపియన్ అరీనా సబలెంకా తన ప్రతాపాన్ని చూపింది. అమెరికాకు చెందిన 18 ఏళ్ల నవ సంచలనం ఐవా జోవిక్‌ను 6-3, 6-0 తేడాతో చిత్తు చేసి సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. రెండో సెట్‌లో జోవిక్‌కు ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా సబలెంకా ఆటను ముగించింది. నాలుగేళ్లలో మూడోసారి ట్రోఫీ సాధించడమే లక్ష్యంగా ఆమె అడుగులు వేస్తోంది.

కోకో గాఫ్ ఆగ్రహం.. రాకెట్ ముక్కలు

అమెరికా స్టార్ కోకో గాఫ్‌కు ఈ టోర్నీలో ఊహించని షాక్ తగిలింది. ఉక్రెయిన్ క్రీడాకారిణి ఎలినా స్వితోలినా చేతిలో 6-1, 6-2తో ఆమె ఓటమి పాలైంది. కేవలం 59 నిమిషాల్లోనే మ్యాచ్ ముగిసిపోవడం, ఓటమిని జీర్ణించుకోలేక గాఫ్ తీవ్ర అసహనానికి గురైంది. కోర్టు బయట కాంక్రీట్ మెట్లపై తన రాకెట్‌ను ఏడుసార్లు నేలకేసి కొట్టి ముక్కలు చేసింది. తన నిరాశను ఎవరూ చూడకూడదని కెమెరాలు లేని చోటికి వెళ్లి ఇలా చేశానని ఆమె తర్వాత చెప్పుకొచ్చింది.

45 డిగ్రీల సెగలు.. సబలెంకా సెటైర్లు!

మెల్‌బోర్న్‌లో ఎండలు మండిపోతున్నాయి. మంగళవారం ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుకోవడంతో ఆటగాళ్లు విలవిలలాడారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక బయట కోర్టుల్లో జరుగుతున్న మ్యాచ్‌లను నిర్వాహకులు నిలిపివేశారు. దీనిపై సబలెంకా సరదాగా స్పందిస్తూ.. "మగవారికంటే ఆడవారే గట్టివాళ్లు. అందుకే మాకు ఎండలో మ్యాచ్‌లు పెట్టారు. పాపం మగవారు తట్టుకోలేరని వారి కోసం స్టేడియం రూఫ్ (పైకప్పు) మూసేశారు" అని నవ్వుతూ వ్యాఖ్యానించింది.

స్వితోలినా భావోద్వేగం

ప్రసవం తర్వాత మళ్ళీ కోర్టులోకి వచ్చి అద్భుతాలు చేస్తున్న స్వితోలినా, తన విజయాన్ని యుద్ధంతో సతమతమవుతున్న ఉక్రెయిన్ ప్రజలకు అంకితం ఇచ్చింది. ఎండలు, ఎలక్ట్రిసిటీ లేక ఇబ్బందులు పడుతున్న తన దేశ ప్రజలకు ఈ విజయం చిన్నపాటి వెలుగునిస్తుందని ఆమె భావోద్వేగానికి గురైంది. సెమీస్‌లో ఆమె సబలెంకాతో తలపడనుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ షెడ్యూల్ ప్రకారం, టోర్నీలో అత్యంత ఆసక్తి రేపుతున్న పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ పోరు జనవరి 30న, అంతకుముందు రోజు అనగా జనవరి 29 (గురువారం) నాడు మహిళల సెమీఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.