
ఆసియా ఆర్చరీ: జ్యోతి సురేఖ ‘డబుల్’ గోల్డ్
భారత స్టార్ కాంపౌండ్ ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నం, ఆసియా ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు పసిడి పతకాలు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. జ్యోతి సురేఖ, ఆమె సహచరుల అద్భుత ప్రదర్శనతో భారత్ ఈ ఛాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు సహా మొత్తం నాలుగు పతకాలు సాధించింది. 29 ఏళ్ల జ్యోతి సురేఖకు గురువారం మహిళల వ్యక్తిగత, టీమ్ టైటిళ్లు దక్కడంతో ఆమెకు ఇది ఒక మరుపురాని రోజుగా నిలిచింది.
జ్యోతి సురేఖ మొదట దీప్‌శిఖ, పృథికా ప్రదీప్‌లతో జతకట్టి మహిళల కాంపౌండ్ టీమ్ ఫైనల్‌లో కొరియాపై ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. ఈ పోరులో భారత్ కొరియాపై 236-234 తేడాతో గెలుపొందింది. భారత త్రయం మొదటి ఎండ్‌లో 59 పాయింట్లు (10, 10, 10, 10, 9, 10), రెండవ ఎండ్‌లో 58 పాయింట్లు (10, 10, 10, 9, 10, 9) సాధించి కొరియా జట్టు (పార్క్ యెరిన్, ఓహ్ యూహ్యున్, మరియు జంగ్ యూన్ పార్క్)పై పైచేయి సాధించారు.
ఆ తర్వాత ఆమె కాంపౌండ్ మహిళల వ్యక్తిగత ఫైనల్‌లోనూ విజేతగా నిలిచింది. ఈ హోరాహోరీ పోరులో జ్యోతి సహచర క్రీడాకారిణి పృథికా ప్రదీప్‌పై 147-145 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయం ద్వారా జ్యోతి సురేఖకు ఈ టోర్నమెంట్‌లో మరో స్వర్ణం లభించింది.
కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లోనూ భారత్ మరో స్వర్ణాన్ని గెలుచుకుంది. అభిషేక్ వర్మ-దీప్‌శిఖ అద్భుతంగా ప్రదర్శన ఇచ్చారు. ఫైనల్‌లో ఈ భారత జంట పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌ను 153-151 తేడాతో ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది. ఒత్తిడిలోనూ అభిషేక్ వర్మ, దీప్‌శిఖ స్థిరమైన ప్రదర్శన కనబరిచారు. వారు రెండు ఎండ్‌లలోనూ 38 పాయింట్లను సాధించి తమ విజయాన్ని పదిలం చేసుకున్నారు.
పురుషుల టీమ్‌కు రజతం
కాంపౌండ్ పురుషుల టీమ్ ఫైనల్‌లో భారత్ జట్టు స్వర్ణ పతకాన్ని తృటిలో కోల్పోయింది. అభిషేక్ వర్మ, సాహిల్ రాజేష్ జాదవ్, ప్రథమేశ్ భాలచంద్ర ఫ్యూగేలతో కూడిన భారత త్రయం కజకిస్తాన్ చేతిలో కేవలం ఒకే ఒక్క పాయింట్ తేడాతో 229-230తో ఓటమి పాలై రజతంతో సరిపెట్టుకుంది. కజకిస్తాన్ జట్టు (దిల్ముఖమెట్ ముస్సా, బున్యోడ్ మిర్జమెటోవ్, ఆండ్రీ ట్యుట్యున్) చివరి బాణాలలో తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకుని విజేతగా నిలిచింది.
