
ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత ఎలినా రైబా‘క్వీన్’
2022లో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ గెలిచి ప్రపంచ టెన్నిస్‌ను ఆశ్చర్యపరిచిన ఎలినా రైబాకినా, 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో అర్యనా సబలెంకా చేతిలో ఓడిన తర్వాత క్రమంగా ఫామ్ కోల్పోయింది. 2024లో ఆమె కోచ్ స్టెఫానో వుకోవ్‌పై చెలరేగిన వివాదాలు, ఆరోగ్య సమస్యలు, తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగా ఆటపై పూర్తిగా దృష్టి సారించలేకపోయింది. దీంతో ‘ఒక్క గ్రాండ్‌స్లామ్‌తోనే ఆమె కథ ముగిసిపోయింది’ అనే అభిప్రాయా లు వెలువడ్డాయి. అయితే ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ, రైబాకినా 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచి బలమైన పునరాగమనం ఇచ్చింది. గత 21 మ్యాచ్‌ల్లో ఆమె ప్రదర్శన చూస్తే, పడిన శ్రమ, మళ్లీ టాప్‌కు చేరాలన్న తపన స్పష్టంగా కనిపించింది. ఈ టోర్నీలో ప్రపంచ టాప్-10 ర్యాంక్ ఆటగాళ్లపై ఆధిపత్యం చాటిన రైబాకినా, పూర్తి ఆత్మవిశ్వాసంతో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుని ‘చాంపియన్ తిరిగొచ్చింది’ అనే సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చింది.
కజకస్తాన్ టెన్నిస్ స్టార్ ఎలినా రైబాకినా మరోసారి గ్రాండ్‌స్లామ్ కిరీటాన్ని ముద్దాడింది. శనివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్-1 అర్యనా సబలెంకాను 6-4, 4-6, 6-4 తేడాతో ఓడించి తన రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను గెలుచుకుంది. మూడో సెట్‌లో 0-3తో వెనుకబడిన దశలో అద్భుతంగా పుంజుకున్న రైబాకినా, వరుసగా ఐదు గేమ్స్ గెలిచి మ్యాచ్‌పై పూర్తి ఆధిపత్యం సాధించింది. చివరి గేమ్‌ను ఏస్‌తో ముగించి విజయం ఖరారు చేసింది. 2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌లో సబలెంకా చేతిలో ఎదురైన పరాజయానికి ఈసారి అదే వేదికపై ఘన ప్రతీకారం తీర్చుకుంది.
విజయం అనంతరం రైబాకినా మాట్లాడుతూ, బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల భావోద్వేగాలు ఉప్పొంగాయని తెలిపింది.
హృదయ స్పందన చాలా వేగంగా ఉంది. కానీ చివరి సర్వీస్ గేమ్‌ను గెలవగలననే నమ్మకం నాకుంది. ఈ విజయం నాకు ఎంతో ఊరటనిచ్చింది. మిగిలిన సీజన్‌కు ఇది భారీ ఆత్మవిశ్వాసం ఇస్తుందని పేర్కొంది.
వరుస విజయాలు
26 ఏళ్ల రైబాకినా మాస్కోలో జన్మించినప్పటికీ కజకస్తాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఆమె 2022లో వింబుల్డన్ గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించింది. ఆ తర్వాత ఫామ్ కొంత తగ్గినా, ఈ టోర్నీతో మళ్లీ శిఖర స్థాయికి చేరుకుంది. ఈ విజయంతో ఆమె ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్-3 స్థానానికి చేరనుంది. గత 21 మ్యాచ్‌ల్లో 20 విజయాలు సాధించిన రైబాకినా, టాప్-10 ఆటగాళ్లపై వరుసగా 10 విజయాలు నమోదు చేయడం విశేషం. రాడ్ లేవర్ అరేనాలో రెండు గంటల 18 నిమిషాల పాటు సాగిన ఈ ఫైనల్‌లో ఆమె 28 విన్నర్స్ సాధించింది. విజేతకు అందించే ట్రోఫీని 2001, 2002 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్ జెన్నిఫర్ కాప్రియాటి ఆమెకు అందజేశారు.
ఈ టోర్నీకి ముందు ఇద్దరూ ఒక్క సెటు కూడా కోల్పోకుండా ఫైనల్‌కు చేరడం విశేషం. వింబుల్డన్ 2008 తర్వాత, ఆస్ట్రేలియాలో 2004 తర్వాత ఇదే తొలిసారి. ఇద్దరి మధ్య జరిగిన 15వ ముఖాముఖి పోరులో రైబాకినా తన క్లాస్ ఆటతో సబలెంకాపై ఆధిపత్యం చెలాయించింది. ఈ విజయంతో గ్రాస్ కోర్ట్ (వింబుల్డన్), హార్డ్ కోర్ట్ (ఆస్ట్రేలియన్ ఓపెన్)లో తన తొలి రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించిన ఓపెన్ ఎరాలో ఆరో క్రీడాకారిణిగా రైబాకినా నిలిచింది. అంతేకాదు, టాప్-3 ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తొలి క్రీడాకారిణిగా కూడా ఆమె రికార్డు సృష్టించింది (2019లో నయోమి ఒసాకా తర్వాత).
విజయం అనంతరం రైబాకినా రాడ్ లేవర్ అరేనాలో కజకస్తాన్ జెండాను ప్రదర్శిస్తూ ట్రోఫీతో ఫోటోలు దిగింది. తన కోచ్ స్టెఫానో వుకోవ్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. గత ఏడాది కొంతకాలం సస్పెన్షన్ ఎదుర్కొన్నప్పటికీ, తన ఆటను మెరుగుపరచడంలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొంది.
ఇక ఓటమి పాలైన సబలెంకా మాట్లాడుతూ 3-0తో ముందుండగా మ్యాచ్ ఒక్కసారిగా చేయి దాటిపోయిందని అంగీకరించింది. ఈ రోజు ఓడిపోయాను. రేపు గెలుస్తాననే ఆశతో ముందుకు సాగుతాను అని వ్యాఖ్యానించింది. మ్యాచ్ అనంతరం ఇద్దరూ నెట్ దగ్గర పరస్పరం ఆలింగనం చేసుకోగా, ప్రశాంతంగా నిలిచిన రైబాకినా ప్రేక్షకుల వైపు చేయెత్తి తన చారిత్రక గెలుపును ఆస్వాదించింది.
