Let's talk: editor@tmv.in
ఆస్ట్రేలియన్ ఓపెన్ వేడుకలో రోజర్ ఫెడరర్ మ్యాచ్

ఆస్ట్రేలియన్ ఓపెన్ వేడుకలో రోజర్ ఫెడరర్ మ్యాచ్

Pinjari Chand
14 జనవరి, 2026

టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెడరర్ మరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ వేదికపై అడుగుపెట్టనున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 ప్రారంభ వేడుకలో భాగంగా జరిగే ప్రదర్శన మ్యాచ్‌లో ఫెడరర్ పాల్గొననున్నట్లు Olympics.com వెల్లడించింది. ఈ మ్యాచ్‌లో అతనితో పాటు ఏటీపీ మాజీ నంబర్ వన్ ఆటగాళ్లు ఆండ్రే అగాసీ, పాట్రిక్ రాఫ్టర్, ల్లెయ్టన్ హ్యూయిట్ కూడా ఆడనున్నారు. ప్రారంభ వేడుక జనవరి 17 (శనివారం) నాడు మెల్బోర్న్‌లోని రాడ్ లేవర్ అరేనాలో జరుగుతుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రధాన డ్రా మ్యాచ్‌లు జనవరి 18 నుంచి ప్రారంభం కానున్నాయి.

అత్రుతగా ఎదురు చూస్తున్నా

ఫెడరర్ మాట్లాడుతూ ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను నేను ‘హ్యాపీ స్లామ్’ అని పిలిచిన రోజులు ఎంతో కాలం క్రితం జరిగినట్లుగా అనిపిస్తున్నాయి. అయినా ఇక్కడ గడిపిన ప్రతి క్షణం గుర్తొస్తే ఇప్పటికీ చిరునవ్వు వస్తుందని అన్నారు. రాడ్ లేవర్ అరేనాలో నేను అనుభవించిన భావోద్వేగాలు మాటల్లో చెప్పలేనివి. ‘నార్మన్’ ట్రోఫీని (నార్మన్ బ్రూక్స్ చాలెంజ్ కప్) ఆరు సార్లు లిఫ్ట్ చేయడం, స్వయంగా రాడ్ లేవర్ ముందే ఆడిన గౌరవం, బలమైన ప్రత్యర్థులతో పోటీపడిన క్షణాలు, ఆస్ట్రేలియన్ అభిమానుల అపూర్వమైన ప్రేమ – ఇవన్నీ నా జీవితంలో మరచిపోలేని అనుభవాలు.

2017లో మళ్లీ ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడం నా అత్యంత మధురమైన గ్రాండ్‌స్లామ్ జ్ఞాపకాలలో ఒకటి. 2018లో మళ్లీ టైటిల్‌ను కాపాడుకోవడం మరో కల నెరవేరినట్టే. మళ్లీ ఆస్ట్రేలియాకు వచ్చి అభిమానులతో కలిసి మరిన్ని అద్భుత క్షణాలను సృష్టించేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని ఫెడరర్ పేర్కొన్నారు.

చాలా ఆనందంగా ఉంది

టోర్నమెంట్ డైరెక్టర్ క్రెయిగ్ టైలీ మాట్లాడుతూ ఈ ప్రత్యేకమైన ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రారంభ వేడుకను పరిచయం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ కొత్త ఆవిష్కరణలకు పేరుగాంచిన టోర్నమెంట్ అయినప్పటికీ, 120 ఏళ్ల గొప్ప చరిత్రకు కూడా మేమే సంరక్షకులం. ఈ ప్రారంభ వేడుకతో కొత్త టెన్నిస్ సీజన్ అద్భుతంగా ప్రారంభం కానుంది. రోజర్ ఫెడరర్ మళ్లీ రాడ్ లేవర్ అరేనాలో ఆడటం, అతనితో పాటు అగాసీ, పాట్, ల్లెయ్టన్ వంటి దిగ్గజాలను చూడటం అభిమానులకు అపూర్వ అనుభూతి అవుతుందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం 44 ఏళ్ల ఫెడరర్ తన చివరి ఆస్ట్రేలియన్ ఓపెన్ మ్యాచ్‌ను 2020లో నోవాక్ జోకోవిచ్‌తో ఆడాడు. అనంతరం 2022లో టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు.