
ఆసీస్ సిరీస్ రోహిత్, కోహ్లీలకు అగ్నిపరీక్ష: రవిశాస్త్రి
భారత క్రికెట్ దిగ్గజాలైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల 2027 వన్డే ప్రపంచకప్ భవితవ్యంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ క్రికెట్‌లో కేవలం వన్డే ఫార్మాట్‌కు మాత్రమే పరిమితమైన ఈ ఇద్దరు సీనియర్ల భవిష్యత్తు పూర్తిగా వారి ప్రస్తుత ఫామ్, ఫిట్‌నెస్, పోరాటస్ఫూర్తిపైనే ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాతో త్వరలో జరగబోయే వన్డే సిరీస్ వీరిద్దరికీ ఒక రకంగా 'ఫిట్‌నెస్ టెస్ట్' లాంటిదని, ఇందులో వారి ప్రదర్శన భవిష్యత్తును నిర్ణయిస్తుందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.
సిడ్నీలో విలేకరులతో మాట్లాడిన రవిశాస్త్రి, రోహిత్ (38), కోహ్లీ (36) వంటి ఆటగాళ్లకు 2027 ప్రపంచకప్ ఆడాలనే కోరిక ఉండడం సహజమేనని అన్నారు. అయితే దానిని చేరుకోవడానికి గల సవాళ్లను ఆయన వివరించారు. "వారు ఇంకా జట్టులో కొనసాగుతున్నారు.. అంటే వారు ప్రణాళికల్లో ఉన్నారని అర్థం. అయితే వారి భవిష్యత్తు ఫామ్, ఫిట్ నెస్, పోరాట స్ఫూర్తిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది" అని రవిశాస్త్రి నొక్కి చెప్పారు.
ఆస్ట్రేలియా సిరీస్ కీలకం
రోహిత్, కోహ్లీ దాదాపు ఏడు నెలల విరామం తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వస్తున్నారు. ఈ సందర్భంగా రవిశాస్త్రి ఈ సిరీస్‌ను వారికి చాలా కీలకమైనదిగా, ఒక అగ్నిపరీక్షగా అభివర్ణించారు. "వారి ప్రదర్శన ఎలా ఉండబోతుందో చూడడానికి ఈ సిరీస్ చాలా ముఖ్యం. ఈ సిరీస్ ముగిసే సమయానికి వారికే ఒక స్పష్టత వస్తుంది. అప్పుడు వారు తమ భవిష్యత్తుపై ఒక ఆలోచన తీసుకుంటారు" అని శాస్త్రి తెలిపారు.
అనుభవం విలువైనదే.. కానీ
సీనియర్ ఆటగాళ్లు అనుభవం పరంగా జట్టుకు చాలా విలువైనవారని రవిశాస్త్రి గుర్తు చేశారు. ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ వంటి పెద్ద టోర్నమెంట్లలో అనుభవం గల ఆటగాళ్లు ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొని రాణించగలరని చెప్పారు. కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ టెస్టులు, టీ20ల నుంచి వైదొలగడం వల్ల, వన్డే ప్రపంచకప్‌కు ముందు మ్యాచ్‌ల ప్రాక్టీస్ తక్కువగా లభిస్తుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మ్యాచ్‌లు లేని సమయంలో దేశవాళీ క్రికెట్‌లో ఆడటం ద్వారా నిలకడగా ఫామ్‌ను, ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం వారికి అత్యవసరం అని శాస్త్రి పరోక్షంగా సూచించారు. శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ వంటి యువ క్రికెటర్లు దూసుకువస్తున్న తరుణంలో రోహిత్, కోహ్లీ తమ స్థానాలను సుస్థిరం చేసుకోవాలంటే నిలకడగా పరుగులు సాధించాల్సిన అవసరం ఉందని శాస్త్రి నొక్కి చెప్పారు.
యువ ప్రతిభతో టీమిండియా మరింత బలం
భారత జట్టు రెడ్-బాల్ (టెస్ట్) ఫార్మాట్ కంటే వైట్-బాల్ (పరిమిత ఓవర్ల) క్రికెట్‌లో మరింత బలంగా ఉందని మాజీ ఆల్‌రౌండర్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. "భారత్ రెడ్ బాల్ కంటే వైట్ బాల్ ఫార్మాట్‌లో చాలా బలంగా ఉంది. యువ ఆటగాళ్లు తమ స్థానాల కోసం గట్టి పోటీని ఇస్తున్నారనే విషయం విరాట్, రోహిత్‌లకు తెలుసు" అని ఆయన అన్నారు.
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియా కలిగి ఉన్న యువ ప్రతిభ గురించి రవిశాస్త్రి మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో తిలక్ వర్మ ప్రదర్శనను ప్రత్యేకంగా ప్రస్తావించారు. "తిలక్ వర్మ ఆసియా కప్ ఫైనల్‌లో ఆడిన ఇన్నింగ్స్ అద్భుతం. ఒత్తిడిలో అలా ఆడటం నిజంగా ప్రశంసించదగ్గ విషయం. జట్టులో యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ వంటి మంచి యువ ప్రతిభ ఉంది. అలాగే హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ వంటి చాలా మంది ఆల్‌రౌండర్లు కూడా ఉన్నారు. కాబట్టి ఇది చాలా బలమైన వైట్-బాల్ యూనిట్" అని రవిశాస్త్రి తెలిపారు. మొత్తంగా 2027 ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీలు ఆడేది లేనిది వారి వ్యక్తిగత ఫిట్‌నెస్, పోరాటస్ఫూర్తి, నిలకడగా రాణించే ఆటతీరుపైనే ఆధారపడి ఉంటుందని రవిశాస్త్రి అన్నారు.
