Let's talk: editor@tmv.in
ఆసియా బ్యాడ్మింటన్‌లో ఫైనల్‌కు ఆయుష్ శెట్టి

ఆసియా బ్యాడ్మింటన్‌లో ఫైనల్‌కు ఆయుష్ శెట్టి

Pinjari Chand
12 ఏప్రిల్, 2026

భారత యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఆయుష్‌ శెట్టి శనివారం జరిగిన సెమీఫైనల్లో అగ్రసీడ్, డిఫెండింగ్ చాంపియన్ కున్లావుట్‌ విటిడ్సార్న్‌పై అద్భుత విజయం సాధించి బ్యాడ్మింటన్‌ ఏసియా ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఈ విజయంతో ఆయనకు కనీసం రజత పతకం కొట్టడం ఖాయమైంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 25వ స్థానంలో ఉన్న ఆయుష్, థాయ్‌లాండ్‌కు చెందిన పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత, 2023 ప్రపంచ చాంపియన్ అయిన విటిడ్సార్న్‌ను 10-21, 21-19, 21-17 తేడాతో ఓడించాడు. సుమారు 75 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో మొదటి గేమ్ కోల్పోయినా ఆయుష్ అద్భుతంగా పుంజుకుని విజయాన్ని అందుకున్నాడు.

భారత మాజీ కోచ్, సెంటర్ ఫర్ బ్యాడ్మింటన్ ఎక్సలెన్స్ డైరెక్టర్ విమల్‌ కుమార్‌‌ మాట్లాడుతూ ఆయుష్ చాలా తెలివిగా ఆడాడు. తన దూకుడైన ఆటతో కున్లావుట్‌పై ఒత్తిడి తీసుకొచ్చాడు. రెండో గేమ్ గెలవడం కీలకంగా మారింది. 20-14 ఆధిక్యంలో ఉన్నప్పుడు కొంత టెన్షన్ కనిపించినా చివరికి అద్భుత షాట్‌తో గేమ్ ముగించాడని తెలిపారు.

చరిత్రలో నిలిచిన ప్రదర్శన

ఈ విజయంతో ఆయుష్ శెట్టి, ప్రముఖ టోర్నమెంట్ ఫైనల్‌కు చేరిన దినేష్ ఖన్నా తర్వాత తొలి భారత పురుష సింగిల్స్ ఆటగాడిగా నిలిచాడు. దినేష్‌ ఖన్నా 1965లో ఈ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ స్వర్ణ పతకం గెలిచిన ఏకైక భారత ఆటగాడు. డబుల్స్ విభాగంలో భారత జోడీ సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్‌శెట్టి 2023లో టైటిల్ సాధించారు.

ఫైనల్లో చైనా స్టార్‌తో పోరు

20 ఏళ్ల మంగళూరు క్రీడాకారుడు, యుఎస్ ఓపెన్ సూపర్ 300 ఛాంపియన్ అయిన ఆయుష్ ఫైనల్లో చైనాకు చెందిన రెండో సీడ్ ఆటగాడు షి యూ కీతో తలపడనున్నాడు. బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్‌లో ఇప్పటికే ఆయుష్ పలు ప్రముఖ ఆటగాళ్లపై విజయాలు సాధించాడు. వీరిలో లీ జీ జియా, లోహ్‌ కీన్‌ యె, బ్రియాన్‌ యాంగ్ ముఖ్యులు. ఈ టోర్నమెంట్‌లో కూడా ప్రపంచ నం.7 లి షి ఫెంగ్‌, ప్రపంచ నం.4 జోనాథన్‌ క్రిస్టీలను ఓడించి సెమీఫైనల్‌కు చేరాడు.

మ్యాచ్ ఎలా సాగింది

మ్యాచ్ ప్రారంభంలో విటిడ్సార్న్ ఆధిపత్యం చెలాయించాడు. వేగవంతమైన షాట్లు, ఖచ్చితమైన రిటర్న్‌లతో 4-0 ఆధిక్యం సాధించాడు. ఇంటర్వెల్ సమయానికి 11-5 ఆధిక్యంలో నిలిచాడు. వరుస స్మాష్‌లతో మొదటి గేమ్‌ను 21-10తో గెలిచాడు.

రెండో గేమ్‌లో మాత్రం ఆయుష్ దూకుడు పెంచాడు. ప్రారంభంలోనే 7-1 ఆధిక్యం సాధించాడు. అద్భుత డైవ్‌లు, కౌంటర్ అటాక్స్‌తో 11-4 ఆధిక్యంలోకి వెళ్లాడు. మధ్యలో కొన్ని తప్పిదాలతో స్కోరు 13-11కు చేరినా మళ్లీ పుంజుకుని 21-19తో గేమ్ గెలిచి మ్యాచ్‌ను నిర్ణాయక గేమ్‌కు తీసుకెళ్లాడు.

మూడో గేమ్‌లో ఆయుష్ పూర్తి ఆధిపత్యం చూపించాడు. ఆరంభంలోనే 4-1 ఆధిక్యం సాధించి దూకుడు కొనసాగించాడు. బలమైన స్మాష్‌లు, చాకచక్యమైన డ్రాప్ షాట్లతో 17-10కు స్కోరు తీసుకెళ్లాడు. చివరికి మరో అద్భుత స్మాష్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

మానసిక పరిపక్వతే విజయం

విమల్ కుమార్ మాట్లాడుతూ ఇంతకుముందు ఆయుష్‌కు అవసరమైంది మానసిక పరిపక్వత. ఈ టోర్నమెంట్‌లో అది స్పష్టంగా కనిపించింది. ఒత్తిడి సమయంలో కూడా ప్రశాంతంగా ఆడాడు. భారత్‌కు ఇప్పుడు పురుషుల సింగిల్స్‌లో ఆయుష్ శెట్టి, లక్ష్యసేన్‌ వంటి బలమైన ఆటగాళ్లు ఉన్నారు. ఇది భారత బ్యాడ్మింటన్‌కు మంచి సంకేతమని చెప్పారు.

కోచ్ సహకారం కీలకం

గత రెండు వారాలుగా ఆయుష్ ఇండోనేషియా కోచ్ ఐరావాన్ష్‌ అది ప్రథమ వద్ద శిక్షణ తీసుకుంటున్నాడు. టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్లు ఎక్కువమంది ఇప్పటికే స్వదేశానికి వెళ్లిపోయినా, ఫిజియోను అక్కడే ఉంచినట్లు అధికారులు తెలిపారు. మ్యాచ్‌ల మధ్య బాడీ రీచార్జ్‌కు ఇది చాలా ఉపయోగపడుతోందని విమల్ కుమార్ చెప్పారు.