Let's talk: editor@tmv.in
ఆసియా కప్‌ 2026: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌

ఆసియా కప్‌ 2026: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌

Shaik Mohammad Shaffee
21 ఫిబ్రవరి, 2026

'ఏసీసీ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026' టోర్నమెంట్‌లో భారత 'ఏ' మహిళా జట్టు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్ పోరులో శ్రీలంక 'ఏ' జట్టుపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి, టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంది. కెప్టెన్ రాధా యాదవ్ బ్యాటింగ్, బౌలింగ్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది.

లంకను కుప్పకూల్చిన భారత స్పిన్నర్లు

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు భారత బౌలర్లు కళ్లెం వేసి భారీ దెబ్బతీశారు. రాధా యాదవ్, ప్రేమ రావత్, తనుజ కన్వర్, మిన్ను మణిలతో కూడిన భారత స్పిన్ క్వార్టెట్ ధాటికి లంక బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. ముఖ్యంగా రాధా యాదవ్ (4/19) తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చగా, ఆమెకు తోడుగా ప్రేమ రావత్ (2/9), తనుజ కన్వర్ (2/21) అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి లంకను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. ఇక మిన్ను మణి (1/21) జట్టు కెప్టెన్ అనుష్క సంజీవని కీలక వికెట్‌ను పడగొట్టింది. లంక బ్యాటర్లలో సంజన కవిండి (31) మాత్రమే కాస్త పోరాడగా, మిగిలిన వారంతా విఫలం కావడంతో ఆ జట్టు 19.4 ఓవర్లలోనే 118 పరుగులకే కుప్పకూలింది.

లక్ష్య ఛేదనలో రాణించిన భారత్

119 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే నందిని కశ్యప్ వికెట్ కోల్పోయినా, వృందా దినేశ్, అనుష్క శర్మ జట్టును ఆదుకున్నారు. వృందా దినేశ్ (42; 20 బంతుల్లో), అనుష్క శర్మ (27; 18 బంతుల్లో) కలిసి కీలకమైన 48 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తేజ హసబ్నిస్, మిన్ను మణి త్వరగా అవుట్ అయినప్పటికీ, క్రీజులో ఉన్న కెప్టెన్ రాధా యాదవ్ (31 నాటౌట్; 18 బంతుల్లో) బాధ్యతాయుతంగా ఆడి, భారత్‌ను 13.3 ఓవర్లలోనే విజయ తీరాలకు చేర్చింది.

ఫైనల్ సమరానికి సిద్ధం

ఈ విజయంతో ఫైనల్‌కు చేరిన భారత్, ఫిబ్రవరి 22న జరగనున్న తుది పోరులో బంగ్లాదేశ్ 'ఏ' లేదా పాకిస్థాన్ 'ఏ' జట్లలో ఏదో ఒకటితో తలపడనుంది. భారత్ ప్రదర్శన చూస్తుంటే ఆసియా కప్ కైవసం చేసుకోవడం ఖాయమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.