Let's talk: editor@tmv.in
ఆసియా బ్యాడ్మింటన్: ఆయుష్ సంచలనం

ఆసియా బ్యాడ్మింటన్: ఆయుష్ సంచలనం

Shaik Mohammad Shaffee
9 ఏప్రిల్, 2026

ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 7వ ర్యాంకర్, ఆసియా క్రీడల ఛాంపియన్ లీ షి ఫెంగ్ (చైనా)ను చిత్తు చేసి సంచలనం సృష్టించాడు. సొంతగడ్డపై ఆడుతున్న డిఫెండింగ్ ఛాంపియన్‌పై ఆయుష్ 21-13, 21-16తో వరుస గేమ్లలో ఘనవిజయం సాధించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన ఆయుష్, రెండో గేమ్‌లో 13-13 వద్ద స్కోరు సమమైన దశలో వరుసగా ఆరు పాయింట్లు సాధించి మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. నేడు జరిగే రెండో రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన చి యు జెన్‌తో ఆయుష్ తలపడనున్నాడు.

పోరాడి గెలిచిన సింధు

మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు చెమటోడ్చి విజయం సాధించింది. మలేషియా క్రీడాకారిణి వాంగ్ లింగ్ చింగ్‌తో జరిగిన పోరులో సింధు 15-21, 21-11, 21-19తో గెలుపొందింది. తొలి గేమ్ కోల్పోయి ఒత్తిడిలో పడినా, తర్వాతి రెండు గేమ్ ల‌లో అద్భుతంగా పుంజుకుని ప్రిక్వార్టర్స్‌కు చేరింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ సైతం 24-22, 21-12తో వియత్నాం ఆటగాడు ఎన్.హై డాంగ్‌పై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. తొలి గేమ్‌లో హోరాహోరీ పోరు సాగినా, రెండో గేమ్‌లో ప్రణయ్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి మ్యాచ్‌ను ముగించాడు.

నిరాశపరిచిన లక్ష్యసేన్, శ్రీకాంత్

భారత అగ్రశ్రేణి ఆటగాడు లక్ష్యసేన్ తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై నిరాశపరిచాడు. హాంకాంగ్‌కు చెందిన లీ చెక్ యు చేతిలో 12-21, 19-21తో పరాజయం పాలయ్యాడు. రెండో గేమ్‌లో గట్టి పోటీనిచ్చినప్పటికీ కీలక పాయింట్ల వద్ద తడబడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. మాజీ ప్రపంచ నంబర్ వన్ కిడాంబి శ్రీకాంత్ కూడా తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. సింగపూర్ షట్లర్ లో కీన్ యూతో జరిగిన పోరులో శ్రీకాంత్ 21-18, 9-21, 19-21తో ఓడిపోయాడు. తొలి గేమ్ గెలిచి మంచి ఆరంభాన్ని లభించినా, ఆ తర్వాత ప్రత్యర్థి ధాటికి తలవంచక తప్పలేదు. ఇతర మ్యాచ్‌ల్లో మాళవిక బన్సోద్, తన్వీ శర్మలు కూడా పరాజయం పాలయ్యారు.

ఆసియా బ్యాడ్మింటన్: ఆయుష్ సంచలనం - Tholi Paluku