Let's talk: editor@tmv.in
ఆసియా బాక్సింగ్‌లో భారత్ ‘పసిడి’ పంచ్

ఆసియా బాక్సింగ్‌లో భారత్ ‘పసిడి’ పంచ్

Shaik Mohammad Shaffee
10 ఏప్రిల్, 2026

ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు చారిత్రక ప్రదర్శనతో సత్తా చాటారు. గురువారం జరిగిన ఫైనల్స్‌లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. భారత బాక్సర్లు పవర్‌ఫుల్ పంచ్‌లతో ప్రత్యర్థులను చిత్తు చేసి ఏకంగా నాలుగు స్వర్ణ పతకాలను కొల్లగొట్టారు. మీనాక్షి హుడా, ప్రీతి పవార్, ప్రియ, అరుంధతి చౌదరి ఆసియా కొత్త ఛాంపియన్లుగా అవతరించారు. మహిళల విభాగంలో భారత్ మొత్తం 10 పతకాలతో (4 స్వర్ణాలు, 2 రజతాలు, 4 కాంస్యాలు) ఈ టోర్నీలోనే అత్యంత విజయవంతమైన దేశంగా నిలిచింది.

సంచలన విజయాలతో స్వర్ణ కేతనం

48 కేజీల విభాగంలో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ మీనాక్షి హుడా తన ఆధిపత్యాన్ని చాటుకుంది. స్థానిక ఫేవరెట్ బాక్సర్ నోముందరి ఎన్ఖ్-అమ్గలన్‌ను 5-0తో ఏకపక్షంగా ఓడించి పసిడిని ముద్దాడింది. ఇక 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్ సంచలన పోరాటాన్ని కనబరిచింది. మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్, ఒలింపిక్ మెడలిస్ట్ అయిన హువాంగ్ హ్సియావో-వెన్‌ (చైనీస్ తైపీ)ను 5-0తో మట్టికరిపించి అగ్రస్థానంలో నిలిచింది.

60 కేజీల ఫైనల్లో ప్రియ క్లినికల్ ప్రదర్శనతో ఉత్తర కొరియా బాక్సర్ వోన్ ఉన్-గ్యోంగ్‌పై 3-0తో విజయం సాధించగా.. 70 కేజీల విభాగంలో అరుంధతి చౌదరి 4-1తో కజకిస్థాన్‌కు చెందిన బకిత్ సెయిడిష్‌ను ఓడించి భారత్ ఖాతాలో నాలుగో స్వర్ణాన్ని చేర్చింది.

జైస్మిన్, అల్ఫియాలకు రజతాలు

మరో ఇద్దరు భారత బాక్సర్లు జైస్మిన్ లాంబోరియా (57 కేజీలు), అల్ఫియా పఠాన్ (80+ కేజీలు) ఫైనల్స్‌లో పట్టుదలగా పోరాడినప్పటికీ 0-5 తేడాతో ఓటమి చెంది రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. జైస్మిన్.. థాయ్‌లాండ్ బాక్సర్ పున్రావీ చేతిలో, అల్ఫియా.. కజకిస్థాన్‌కు చెందిన దినా చేతిలో పరాజయం పాలయ్యారు. కాగా నిఖత్ జరీన్ (51 కేజీలు), లవ్లినా బోర్గొహైన్ (75 కేజీలు), పూజా రాణి (80 కేజీలు), అంకుశిత బోరో (65 కేజీలు) ఇప్పటికే కాంస్య పతకాలు గెలుచుకున్నారు. దీంతో బరిలోకి దిగిన 10 మంది మహిళా బాక్సర్లూ మెడల్స్‌తో తిరిగి రావడం విశేషం.

నేడు పురుషుల ఫైనల్స్

పురుషుల విభాగంలో నేడు జరగనున్న ఫైనల్స్‌లో విశ్వనాథ్ సురేష్ (50 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు) స్వర్ణ పతకాల కోసం రింగ్‌లోకి దిగనున్నారు. ఇప్పటికే ఆకాష్, లోకేష్, హర్ష్ చౌదరి, నరేందర్ బెర్వాల్ కాంస్య పతకాలు ఖాయం చేసుకున్నారు. మొత్తంగా ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఇప్పటివరకు 16 పతకాలను (మహిళలు+పురుషులు) తన ఖాతాలో వేసుకుని పతకాల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.