Let's talk: editor@tmv.in
ఆసియా షూటింగ్‌లో ఆకృతికి రజతం, అంజుమ్‌కు కాంస్యం

ఆసియా షూటింగ్‌లో ఆకృతికి రజతం, అంజుమ్‌కు కాంస్యం

Shaik Mohammad Shaffee
11 ఫిబ్రవరి, 2026

దేశ రాజధానిలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌లో జరుగుతున్న ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్-2026లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. మంగళవారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో భారత్ రెండు పతకాలను తన ఖాతాలో వేసుకుంది. యువ షూటర్ ఆకృతి దహియా అద్భుత ప్రదర్శనతో రజత పతకాన్ని కైవసం చేసుకోగా, వెటరన్ ఒలింపియన్ అంజుమ్ మౌద్గిల్ కాంస్యంతో మెరిసింది.

తొలి పతకంతో మెరిసిన ఆకృతి

24 ఏళ్ల ఆకృతి దహియా తన కెరీర్‌లో తొలి వ్యక్తిగత అంతర్జాతీయ పతకాన్ని సాధించి సత్తా చాటింది. నీలింగ్, ప్రోన్, స్టాండింగ్ రౌండ్లలో నిలకడగా రాణించిన ఆకృతి.. ఫైనల్స్‌లో మొత్తం 354.2 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో పోటీపడ్డ ఒలింపియన్ అంజుమ్ మౌద్గిల్ 340.4 పాయింట్లతో మూడో స్థానాన్ని (కాంస్యం) దక్కించుకుంది. మరో భారత షూటర్ ఆషి చౌక్సీ తృటిలో పతకాన్ని చేజార్చుకుని నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఇక కజకిస్థాన్‌కు చెందిన 18 ఏళ్ల సోఫియా షుల్జెంకో 358.2 పాయింట్లతో ప్రపంచ రికార్డు సృష్టిస్తూ స్వర్ణ పతకాన్ని ఎగరేసుకుపోయింది.

జట్టు విభాగంలోనూ రజతం

వ్యక్తిగత విభాగంలోనే కాకుండా టీమ్ విభాగంలోనూ భారత మహిళల జట్టు సత్తా చాటింది. అంజుమ్ మౌద్గిల్, ఆషి చౌక్సీ, ఆకృతి దహియాలతో కూడిన భారత త్రయం క్వాలిఫైయింగ్ రౌండ్‌లో మొత్తం 1756-86x స్కోరు సాధించి రజత పతకాన్ని గెలుచుకుంది. ఈ విభాగంలో కజకిస్థాన్ (1760-90x) స్వర్ణం గెలవగా, జపాన్ కాంస్యంతో సరిపెట్టుకుంది. కాగా, క్వాలిఫైయింగ్ రౌండ్‌లో భారత్‌కే చెందిన విదార్స వినోద్ 590-35x పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచినప్పటికీ, ఆమె కేవలం ర్యాంకింగ్ పాయింట్ల కోసమే పోటీ పడటంతో పతకానికి పరిగణనలోకి తీసుకోలేదు.

పతకాల వేటలో భారత్ జోరు

తాజా పతకాలతో కలిపి ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్ పతకాల సంఖ్య 18కి చేరింది. ఇందులో 8 స్వర్ణాలు, 6 రజతాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి. కేవలం రైఫిల్, పిస్టల్ ఈవెంట్లకు మాత్రమే పరిమితమైన ఈ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో సుమారు 20 దేశాల నుంచి షూటర్లు పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 13న ఈ క్రీడలు ముగియనున్నాయి.