
ఆసియా బాక్సింగ్: క్వార్టర్ ఫైనల్కు ఆదిత్య
ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్-2026లో భారత బాక్సర్లు తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నారు. టోర్నీలో భాగంగా గురువారం జరిగిన పురుషుల 65 కిలోల విభాగంలో భారత జాతీయ ఛాంపియన్ ఆదిత్య అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సౌదీ అరేబియాకు చెందిన మూసా అల్హౌసావ్‌తో జరిగిన పోరులో ఆదిత్య ఆది నుంచి పట్టు బిగించాడు. రింగులో తనదైన వ్యూహాలతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తూ 5-0తో ఏకగ్రీవ నిర్ణయంతో ఘనవిజయం సాధించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. తదుపరి రౌండ్‌లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన అబ్దుల్లా మదమినోవ్‌తో ఆదిత్య తలపడనున్నాడు.
విశ్వనాథ్, సచిన్ సైతం..
అంతకుముందు బుధవారం జరిగిన పోటీల్లోనూ భారత బాక్సర్లు సత్తా చాటారు. 50 కిలోల విభాగంలో విశ్వనాథ్ సురేష్ తనదైన పదునైన టెక్నిక్‌తో కిర్గిజిస్థాన్‌కు చెందిన బెక్‌జత్ ఎర్గెషోవ్‌ను చిత్తు చేశాడు. 5-0తో ఏకగ్రీవ నిర్ణయంతో విజయం సాధించిన విశ్వనాథ్.. తర్వాతి రౌండ్‌లో డిఫెండింగ్ వరల్డ్ ఛాంపియన్ (2025) సంజర్ తాష్కెన్‌బే (కజకిస్థాన్) వంటి బలమైన ప్రత్యర్థిని ఢీకొనబోతున్నాడు. మరోవైపు 60 కిలోల విభాగంలో సచిన్ కూడా తన ప్రతిభకు పదును పెట్టాడు. ఆతిథ్య మంగోలియా బాక్సర్ బుయందలై బాయర్ఖును 4-1 తేడాతో ఓడించి ముందంజ వేశాడు.
పతకాల వేటలో భారత్
ఈ ఏడాది జనవరిలో జరిగిన 9వ ఎలైట్ మెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించిన ఆదిత్య, అదే జోరును అంతర్జాతీయ వేదికపై కూడా కొనసాగిస్తుండటం విశేషం. ఆసియాలోని మేటి బాక్సర్లు తలపడుతున్న ఈ టోర్నీలో భారత క్రీడాకారులు సాధిస్తున్న వరుస విజయాలు పతకాల వేటలో సానుకూల సంకేతాలను ఇస్తున్నాయి. ఆదిత్యతో పాటు ఇతర బాక్సర్లు కూడా ఇదే జోరును కొనసాగిస్తే భారత్ మరిన్ని పతకాలు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
