
ఆసియా స్కీ మౌంటెనీరింగ్ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించిన భారత్
ఇండియన్ వింటర్ గేమ్స్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడింది. చైనాలోని యాబులీ స్కీ రిసార్ట్‌లో జరుగుతున్న '2026 ఐఎస్ఎంఎఫ్ ఆసియా స్కీ మౌంటెనీరింగ్ ఛాంపియన్‌షిప్' తొలిరోజే భారత అథ్లెట్లు తమ సత్తా చాటారు. ఆసియా ఖండంలోని దిగ్గజ దేశాలకు దీటుగా పోటీనిస్తూ, భారత అథ్లెట్లు అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు. అత్యంత కఠినమైన 'వర్టికల్ రేస్' విభాగంలో బరిలోకి దిగిన భారత అథ్లెట్లు ముగ్గురూ టాప్-10లో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించారు.
టాప్-10లో ముగ్గురు భారతీయులు
ఎంతో పట్టుదల, శారీరక బలం అవసరమైన ఈ రేస్‌లో భారత అథ్లెట్లు ఆసియాలోనే అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. పురుషుల విభాగంలో సిద్ధార్థ్ గడేకర్ 7వ స్థానంలో, శార్దూల్ థపలియాల్ 8వ స్థానంలో నిలవగా.. మహిళల విభాగంలో భారత్ నుంచి పోటీపడ్డ ఏకైక అథ్లెట్ కామ్య కార్తికేయన్ 7వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఆసియా స్థాయి ఛాంపియన్‌షిప్‌లో ఇలా ముగ్గురు భారతీయ ఆటగాళ్లు ఒకేసారి టాప్-10లో నిలవడం ఇదే మొదటిసారి. ఇటీవల గుల్మార్గ్‌లో జరిగిన 'ఖేలో ఇండియా' పోటీల్లో ఆడిన అనుభవం ఈ ఘనత సాధించడంలో ఎంతో ఉపయోగపడింది.
నాలుగేళ్ల కృషి
ఈ చారిత్రక విజయం వెనుక గత నాలుగేళ్లుగా స్కీమో ఇండియా ఫెడరేషన్ చేస్తున్న కృషి దాగి ఉంది. అంతర్జాతీయ స్కీ మౌంటెనీరింగ్ ఫెడరేషన్ నిబంధనలకు అనుగుణంగా అథ్లెట్లను సిద్ధం చేస్తున్నట్లు ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రవీణ్ సూద్ తెలిపారు. "కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మన అథ్లెట్లకు ప్రపంచ స్థాయి వేదికలను కల్పిస్తున్నాం. ఈ ఏడాది జాతీయ ఛాంపియన్‌షిప్, ఖేలో ఇండియా క్రీడలను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించడం వల్లే ఈ వేదికపై భారత్ తన సత్తా చాటగలిగింది" అని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఇది ఆరంభం మాత్రమే..
ఆసియా స్థాయిలో భారత అథ్లెట్లు నమోదు చేసిన అత్యుత్తమ ప్రదర్శన ఇదేనని, వింటర్ గేమ్స్‌లో దేశం సాధించబోయే మరిన్ని విజయాలకు ఇది నాంది మాత్రమేనని అధికారులు తెలిపారు. ఈ పోటీలు మార్చి 20 వరకు జరగనుండగా, భారత అథ్లెట్లు మరో రెండు కీలక రేసుల్లో తలపడనున్నారు. తొలి రోజు లభించిన ఉత్సాహంతో తదుపరి పోటీల్లోనూ పతకాలు సాధించాలనే పట్టుదలతో భారత బృందం సిద్ధంగా ఉంది. యాబులీ మంచు కొండలపై భారత ఆటగాళ్లు మరిన్ని అద్భుతాలు చేస్తారని క్రీడాభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
