Let's talk: editor@tmv.in
ఆసియా బ్యాడ్మింటన్: సింధు, లక్ష్యసేన్‌లపైనే భారత్ ఆశలు!

ఆసియా బ్యాడ్మింటన్: సింధు, లక్ష్యసేన్‌లపైనే భారత్ ఆశలు!

Shaik Mohammad Shaffee
8 ఏప్రిల్, 2026

ప్రతిష్ఠాత్మక ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్-2026లో నేడు అసలైన సమరం మొదలుకానుంది. భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్ నేటి నుంచే తమ వేటను ప్రారంభించనున్నారు. అయితే మంగళవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌ల్లో భారత జంటలు తొలి రౌండ్‌లోనే వెనుదిరగడం క్రీడాభిమానులను నిరాశకు గురిచేసింది. మరోవైపు స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడం భారత్ పతక అవకాశాలపై ప్రభావం చూపనుంది.

తొలి రోజే ముగిసిన మిక్స్‌డ్ డబుల్స్ ప్రస్థానం

మంగళవారం జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ ఆరంభ పోరులో భారత్‌కు నిరాశే ఎదురైంది. రోహన్ కపూర్-గద్దె రుత్విక శివాని జోడీ మలేషియాకు చెందిన ఎనిమిదో సీడ్ గో సూన్ హువత్-లై షెవోన్ జెమీ జంటతో తలపడి 13-21, 19-21తో ఓటమి చవిచూసింది. 34 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో రెండో గేమ్‌లో మన జంట గట్టి పోటీనిచ్చినప్పటికీ విజయం దక్కలేదు. మరో మ్యాచ్‌లో అశిత్ సూర్య-అమృత ప్రముతేష్ జంట కూడా మలేషియాకే చెందిన వాంగ్ టియెన్ సి-లిమ్ చివ్ సియెన్ జోడీ చేతిలో 16-21, 15-21 తేడాతో 31 నిమిషాల్లోనే పరాజయం పాలయ్యారు.

నేడు కోర్టులోకి సింధు, లక్ష్యసేన్

నేటి నుంచి ప్రారంభం కానున్న సింగిల్స్ పోటీలపై భారత్ భారీ ఆశలు పెట్టుకుంది. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు తన తొలి మ్యాచ్‌లో మలేషియాకు చెందిన వాంగ్ లింగ్ చింగ్‌తో తలపడనుంది. గాయం తర్వాత తిరిగి ఫామ్ అందుకోవడానికి సింధుకు ఇది కీలక పరీక్ష. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న లక్ష్యసేన్ హాంగ్‌కాంగ్‌కు చెందిన లీ చెక్ యూతో తలపడనున్నాడు. గత రికార్డుల ప్రకారం లీ చెక్ యూ 3-2తో స్వల్ప ఆధిక్యంలో ఉన్నప్పటికీ, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా లక్ష్యసేన్‌ విజయంపై ధీమాగా ఉన్నాడు. వీరితో పాటు పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్. ప్రణయ్, ఆయుష్ శెట్టి, మహిళల సింగిల్స్‌లో తన్వి శర్మ, ఉన్నతి హూడా, మాళవిక బన్సోద్ కూడా నేడే తమ సత్తా చాటనున్నారు.

ఆసియా ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఇప్పటివరకు కేవలం రెండు స్వర్ణాలు మాత్రమే గెలిచింది. 1965లో దినేష్ ఖన్నా (సింగిల్స్), 2023లో సాత్విక్-చిరాగ్ జంట ఈ ఘనత సాధించారు. ప్రస్తుత టోర్నీలో భారత షట్లర్లు ఆ సంఖ్యను పెంచుతారో లేదో చూడాలి.