Let's talk: editor@tmv.in
ఆసియా బ్యాడ్మింటన్: క్వార్టర్ ఫైనల్స్‌‌కు ఆయుష్ శెట్టి

ఆసియా బ్యాడ్మింటన్: క్వార్టర్ ఫైనల్స్‌‌కు ఆయుష్ శెట్టి

Shaik Mohammad Shaffee
10 ఏప్రిల్, 2026

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి సంచలన ప్రదర్శనతో మెరిశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అద్భుత విజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అయితే భారత్ భారీ ఆశలు పెట్టుకున్న స్టార్ ఆటగాళ్లు పీవీ సింధు, హెచ్.ఎస్. ప్రణయ్‌లు మాత్రం నిరాశపరిచారు. ప్రత్యర్థుల ధాటికి తలవంచి టోర్నీ నుంచి నిష్క్రమించారు.

ఆయుష్‌ అదరహో..

ప్రస్తుత యూఎస్ ఓపెన్ ఛాంపియన్, ప్రపంచ 25వ ర్యాంకర్ ఆయుష్ శెట్టి గురువారం పోరులో తనకంటే మెరుగైన ర్యాంకులో ఉన్న తైపీ ఆటగాడు చి యు జెన్‌ను వరుస సెట్లలో చిత్తు చేశాడు. 46 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఆయుష్ 21-16, 21-12 తేడాతో ఘనవిజయం సాధించాడు. తన ఎత్తును అనుకూలంగా మార్చుకుంటూ పవర్‌ఫుల్ స్మాష్‌లతో విరుచుకుపడటమే కాకుండా, నెట్ వద్ద అద్భుతమైన నియంత్రణను ప్రదర్శించాడు. తొలి సెట్‌లో 6-10తో వెనుకబడినప్పటికీ, పట్టువదలని పోరాటంతో పుంజుకుని సెట్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో సెట్‌లో ఆరంభం నుంచే 4-0తో ఆధిక్యం సాధించి, చివరకు స్మార్ట్ బ్యాక్‌హ్యాండ్ షాట్‌తో మ్యాచ్‌ను ముగించాడు. నేడు జరగనున్న క్వార్టర్స్‌లో మూడో సీడ్ జోనాథన్ క్రిస్టీ (ఇండోనేషియా)తో ఆయుష్ తలపడనున్నాడు.

సింధు, ప్రణయ్‌ ఇంటికి..

మహిళల సింగిల్స్‌లో రెండుసార్లు ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు పోరాటం ముగిసింది. చైనా క్రీడాకారిణి, రెండో సీడ్ వాంగ్ జియి చేతిలో సింధు 18-21, 8-21 తేడాతో ఓటమి చెందింది. తొలి సెట్‌లో గట్టి పోటీ ఇచ్చిన సింధు, రెండో సెట్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. అటు పురుషుల సింగిల్స్‌లో గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగిన హెచ్.ఎస్. ప్రణయ్ సైతం చైనాకు చెందిన వెంగ్ హాంగ్ యాంగ్ చేతిలో 12-21, 19-21 తో ఓటమి పాలయ్యాడు. రెండో సెట్‌లో ప్రణయ్ గట్టి పోటీ ఇచ్చినా విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్‌ విభాగంలోనూ ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జోడీ ప్రిక్వార్టర్స్‌లో వెనుదిరిగింది. మలేషియాకు చెందిన నాలుగో సీడ్ జంట చెన్ టాంగ్ జీ - తో ఇవీ చేతిలో 13-21, 14-21 తేడాతో భారత జోడీ పరాజయం పాలైంది.