
ఆస్ట్రేలియన్ ఓపెన్ సిన్నర్ జైత్రయాత్ర
రెండుసార్లు డిఫెండింగ్ చాంపియన్ జానిక్ సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తన జైత్రయాత్రను కొనసాగించాడు. తీవ్రమైన ఎండతో పాటు కాళ్ల కండరాలు బిగుసుకుపోయిన(క్రమ్ప్స్) ధైర్యంగా ఎదుర్కొని, అమెరికన్ ఆటగాడు ఎలియట్ స్పిజిర్రిపై కఠిన పోరులో గెలిచి నాలుగో రౌండ్‌కు అర్హత సాధించాడు. రాడ్ లేవర్ అరేనాలో జరిగిన ఈ మ్యాచ్ దాదాపు మూడు గంటల 45 నిమిషాలు పాటు సాగింది. తొలి సెట్‌ను కోల్పోయిన సిన్నర్, అద్భుతంగా తిరిగి పోరాడి 4-6, 6-3, 6-4, 6-4 స్కోరుతో విజయం సాధించాడు. మూడో సెట్‌లో 3-1తో వెనుకబడిన సమయంలో సిన్నర్ క్రమ్ప్స్‌తో ఇబ్బంది పడ్డాడు. కదలికలు, సర్వీస్‌లపై ప్రభావం పడింది. అదే సమయంలో తీవ్ర వేడి కారణంగా మ్యాచ్‌ను కొద్దిసేపు నిలిపివేశారు. 10 నిమిషాల విరామం తర్వాత కోర్ట్‌కు తిరిగివచ్చిన సిన్నర్, పూర్తి ఏకాగ్రతతో ఆటను మలుపు తిప్పాడు. ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శిస్తూ వరుసగా సెట్లు గెలిచి నాలుగో రౌండ్‌కు చేరాడు.
ఈ విజయంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో హ్యాట్రిక్ టైటిల్ లక్ష్యానికి సిన్నర్ మరో అడుగు ముందుకు వేశాడు. నాలుగో రౌండ్‌లో సిన్నర్‌కు స్వదేశీ ఆటగాడు లూసియానో డార్డెరీ సవాల్ విసరనున్నాడు. ఇది ఈ ఇద్దరి మధ్య తొలి ముఖాముఖి మ్యాచ్. డార్డెరీ, 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనలిస్ట్ కరెన్ ఖచానోవ్ను 7-6(5), 3-6, 6-3, 6-4తో ఓడించి రౌండ్–4కు చేరాడు.
ఇతర మ్యాచ్‌ల్లో ప్రపంచ నంబర్–5 లోరెన్జో ముసెట్టి, చెక్ ఆటగాడు టొమాస్ మాచాక్పై ఐదు సెట్ల ఉత్కంఠ భరిత పోరులో 5-7, 6-4, 6-2, 5-7, 6-2తో గెలిచి నాలుగో రౌండ్‌కు అర్హత సాధించాడు. ఇది ముసెట్టికి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తొలి రౌండ్–4 ప్రదర్శన. అలాగే ప్రపంచ నంబర్–7 బెన్ షెల్టన్ కూడా రౌండ్–4కు చేరాడు. ఆస్ట్రేలియా ఆటగాడు డేన్ స్వీనీపై గెలిచిన షెల్టన్, గత ఏడాది సెమీఫైనల్ ప్రదర్శనను మించి ఈసారి మరింత ముందుకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు.
ఫామ్‌ను కొనసాగిస్తున్న మాడిసన్ కీస్
డిఫెండింగ్ చాంపియన్ మాడిసన్ కీస్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ మాజీ నంబర్ వన్ కరోలినా ప్లిస్కోవాను కీస్ ఓడించి ప్రీ–క్వార్టర్ ఫైనల్స్ (రౌండ్ ఆఫ్ 16)కు అర్హత సాధించింది. కీస్, ప్లిస్కోవాపై 6-3, 6-3తో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆమె ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తన వరుస విజయాల సంఖ్యను 10కి పెంచుకుంది. రౌండ్ ఆఫ్ 16లో కీస్‌కు మరో అమెరికన్ స్టార్ జెస్సికా పెగులా సవాల్ విసరనుంది. ఈ ఇద్దరి మధ్య హెడ్-టు-హెడ్‌లో కీస్‌కు 2-1 ఆధిక్యం ఉంది. గత ఏడాది అడిలైడ్ ఇంటర్నేషనల్ ఫైనల్‌లో కీస్, పెగులాను 6-3, 4-6, 6-1తో ఓడించింది. ఆరవ సీడ్ పెగులా, క్వాలిఫయర్ ఒక్సానా సెలెఖ్‌మెటేవాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి 6-3, 6-2తో గెలిచింది. యూఎస్ ఓపెన్ మాజీ ఫైనలిస్ట్ అయిన పెగులా, ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తన ఉత్తమ ప్రదర్శన సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇతర మ్యాచ్‌లో ప్రపంచ నంబర్–4 అమాండా అనిసిమోవా, స్వదేశీ ప్రత్యర్థి పేటన్ స్టెయర్న్స్పై 6-1, 6-4తో గెలిచి నాలుగో రౌండ్‌కు చేరింది. ఇది అనిసిమోవాకు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో వరుసగా రెండోసారి రౌండ్–4 ప్రదర్శన కావడం విశేషం.
