Let's talk: editor@tmv.in
ఆస్ట్రేలియన్ ఓపెన్: ప్రీక్వార్టర్ ఫైనల్స్‌లోకి సాత్విక్-చిరాగ్ జోడీ

ఆస్ట్రేలియన్ ఓపెన్: ప్రీక్వార్టర్ ఫైనల్స్‌లోకి సాత్విక్-చిరాగ్ జోడీ

Shaik Mohammad Shaffee
19 నవంబర్, 2025

ఆసియా క్రీడల ఛాంపియన్స్ అయిన సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి- చిరాగ్ శెట్టి జోడీ మంగళవారం సిడ్నీలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. బీడబ్ల్యూఎఫ్ సూపర్ 500 టోర్నమెంట్‌లో టాప్ సీడ్‌గా ఉన్న ఈ భారత బ్యాడ్మింటన్ జోడీ, రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లో చైనీస్ తైపీకి చెందిన చాంగ్ కోచి-పో లీవెయ్ అనే అన్‌సీడెడ్ జోడీపై 48 నిమిషాల్లో 25-23, 21-16 తేడాతో విజయం సాధించింది. ఈ రెండు జంటలు తలపడడం ఇదే తొలిసారి.

తొలి గేమ్‌లో భారత జోడీ నెమ్మదిగా మొదలుపెట్టి, 6-2తో వెనుకబడింది. అయితే వరుసగా నాలుగు పాయింట్లు సాధించి స్కోరును సమం చేయగలిగింది. 19-19 వద్ద గేమ్ మరింత ఉత్కంఠభరితంగా మారింది. ఈ సమయంలో టాప్ సీడ్స్ తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ, ప్రత్యర్థుల మూడు గేమ్ పాయింట్లను కాపాడుకుని, చివరికి తొలి గేమ్‌ను గెలుచుకున్నారు.

రెండో గేమ్ కూడా దాదాపు అదే విధంగా సాగింది. చిరాగ్-సాత్విక్ 7-4తో ఆధిక్యంలోకి వెళ్లినా, చైనీస్ తైపీ జోడీ పోరాడి 8-8తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత 10-8తో ముందంజలో నిలిచింది. అయితే ఇక్కడి నుంచి భారత జోడీ గేర్ మార్చి, వరుసగా ఆరు పాయింట్లు సాధించి నాలుగు పాయింట్ల ఆధిక్యాన్ని దక్కించుకుంది. చాంగ్ కోచి, పో లీవెయ్ ఆ ఆధిక్యాన్ని రెండు పాయింట్లకు తగ్గించినప్పటికీ, చిరాగ్-సాత్విక్ వరుసగా మూడు పాయింట్లు సాధించి మ్యాచ్‌ను ముగించారు. క్వార్టర్ ఫైనల్స్‌లో స్థానం కోసం చిరాగ్-సాత్విక్ తదుపరి రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన సు చింగ్ హెంగ్- వు గువాన్ క్సున్ జోడీతో తలపడనున్నారు.

మరోవైపు భారత అగ్రశ్రేణి మహిళల డబుల్స్ జోడీ అయిన ట్రీసా జాలీ-గాయత్రీ గోపీచంద్‌కు నిరాశ ఎదురైంది. జూలై తర్వాత తొలిసారి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌కు తిరిగి వచ్చిన ఈ జోడీ, నాలుగో సీడ్‌గా, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉన్నప్పటికీ, ఇండోనేషియాకు చెందిన ప్రపంచ ర్యాంకింగ్ 83వ స్థానంలో ఉన్న ఫెబ్రియాన్ ద్వీపుజి కుసుమా-మెయిలిసా ట్రయాస్ పుస్పిటసరి జోడీ చేతిలో ఓటమి పాలైంది. 40 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ 10-21, 14-21 తేడాతో ఓటమిని చవిచూసింది. కాగా ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతక విజేతలైన లక్ష్యసేన్, హెచ్‌ఎస్ ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్‌, ఆయుష్ శెట్టి తమ పురుషుల సింగిల్స్ పోరాటాన్ని నేటి నుంచి ప్రారంభించనున్నారు.

ఆస్ట్రేలియన్ ఓపెన్: ప్రీక్వార్టర్ ఫైనల్స్‌లోకి సాత్విక్-చిరాగ్ జోడీ - Tholi Paluku