Let's talk: editor@tmv.in
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026: సెమీస్‌లో జకోవిచ్.. సినర్‌తో ఢీ

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026: సెమీస్‌లో జకోవిచ్.. సినర్‌తో ఢీ

Shaik Mohammad Shaffee
29 జనవరి, 2026

టెన్నిస్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. బుధవారం జరిగిన పురుషుల క్వార్టర్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ జానిక్ సినర్ విజయం సాధించగా, నోవాక్ జకోవిచ్ అదృష్టవశాత్తూ ముందుకు సాగారు. మహిళల విభాగంలో ఇగా స్వైటెక్‌కు షాక్ ఇస్తూ రిబాకినా, తొలిసారి సెమీస్‌లోకి పెగులా ప్రవేశించారు.

జకోవిచ్‌కు లక్.. ముసెట్టికి గాయం

ప్రపంచ టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ 13వ సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్‌కు చేరుకున్నారు. అయితే ఈ విజయం ఆయనకు అంత సులభంగా దక్కలేదు. క్వార్టర్ ఫైనల్లో ఇటలీ ఆటగాడు లోరెంజో ముసెట్టి తొలి రెండు సెట్లను 6-4, 6-3తో గెలుచుకుని జకోవిచ్‌ను ఓటమి అంచుల్లోకి నెట్టారు. కానీ, మూడో సెట్ సమయంలో ముసెట్టికి తీవ్రమైన గాయం కావడంతో మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో జకోవిచ్‌ను విజేతగా ప్రకటించారు. "ఈ రాత్రికి నేను ఇంటికి వెళ్లాల్సిన వాడిని, ముసెట్టి అద్భుతంగా ఆడాడు" అని జకోవిచ్ భావోద్వేగంగా స్పందించారు.

జైత్రయాత్ర కొనసాగిస్తున్న సినర్

డిఫెండింగ్ ఛాంపియన్ జానిక్ సినర్ తన పదునైన ఆటతో సెమీస్‌లోకి దూసుకెళ్లారు. క్వార్టర్ ఫైనల్లో అమెరికా యువ స్టార్ బెన్ షెల్టన్‌ను 6-3, 6-4, 6-4 తేడాతో వరుస సెట్లలో చిత్తు చేశారు. ఈ విజయంతో సినర్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వరుసగా 19 మ్యాచ్‌ల్లో ఓటమి లేని రికార్డును సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా నెట్ పాయింట్ల వద్ద సినర్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

రిబాకినా సంచలనం.. స్వైటెక్‌ అవుట్!

మరోవైపు మహిళల సింగిల్స్‌లో పెను సంచలనం నమోదైంది. ప్రపంచ రెండో నంబర్ క్రీడాకారిణి ఇగా స్వైటెక్‌ను ఎలీనా రిబాకినా మట్టికరిపించారు. 7-5, 6-1తో వరుస సెట్లలో గెలిచిన రిబాకినా, రెండో సెట్‌లో స్వైటెక్‌కు ఒక్క గేమ్‌ కూడా కోలుకునే అవకాశం ఇవ్వలేదు. అక్టోబర్ నుండి రిబాకినా ఆడిన 19 మ్యాచ్‌ల్లో 18 విజయాలు సాధించి టాప్-10 ప్లేయర్లపై తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు.

తొలిసారి సెమీస్‌లోకి జెస్సికా పెగులా

అమెరికా స్టార్ జెస్సికా పెగులా తన కెరీర్‌లో మొదటిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించారు. క్వార్టర్స్‌లో అమండా అనిసిమోవాపై 6-2, 7-6(1)తో విజయం సాధించారు. ఈ టోర్నీలో పెగులా ఇప్పటివరకు ఒక్క సెట్ కూడా ఓడిపోకుండా తన జోరును కొనసాగిస్తుండటం విశేషం.

మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ నేడే

నేడు మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్ జరగనున్నాయి. మొదటి సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అరీనా సబలెంక, ఉక్రెయిన్ స్టార్ ఎలీనా స్విటోలినాతో తలపడనుండగా, రెండో సెమీస్‌లో మాజీ ఛాంపియన్ ఎలీనా రిబాకినా, అమెరికా సంచలనం జెస్సికా పెగులా మధ్య హోరాహోరీ పోరు సాగనుంది.

రేపు పురుషుల సింగిల్స్ సెమీఫైనల్స్

పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్ సమరం జనవరి 30 శుక్రవారం నాడు ప్రారంభం కానుంది. టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్, ప్రస్తుత ఫామ్‌లో ఉన్న జానిక్ సినర్ మధ్య జరగబోయే మొదటి సెమీఫైనల్ మ్యాచ్ ఈ టోర్నీకే హైలైట్‌గా నిలవనుంది. ఇక రెండో సెమీఫైనల్‌లో స్పెయిన్ యువ కిశోరం కార్లోస్ అల్కరాజ్, జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌లు ఫైనల్ బెర్తు కోసం పోటీ పడనున్నారు.