Let's talk: editor@tmv.in
ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్‌లో అదరగొట్టిన భారత్

ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్‌లో అదరగొట్టిన భారత్

Sandhula Dinesh
27 అక్టోబర్, 2025

చెంగ్డూ లో జరిగిన బ్యాడ్మింటన్ ఆసియా అండర్-17 & అండర్-15 ఛాంపియన్‌షిప్‌లలో భారత్ అద్భుత రికార్డు ప్రదర్శనతో ఐదు పతకాలు సాధించింది. అందులో రెండు బంగారు పతకాలు ఉన్నాయి. షైనా మనిముత్తు, దీక్ష సుధాకర్ తమ తమ సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచి భారత విజయంలో కీలక పాత్ర పోషించారు.

అండర్-15 గర్ల్స్ సింగిల్స్ ఫైనల్లో షైనా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి జపాన్‌కి చెందిన చిహారు టొమితాను 21–14, 22–20 తేడాతో 44 నిమిషాల రసవత్తర పోటీలో ఓడించారు. ఈ విజయంతో షైనా అండర్-15 కిరీటాన్ని గెలిచిన నాలుగో భారత క్రీడాకారిణిగా నిలిచింది. రెండో గేమ్‌లో టొమితా చివరి దశలలో బలమైన ప్రతిఘటన కనబరిచినా, షైనా తన సామర్ధ్యంతో టొమితా తట్టుకొని విజయం సాధించారు.

భారత గౌరవాన్ని మరింత పెంచుతూ, దీక్షా సుధాకర్ అండర్-17 గర్ల్స్ సింగిల్స్ ఫైనల్లో సహభారత క్రీడాకారిణి లక్ష్య రాజేశ్‌పై ఆధిపత్య ప్రదర్శన చేసి 21–16, 21–9 తేడాతో కేవలం 27 నిమిషాల్లో గెలిచింది. దీక్షా విజయం చరిత్రాత్మక మైలురాయిగా నిలిచింది, ఎందుకంటే ఆమె ఈ ఛాంపియన్‌షిప్‌లో అండర్-17 టైటిల్ గెలుచుకున్న తొలి భారత క్రీడాకారిణి గ నిలిచారు.

భారత్ మొత్తం రెండు బంగారు, ఒక వెండి, రెండు కాంస్య పతకాలు సాధించుకుంది. ఇది దేశ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. కాంస్య పతకాలను బాలుర సింగిల్స్‌లో జగ్‌షేర్ సింగ్ ఖంగ్గురా, మిక్స్‌డ్ డబుల్స్ జంట జంగ్జీత్ సింగ్ కాజ్లా, జననికా రమేష్ సాధించారు. ఈ జంట టోర్నమెంట్ ప్రారంభ దశల నుంచే బలమైన ఆటతీరు చూపించారు.

ఈ విజయం 12 ఏళ్ల తర్వాత రెండుసార్లు బంగారు పతకాలు సాధించిన ఘనతను భారతదేశానికి తీసుకువచ్చింది. గతంలో 2013లో సిరిల్ వర్మ, చిరాగ్ శెట్టి, ఎం. ఆర్. అర్జున్‌లు ఈ విజయాన్ని సాధించారు.

ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్‌లో అదరగొట్టిన భారత్ - Tholi Paluku