
ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ బిడ్డ ఈషా సింగ్‌కు స్వర్ణం
న్యూఢిల్లీలో జరుగుతున్న ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్-2026లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. బుధవారం కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్‌లో జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో తెలంగాణ తేజం , ఒలింపియన్ ఈషా సింగ్ స్వర్ణ పతకంతో మెరిసింది. వ్యక్తిగత విభాగంతో పాటు జట్టు విభాగంలోనూ భారత్‌కు పతకాలు రావడంతో బుధవారం ఒక్కరోజే భారత్ ఖాతాలో రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం చేరాయి.
గురి తప్పని ఈషా.. నిరాశపరిచిన మను బాకర్
ఆసియా క్రీడల రజత పతక విజేత ఈషా సింగ్ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. ఒత్తిడిని అధిగమిస్తూ 239.8 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. 2024 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కూడా ఈషా ఇదే విభాగంలో స్వర్ణం గెలవడం విశేషం. ఇదే ఫైనల్‌లో వరల్డ్ నంబర్-2 సురుచి ఇందర్ సింగ్ (197.7) నాలుగో స్థానంతో పతకాన్ని చేజార్చుకోగా, స్టార్ షూటర్ మను బాకర్ ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే మను బాకర్ తన తదుపరి పోటీలైన 25 మీటర్ల పిస్టల్, 10 మీటర్ల మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లలో సత్తా చాటాలని పట్టుదలతో ఉంది.
టీమ్ ఈవెంట్లో పసిడి కాంతి
వ్యక్తిగత విభాగంలో పతకాలు రాకపోయినా, టీమ్ ఈవెంట్లో భారత మహిళల జట్టు సత్తా చాటింది. క్వాలిఫైయింగ్ రౌండ్‌లో సురుచి సింగ్ (576), మను బాకర్ (575), ఈషా సింగ్ (575) అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొత్తం 1726 పాయింట్లతో భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించారు. క్వాలిఫైయింగ్ రౌండ్‌లో సైన్యం 584 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచినప్పటికీ, ఆమె కేవలం ర్యాంకింగ్ పాయింట్ల కోసమే పోటీ పడటంతో పతకానికి పరిగణించలేదు.
పురుషుల విభాగంలో రజతం, కాంస్యం
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో ప్రపంచ ఛాంపియన్ సామ్రాట్ రాణా కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్‌లో 220.3 పాయింట్లు సాధించిన రాణా.. వరుసగా 10.6, 10.8 పాయింట్లతో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చాడు. మరో భారత షూటర్ శర్వాన్ కుమార్ 198.6 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన వ్లాదిమిర్ స్వెచ్నికోవ్ స్వర్ణం, కజకిస్థాన్‌కు చెందిన వలేరి రఖిమ్జానోవ్ రజతం గెలుచుకున్నారు.
జట్టు విభాగంలో సామ్రాట్ రాణా (581), శర్వాన్ కుమార్ (578), వరుణ్ తోమర్ (573) కలిసి మొత్తం 1732 పాయింట్లతో భారత్‌కు రజత పతకాన్ని ఖాయం చేశారు. ఆసియా షూటింగ్ కాన్ఫెడరేషన్ నిర్వహిస్తున్న ఈ మెగా ఈవెంట్ ఫిబ్రవరి 13 వరకు సాగనుంది. మొత్తం 20 దేశాల నుంచి 311 మంది షూటర్లు ఇందులో పాల్గొంటున్నారు.
