
ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్: రుద్రాంక్ష్ ‘పసిడి’ గురి
దేశ రాజధాని న్యూఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌లో జరుగుతున్న ఆసియా రైఫిల్/పిస్టల్ ఛాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. మూడో రోజు పోటీల్లోనూ భారత్ పతకాల పంట పండించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల విభాగంలో రుద్రాంక్ష్ పాటిల్ స్వర్ణాన్ని ముద్దాడగా, మరో భారత షూటర్ అర్జున్ బాబుటా రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
హోరాహోరీగా సాగిన ఫైనల్
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్‌లో రుద్రాంక్ష్, అర్జున్ బాబుటా ఆరంభంలో కాస్త వెనుకబడ్డారు. అయితే, రెండో సిరీస్ నుంచి పుంజుకున్న రుద్రాంక్ష్ 16వ షాట్ సమయానికి అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. చివరి వరకు అదే జోరును కొనసాగించి 251.9 పాయింట్లతో తన తొలి ఆసియా ఛాంపియన్‌షిప్ పతకాన్ని సాధించాడు. అర్జున్ బాబుటా 250.7 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, జపాన్‌కు చెందిన నవోయా ఒకడా (229.3) కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. విశాల్ సింగ్ ఐదో స్థానంలో నిలిచినప్పటికీ.. రుద్రాంక్ష్, అర్జున్, విశాల్‌లతో కూడిన భారత జట్టు 1884.7 స్కోరుతో టీమ్ విభాగంలో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది.
జూనియర్ల విభాగంలో క్లీన్ స్వీప్
జూనియర్ పురుషుల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్ ఏకంగా మూడు పతకాలను (క్లీన్ స్వీప్) గెలుచుకుంది. హిమాన్షు ధిల్లాన్ మొదటి నుంచి ఆధిక్యాన్ని ప్రదర్శించి స్వర్ణాన్ని సాధించగా, అన్ష్ దాబాస్ రజతం, నరేన్ ప్రణవ్ కాంస్య పతకాలను గెలుచుకున్నారు. టీమ్ విభాగంలోనూ హిమాన్షు, నరేన్, అభినవ్ షా కూటమి భారత్‌కు స్వర్ణాన్ని అందించారు.
యూత్ కేటగిరీలో భాను ప్రతాప్ సింగ్ చౌదరి (247.2) రజత పతకం సాధించాడు. అన్షుల్ బాత్రా, యశ్ పాండేలతో కలిసి భాను ప్రతాప్ టీమ్ విభాగంలో భారత్‌కు స్వర్ణాన్ని తెచ్చిపెట్టాడు.
మిక్స్‌డ్ టీమ్ విభాగాల్లోనూ పసిడి మెరుపులు
అంతకుముందు జరిగిన మిక్స్‌డ్ టీమ్ పోటీల్లోనూ భారత్ పసిడి పతకాలతో సత్తా చాటింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జూనియర్ విభాగంలో ముఖేష్ నెలవల్లి, వంశిక చౌదరి జోడీ ఇండోనేషియా జంటపై ఘనవిజయం సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. అదేవిధంగా, యూత్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో గిరీష్ గుప్తా, శిక్షా శరణ్ జంట సైతం అద్భుత ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాలను సొంతం చేసుకుంది.
పతకాల పట్టికలో అగ్రస్థానం
మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొత్తం 6 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో భారత్ పతకాల పట్టిక మొత్తం 26కు (16 స్వర్ణాలు, 8 రజతాలు, 2 కాంస్యాలు) చేరింది. నేడు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, పురుషుల 50 మీటర్ల పిస్టల్ పోటీలు జరగనున్నాయి.
