
ఆసియా కప్ ఎవరిది?
క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది! ఆసియా కప్ 2025 ఫైనల్ పోరులో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ నేడు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ఆసియా కప్ చరిత్రలో మొదటిసారిగా ఈ రెండు జట్లు ఫైనల్‌లో ముఖాముఖి తలపడడం ఈ మ్యాచ్‌కి మరింత ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది. టోర్నమెంట్ ఆసాంతం అద్భుతమైన ఫామ్‌లో, అజేయంగా దూసుకొచ్చిన భారత్.. సూపర్-4లో పాక్‌ను చిత్తు చేసి, చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై సూపర్ ఓవర్ థ్రిల్లింగ్ విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. అటు పాకిస్తాన్.. కీలకమైన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. నేడు జరగబోయే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ కేవలం క్రికెట్ పోరు మాత్రమే కాదు, కోట్లాది మంది అభిమానుల భావోద్వేగాల సంగమం. ఈ మెగా ఫైనల్‌లో కప్పు ఎవరిదో తేల్చుకునేందుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు, తుది పోరులో గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..
టీమిండియా బలం, బలహీతనాలు
టోర్నీ ఆసాంతం భారత జట్టు ప్రదర్శన అద్భుతంగా ఉంది. సూపర్-4లో అజేయంగా నిలిచి, ఉత్కంఠభరిత సూపర్ ఓవర్ ద్వారా శ్రీలంకను ఓడించడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.
బలాలు:భారత బ్యాటింగ్ లైనప్ అసాధారణమైన ఫామ్‌లో ఉంది. ముఖ్యంగా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ నిలకడగా రాణిస్తూ, ఇప్పటికే 300 పరుగుల మార్కును దాటి, టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇతని మెరుపు ఆరంభాలు జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌లు ఆశించిన స్థాయిలో లేకపోయినా, కీలక సమయంలో సంజు శాంసన్, తిలక్ వర్మ తమ అద్భుతమైన భాగస్వామ్యాలతో జట్టును పటిష్టమైన స్కోరుకు చేర్చడం పెద్ద సానుకూలంశం. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా కూడా అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింట్లోనూ మెరుపులు మెరిపించగలడు. మరోవైపు కుల్దీప్ యాదవ్ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇతని లెగ్-స్పిన్, గూగ్లీ బంతులు ప్రత్యర్థులను కట్టడి చేయడంలో కీలకం. ఫ్లాట్ పిచ్‌లపై కూడా స్పిన్నర్లు రాణించడం భారత్‌కు అత్యంత పెద్ద బలం.
బలహీనతలు: సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేని సమయంలో యువ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా పరుగులు ధారాళంగా ఇస్తున్నారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో వీరు ఎక్కువ పరుగులివ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఫైనల్‌లో పాక్ పటిష్టమైన బ్యాటింగ్‌ను వీరు ఎలా ఎదుర్కొంటారనేది కీలకం. వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్) నిలకడగా భారీ స్కోర్లు చేయకపోవడం జట్టుపై ఒత్తిడి పెంచుతోంది. ఫైనల్‌లో వీరిద్దరూ రాణించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు కొన్నిసార్లు సాధారణ క్యాచ్‌లు జారవిడవడం, అనవసరపు పరుగులు ఇవ్వడం వంటి పొరపాట్లు ఫీల్డింగ్‌లో కనిపిస్తున్నాయి. ఇలాంటి హై-వోల్టేజ్ మ్యాచ్‌లో చిన్న పొరపాటైనా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
పాకిస్థాన్ బలం, బలహీతనాలు
లీగ్ దశలో పటిష్టంగా కనిపించినా, సూపర్-4లో పాకిస్థాన్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. అయినప్పటికీ, భారత్‌కు గట్టి పోటీ ఇవ్వగల సత్తా ఉన్న జట్టు ఇది.
బలాలు: పాక్ బ్యాటింగ్ అంతా ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, సయీం అయూబ్, మొహమ్మద్ హారిస్, సాహిబ్‌జాదా ఫర్హాన్ ల చుట్టూనే తిరుగుతుంది. వీరు క్రీజులో పాతుకుపోతే పాక్‌ను కట్టడి చేయడం కష్టమే. పాకిస్థాన్ పేస్ బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. షహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్‌ల కూర్పు అత్యంత ప్రమాదకరమైనది. వీరు వికెట్లు తీయడంలో, మధ్య ఓవర్లలో వేగంతో బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేయడంలో దిట్ట. ఇది భారత్‌కు కాస్త ఇబ్బంది కలిగించే అంశం. కెప్టెన్ సల్మాన్ అఘా, ఫహీమ్ అష్రఫ్, హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షా వంటి ఆల్‌రౌండర్లు బ్యాటింగ్, బౌలింగ్‌లో తమదైన ముద్ర వేయగలరు.
బలహీనతలు: ఫఖర్ జమాన్, సయీం అయూబ్, హసన్ నవాజ్ తర్వాత మిడిల్ ఆర్డర్‌లో పెద్దగా నిలకడ లేదు. ముఖ్యంగా ఒత్తిడిలో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంలో తరచుగా విఫలమవుతుంటారు. భారత్‌తో మ్యాచ్ అనగానే సహజంగానే ఒత్తిడి పెరుగుతుంది. గత రికార్డులను పరిశీలిస్తే, ముఖ్యమైన మ్యాచ్‌లలో పాకిస్థాన్ ఒత్తిడికి గురై కీలక తప్పిదాలు చేసింది. ఈ ఫైనల్‌లో ఆ ఒత్తిడిని ఎంతవరకు తట్టుకుంటారనేది కీలకం.
పిచ్, వాతావరణం
దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం పిచ్ నెమ్మదిగా ఉండి, స్పిన్నర్లకు ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంది. మొదట్లో పేసర్‌లకు కాస్త సహకారం ఉంటుంది. వాతావరణం చాలా వేడిగా, తేమగా ఉంటుంది, రాత్రికి ఉష్ణోగ్రత తగ్గుతుంది. టాస్ గెలిచిన జట్టు ముందు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
గెలుపు అంచనా
ఈరోజు ఫైనల్ మ్యాచ్ నువ్వా-నేనా అన్నట్టుగా సాగనుంది. టోర్నీలో భారత్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. శ్రీలంకతో మ్యాచ్‌లో తమ బలహీనతలు కనిపించినా, సూపర్ ఓవర్‌లో గెలిచి తమ పోరాట పటిమను చాటింది. పాకిస్థాన్‌కు బలం వారి పేస్ బౌలింగ్. భారత్‌కు బలం వారి బ్యాటింగ్ డెప్త్, స్పిన్.
పాక్ గెలవాలంటే.. పేసర్లు టీమిండియా ఓపెనర్ల వికెట్లను పడగొట్టి, భారత బ్యాటింగ్‌పై ఒత్తిడి పెంచాలి. పాక్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు కనీసం 12-15 ఓవర్ల వరకు క్రీజులో ఉండాలి.
భారత్ గెలవాలంటే.. ఓపెనర్లు కనీసం పవర్ ప్లేలో వికెట్ కోల్పోకుండా, పాక్ పేస్ ఎటాక్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. మిడిల్ ఓవర్లలో తిలక్/సంజు వంటి ఆటగాళ్లు కుల్దీప్ స్పిన్ మాయాజాలానికి మద్దతుగా భారీ స్కోరు చేయగలిగితే విజయం భారత్‌దే.
టోర్నీలో భారత్ చూపించిన ఆధిపత్యం, బ్యాటింగ్ డెప్త్, స్పిన్ బలం దృష్ట్యా టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. అయితే, క్రికెట్‌లో ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు. ఈ హై-వోల్టేజ్ ఫైనల్‌లో చివరి బంతి వరకు ఉత్కంఠ కొనసాగడం ఖాయం. ఆసియా కప్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించే జట్టు ఏదో ఈ రోజు తేలిపోనుంది.
భారత జట్టు (అంచనా):సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్-కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకు సింగ్.
పాకిస్తాన్ జట్టు (అంచనా):సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలత్, ఖుష్దిల్ షా, మొహమ్మద్ హారిస్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ వసీం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ మొకీమ్.
