Let's talk: editor@tmv.in
ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలిమ్యాచ్ లో సబలెంకా విజయం

ఆస్ట్రేలియన్ ఓపెన్ తొలిమ్యాచ్ లో సబలెంకా విజయం

Pinjari Chand
19 జనవరి, 2026

ప్రపంచ నంబర్ వన్, రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంపియన్ అయిన ఆర్యనా సబలెంకా, తొలి రౌండ్ మ్యాచ్‌లో ఒత్తిడిలోనూ ఆరంభాన్ని అధిగమించి విజయంతో టోర్నీని ప్రారంభించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఫ్రెంచ్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీ టియాంట్సోవా రాకోటోమంగా రాజవోనహ్పై 6–4, 6–1తో గెలుపొందింది. రాడ్ లేవర్ అరేనాలో జరిగిన ఈ మ్యాచ్‌లో, స్టాండ్స్‌లో టెన్నిస్ దిగ్గజాలు రాడ్ లేవర్, రోజర్ ఫెదరర్ హాజరుకావడంతో తాను కొంత ఒత్తిడికి గురయ్యానని సబలెంకా అంగీకరించింది. వాళ్లు ప్రేక్షకుల మధ్య ఉన్నారని చూసి కొంచెం ఒత్తిడిగా అనిపించిందని ఆమె చెప్పింది.

మ్యాచ్ ఆరంభంలో తొలి మూడు పాయింట్లు కోల్పోయిన సబలెంకా, తన తొలి సర్వీస్ గేమ్‌ను కూడా చేజార్చుకుంది. అయితే ఆ తర్వాత ఆటలో పట్టు సాధించి ప్రత్యర్థిని మట్టికరిపించింది. నేను నా ఉత్తమమైన ఆటతో మ్యాచ్‌ను ప్రారంభించలేదు. ఆమె చాలా బాగా ఆడింది. ఆరంభం కాస్త కష్టంగా అనిపించింది. కానీ రెండో సెట్ చివర్లో నా రిథమ్ దొరికింది. అది చాలా సంతోషంగా ఉందని సబలెంకా తెలిపింది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్‌కు ముందు బ్రిస్బేన్‌లో టైటిల్ గెలుచుకున్న సబలెంకా, ప్రస్తుతం మహిళల ప్రపంచ నంబర్ వన్‌గా 74వ వారంలో కొనసాగుతోంది. గతేడాది మాడిసన్ కీస్ చేతిలో ఫైనల్లో ఓడినా, 2023, 2024లో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను ఆమె కైవసం చేసుకుంది.

ఆన్‌కోర్ట్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నేను స్టాండ్స్ వైపు ఒక్కసారి చూశాను. రాడ్ లేవర్, రోజర్ ఫెడరర్ పక్కపక్కనే కూర్చుని ఉన్నారు. నేను వారికి పెద్ద అభిమానిని. వాళ్లు ఆనందించేలా మంచి టెన్నిస్ ఆడాలని అనుకున్నాను. ఒత్తిడి మాత్రం ఖచ్చితంగా ఉంది. ‘అక్కడికి చూడొద్దు, చూడొద్దు’ అనుకుంటూ వెళ్లాను అని నవ్వుతూ చెప్పింది. మొదటి మ్యాచ్ కాబట్టి ఆటలో నేను ఎక్కడ ఉన్నానో అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుందని ఆమె పేర్కొంది.

తొలి రోజు ఆటలో విశేషాలు

పురుషుల విభాగంలో గతేడాది రన్నరప్ అలెగ్జాండర్ జ్వెరెవ్, నెమ్మదిగా మ్యాచ్ ఆరంభించి తర్వాత గట్టెక్కాడు. గాబ్రియేల్ డియాలోపై 6–7 (7), 6–1, 6–4, 6–2తో విజయం సాధించి వరుసగా 10వ ఏడాది మెల్‌బోర్న్ పార్క్‌లో రెండో రౌండ్‌కు చేరాడు.

మహిళల విభాగంలో ఇద్దరు సీడెడ్ ఆటగాళ్లు తొలి రోజే నిష్క్రమించారు.

ఎల్సా జాక్‌మోట్, 20వ సీడ్ మార్టా కోస్ట్యూక్‌ను 6–7 (4), 7–6 (4), 7–6 (7)తో ఓడించింది.

టర్కీ క్వాలిఫయర్ జైనెప్ సోన్మెజ్, 11వ సీడ్ ఎకటెరినా అలెగ్జాండ్రోవాపై 7–5, 4–6, 6–4తో సంచలన విజయం సాధించింది.

ఏడో సీడ్ జాస్మిన్ పావోలినీ, అలియక్సాండ్రా సస్నోవిచ్‌పై 6–1, 6–2తో గెలిచింది. అలాగే ఎలినా స్విటోలినా, మారియా సక్కారి కూడా స్ట్రైట్ సెట్లలో ముందుకు సాగారు. మహిళల విభాగంలో వింబుల్డన్ మాజీ ఛాంపియన్ మార్కెటా వోండ్రౌసోవా భుజం గాయంతో టోర్నీ నుంచి తప్పుకోగా, ఆమె స్థానంలో లక్కీ లూజర్ టేలర్ టౌన్సెండ్ ప్రధాన డ్రాలోకి వచ్చింది.

పురుషుల విభాగంలో, 29వ సీడ్ ఫ్రాన్సిస్ టియాఫో, జేసన్ కుబ్లర్‌పై విజయం సాధించగా, అమెరికన్ పోరులో మైఖేల్ జెంగ్, సెబాస్టియన్ కొర్డాను ఐదు సెట్ల పోరులో ఓడించాడు. 20వ సీడ్ ఫ్లావియో కోబోల్లి, బ్రిటిష్ క్వాలిఫయర్ ఆర్థర్ ఫెరీ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి సీడెడ్ పురుషుల ఆటగాడిగా నిలిచాడు.