
ఆసియా బాక్సింగ్: ఫైనల్లో 8 మంది భారత బాక్సర్లు
మంగోలియా వేదికగా జరుగుతున్న ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్-2026లో భారత బాక్సర్లు విజయకేతనం ఎగురవేస్తున్నారు. మంగళవారం జరిగిన సెమీఫైనల్ పోరులో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్లు మీనాక్షి హూడా, జైస్మిన్ లంబోరియాతో పాటు పురుషుల విభాగంలో విశ్వనాథ్ సురేష్, సచిన్ శివాచ్‌లు ప్రత్యర్థులను చిత్తు చేసి ఫైనల్లోకి దూసుకెళ్లారు. తాజా విజయాలతో కలిపి ఈ టోర్నీలో భారత్ తరఫున మొత్తం ఎనిమిది మంది (ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులు) స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించారు. భారత బాక్సింగ్ సమాఖ్య నిబంధనల ప్రకారం.. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన వారంతా రాబోయే కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలకు నేరుగా అర్హత సాధించినట్లయింది.
రింగ్‌లో భారత వనితల జోరు
మహిళల 48 కిలోల విభాగంలో మీనాక్షి హూడా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ థాయ్‌లాండ్‌కు చెందిన థిప్సత్చా యోధ్వారీపై 4-1తో ఘనవిజయం సాధించి ఫైనల్ చేరింది. అక్కడ ఆమె స్థానిక బాక్సర్ నోముందరి ఎంఖ్-అమ్గలాన్‌తో తలపడనుంది. ఇక 57 కిలోల విభాగంలో జైస్మిన్ లంబోరియా ఉజ్బెకిస్థాన్‌కు చెందిన నిగినా ఉక్తమోవాపై 3-2తో తీవ్రంగా శ్రమించి విజయాన్ని అందుకుంది. తుది పోరులో ఆమె థాయ్‌లాండ్‌కు చెందిన పున్రావి రుయెన్‌రోస్‌ను ఢీకొననుంది. ఇప్పటికే ప్రీతి పవార్ (54 కేజీలు), ప్రియ (60 కేజీలు), అరుంధతి చౌదరి (70 కేజీలు) ఫైనల్ చేరగా, అల్ఫియా పఠాన్ (+80 కేజీలు) నేరుగా ఫైనల్ బరిలో నిలవనుంది.
పురుషుల విభాగంలో విశ్వనాథ్, సచిన్ హవా
పురుషుల 50 కిలోల విభాగంలో విశ్వనాథ్ సురేష్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ జోర్డాన్‌కు చెందిన హుతైఫా ఇషీష్‌ను 5-0తో ఏకపక్షంగా ఓడించి ఫైనల్లో అడుగుపెట్టాడు. 60 కిలోల విభాగంలో సచిన్ శివాచ్ సైతం థాయ్‌లాండ్‌కు చెందిన సక్దా రువమ్‌థమ్‌పై 4-1తో ఘనవిజయం సాధించి పసిడి వేటలో నిలిచాడు. వీరిద్దరి ఫైనల్ ప్రత్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. కాగా, సెమీస్‌లో ఓడిన ఆకాష్ (75 కేజీలు), లోకేష్ (85 కేజీలు), హర్ష్ చౌదరి (90 కేజీలు) కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. 90+ కేజీల విభాగంలో నరేందర్ బెర్వాల్ చైనా బాక్సర్ దానాబైకేతో తలపడగా, కంటి గాయం కారణంగా మొదటి రౌండ్‌లోనే మ్యాచ్ నిలిపివేయడంతో అతను ఓటమి పాలై కాంస్యం దక్కించుకున్నాడు.
కాంస్యంతో మెరిసిన స్టార్ బాక్సర్లు
సోమవారం జరిగిన సెమీఫైనల్ పోరులో భారత స్టార్ బాక్సర్లు నిఖత్ జరీన్ (51 కేజీలు), ఒలింపిక్ మెడలిస్ట్ లవ్లీనా బోర్హోగైన్ (75 కేజీలు), పూజా రాణి (80 కేజీలు) పరాజయం పాలై కాంస్య పతకాలతో వెనుదిరిగారు. ప్రస్తుతం మహిళల విభాగంలో పసిడి పోరు రసవత్తరంగా మారింది. ప్రీతి పవార్ చైనీస్ తైపీకి చెందిన హువాంగ్ సియావో-వెన్‌తో, ప్రియ ఉత్తర కొరియాకు చెందిన ఉన్ గ్యోంగ్ వోన్‌తో, అరుంధతి చౌదరి కజకిస్థాన్‌కు చెందిన బకిత్ సీడిష్‌తో స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు. ఎనిమిది మంది ఫైనలిస్టులతో భారత్ ఈసారి పతకాల పట్టికలో అగ్రస్థానంపై కన్నేసింది.
