Let's talk: editor@tmv.in
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో చరిత్రకు చేరువలో జోకోవిచ్

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో చరిత్రకు చేరువలో జోకోవిచ్

Pinjari Chand
23 జనవరి, 2026

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ప్రపంచ టెన్నిస్ దిగ్గజాలు నోవాక్ జోకోవిచ్, స్టాన్ వావ్రింకా చరిత్రాత్మక ప్రదర్శనతో అభిమానులను అలరించారు. 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించిన జోకోవిచ్, ఇటాలియన్ క్వాలిఫయర్ ఫ్రాన్సిస్కో మాయెస్ట్రెల్లిపై 6-3, 6-2, 6-2తో గెలిచి, గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లలో 399వ విజయం నమోదు చేశాడు. దీంతో 400 విజయాలు సాధించిన తొలి ఆటగాడిగా నిలవడానికి అతడు ఒక్క మ్యాచ్ దూరంలోనే ఉన్నాడు. 38 ఏళ్ల జోకోవిచ్ ప్రస్తుతం 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ లక్ష్యంగా దూసుకెళ్తున్నాడు. అది సాధిస్తే, ఓపెన్ ఎరాలో అత్యధిక వయసులో గ్రాండ్‌స్లామ్ గెలిచిన ఆటగాడిగా కేన్ రోజ్‌వాల్ రికార్డును అధిగమిస్తాడు.

వావ్రింకా ఘన విజయం

ఇదే రోజు 40 ఏళ్ల 310 రోజుల వయసులో స్టాన్ వావ్రింకా మరో చరిత్ర సృష్టించాడు.

21 ఏళ్ల ఆర్థర్ జియా పై జరిగిన 4 గంటల 30 నిమిషాల సుదీర్ఘ పోరులో 4-6, 6-3, 3-6, 7-5, 7-6(3)తో గెలిచి, 40 ఏళ్లు దాటిన తర్వాత గ్రాండ్‌స్లామ్ మూడో రౌండ్‌కు చేరిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్ 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఇప్పటివరకు జరిగిన అత్యంత దీర్ఘ మ్యాచ్ గా నమోదైంది. ఈ ఏడాది చివర్లో రిటైర్ కానున్న వావ్రింకా తదుపరి రౌండ్‌లో తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్‌ను ఎదుర్కొననున్నాడు. ఈ ఏడాది చివర్లో రిటైర్మెంట్ ప్రకటించిన వావ్రింకా, విజయం అనంతరం ప్రేక్షకులను ఉద్దేశించి ‘ఇప్పుడు ఒక బీర్ తాగాలి. దీనికి నేను అర్హుడిని’ అని సరదాగా వ్యాఖ్యానించాడు.

ఇతర ముఖ్య ఫలితాలు

• ప్రపంచ నంబర్ వన్ జానిక్ సిన్నర్ 6-1, 6-4, 6-2తో జేమ్స్ డక్‌వర్త్‌ను ఓడించి టైటిల్ హ్యాట్రిక్ దిశగా ముందుకెళ్లాడు

• మహిళల విభాగంలో ఇగా స్వియాంటెక్ విజయం సాధించగా, డిఫెండింగ్ చాంపియన్ మాడిసన్ కీస్ మూడో రౌండ్‌కు చేరింది

పురుషుల విభాగంలో కొన్ని కీలక సీడ్స్ నిష్క్రమించాయి

రికార్డు స్థాయి ప్రేక్షకులు

డే, నైట్ సెషన్లలో కలిపి లక్షా 3 వేల 720 మంది ప్రేక్షకులు హాజరై మరోసారి టోర్నీ రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు మొత్తం ప్రేక్షకుల సంఖ్య 5 లక్షల 8 వేల 430కు చేరింది. రాత్రి సెషన్ ప్రారంభానికి ముందు, గత నెల బాండీ బీచ్ ఉగ్రదాడిలో మరణించిన 15 మందికి మౌనం పాటించి, లైట్ విల్ విన్ అనే సందేశంతో మెల్‌బోర్న్ పార్క్‌లో నివాళులు అర్పించారు.