
ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్‌లో తేజస్విన్ శంకర్‌కు స్వర్ణం
ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ అథ్లెట్ తేజస్విన్ శంకర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీ చివరి రోజున హెప్టాథ్లాన్ విభాగంలో తేజస్విన్ స్వర్ణ పతకాన్ని ముద్దాడాడు. దీంతో భారత్ ఈ ఛాంపియన్‌షిప్‌లో ఒక బంగారం, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఐదు పతకాలను తన ఖాతాలో వేసుకుని, పతకాల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఆతిథ్య చైనా 34 పతకాలతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
జాతీయ రికార్డు తిరగరాసిన తేజస్విన్
27 ఏళ్ల తేజస్విన్ శంకర్ హెప్టాథ్లాన్‌లో 5,993 పాయింట్లు సాధించి తన పాత జాతీయ రికార్డును (5,650 పాయింట్లు-2021) తుడిచిపెట్టాడు. తొలి రోజు నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన ఆయన.. 60 మీటర్ల హర్డిల్స్‌ను 8.02 సెకన్లలో ముగించి 977 పాయింట్లు రాబట్టాడు. పోల్ వాల్ట్‌లో 4.20 మీటర్ల ఎత్తు ఎగిరి నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక చివరి ఈవెంట్ అయిన 1000 మీటర్ల పరుగును 2:43.91 నిమిషాల్లో పూర్తి చేసి రెండో స్థానంలో నిలవడంతో మొత్తం పాయింట్ల స్కోరు 5,993కు చేరింది. అవుట్‌డోర్ డెకాథ్లాన్‌లోనూ జాతీయ రికార్డు కలిగున్న తేజస్విన్, ఆసియా వేదికగా మరోసారి తన సత్తా చాటాడు.
వెండి వెలుగులు.. తృటిలో చేజారిన స్వర్ణం
షాట్‌పుట్ విభాగంలో భారత దిగ్గజం తజిందర్‌పాల్ సింగ్ తూర్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఆయన ఇనుప గుండును 20.05 మీటర్ల దూరం విసిరి సీజన్ బెస్ట్ ప్రదర్శన చేశాడు. అయితే చైనా అథ్లెట్ చెన్యు చెన్ (20.07 మీటర్లు) కేవలం 0.02 మీటర్ల తేడాతో తజిందర్‌ను వెనక్కి నెట్టి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ఇదే విభాగంలో మరో భారతీయుడు సమర్‌దీప్ సింగ్ గిల్ ఐదో స్థానానికి పరిమితమయ్యాడు.
హైజంప్‌లో పూజ మెరుపులు
మహిళల హైజంప్‌లో భారత అథ్లెట్ పూజ రజత పతకంతో మెరిసింది. హైజంప్‌లో ఆమె 1.87 మీటర్ల ఎత్తు ఎగిరింది. ఉజ్బెకిస్థాన్‌కు చెందిన వలేరియా కూడా అంతే ఎత్తు ఎగిరినప్పటికీ, సాంకేతిక కారణాలతో పూజకు రెండో స్థానం దక్కింది. వీరిద్దరూ 1.90 మీటర్ల ఎత్తును అధిగమించేందుకు చేసిన మూడు ప్రయత్నాలు విఫలమయ్యాయి.
లాంగ్ జంప్‌లో అన్సీకి కాంస్యం
మహిళల లాంగ్ జంప్ విభాగంలో అన్సీ సోజన్ 6.21 మీటర్ల దూరం దూకి కాంస్య పతకాన్ని సాధించింది. చైనా అథ్లెట్లు తొలి రెండు స్థానాలను ఆక్రమించారు. ఇదే పోటీలో పాల్గొన్న మౌమితా మండల్ 6.01 మీటర్ల దూరంతో ఆరో స్థానంలో నిలిచింది. మౌమితా 60 మీటర్ల హర్డిల్స్‌లో ఎనిమిదో స్థానాన్ని పొందింది.
పోరాడి ఓడిన ఇతరులు
టోర్నీ తొలి రోజైన శుక్రవారం ఆదర్శ్ రామ్ జ్యోతి శంకర్ హైజంప్‌లో కాంస్యం సాధించగా, చివరి రోజు ఇతర అథ్లెట్లు తృటిలో పతకాలను చేజార్చుకున్నారు. లాంగ్ జంప్‌లో షానవాజ్ ఖాన్ నాలుగో స్థానంతో సరిపెట్టుకోగా, ప్రజ్ఞాన్ ప్రశాంతి సాహు 60 మీటర్ల హర్డిల్స్ హీట్స్‌లో తన కెరీర్ బెస్ట్ (8.46 సెకన్లు) నమోదు చేసినా ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది.
