Let's talk: editor@tmv.in
ఆసియా రెజ్లింగ్‌‌ ఛాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో నితేష్‌‌కు రజతం

ఆసియా రెజ్లింగ్‌‌ ఛాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో నితేష్‌‌కు రజతం

Shaik Mohammad Shaffee
10 ఏప్రిల్, 2026

ఆసియా సీనియర్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత గ్రెకో రోమన్ రెజ్లర్లు పతకాలతో మెరిశారు. బుధవారం హోరాహోరీగా సాగిన పోటీల్లో భారత్ ఖాతాలో ఒక రజతం, రెండు కాంస్య పతకాలు చేరాయి. 97 కేజీల విభాగంలో నితీష్ రజత పతకం సాధించగా, సచిన్ సహ్రావత్ (67 కేజీలు), ప్రిన్స్ (82 కేజీలు) కాంస్య పతకాలను ముద్దాడారు. దీంతో భారత్ పతకాల సంఖ్య ఐదుకు (రెండు రజతాలు, మూడు కాంస్యాలు) చేరుకుంది.

నితీష్ పోరాటం..

97 కేజీల విభాగంలో 23 ఏళ్ల యువ రెజ్లర్ నితీష్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్ చేరి రజతాన్ని ఖాయం చేసుకున్నాడు. పసిడి పతకం కోసం జరిగిన పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ మొహమ్మదాది సరావీ (ఇరాన్)తో తలపడ్డ నితీష్.. 1-7 తేడాతో ఓటమి పాలై రజతంతో సరిపెట్టుకున్నాడు.

సచిన్, ప్రిన్స్‌కు కాంస్యాలు

67 కేజీల గ్రెకో రోమన్ విభాగంలో సచిన్ సహ్రావత్ అద్భుత పోరాటపటిమ కనబరిచాడు. ఉజ్బెకిస్థాన్ రెజ్లర్ అబ్దుమాలిక్ అమినోవ్‌తో జరిగిన కాంస్య పతక పోరులో ఒకానొక దశలో 3-5తో వెనుకబడిన సచిన్, అద్భుతంగా పుంజుకుని చివరి నిమిషంలో పాయింట్లు సాధించి 6-5 తేడాతో విజయాన్ని అందుకున్నాడు. అంతకుముందు రిపిచేజ్ రౌండ్‌లో చైనాకు చెందిన జి లెంగ్‌ను ఓడించి సచిన్ పతక పోరుకు అర్హత సాధించాడు. ఇక 82 కేజీల విభాగంలో ప్రిన్స్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. తుర్క్మెనిస్తాన్‌కు చెందిన దిదార్ అమనజరోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో 10-1 తేడాతో ఘనవిజయం సాధించి రెండో కాంస్య పతకాన్ని దేశానికి అందించాడు.