Let's talk: editor@tmv.in
ఆసియాకప్‌లో ఓటమి.. పీసీబీ సంచలన నిర్ణయం

ఆసియాకప్‌లో ఓటమి.. పీసీబీ సంచలన నిర్ణయం

Shaik Mohammad Shaffee
1 అక్టోబర్, 2025

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ చేతిలో ఓటమిపాలైన అనంతరం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. విదేశీ టీ20 లీగ్‌లలో ఆడేందుకు ఆటగాళ్లకు ఇచ్చే నో అబ్జెక్ష‌న్ సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం బాబర్ ఆజామ్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్, ఫహీమ్ అష్రఫ్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లపై ప్రభావం చూపనుంది. వీరంతా బిగ్ బాష్ లీగ్, ఇంటర్నేషనల్ లీగ్ టీ20 వంటి ముఖ్యమైన టోర్నమెంట్లలో ఆడాల్సి ఉంది. ఇప్పుడు పీసీబీ ఆకస్మిక నిర్ణయంతో వారి విదేశీ టీ20 లీగ్‌ల భవితవ్యం సందిగ్ధంలో పడినట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో తమ కథనంలో పేర్కొంది.

"పీసీబీ ఛైర్మన్ ఆమోదంతో లీగ్‌లు, ఇతర విదేశీ టోర్నమెంట్లలో పాల్గొనడానికి సంబంధించిన ఆటగాళ్ల అన్ని నిరభ్యంతర సర్టిఫికెట్లు (ఎన్‌ఓసీలు) తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేయబడ్డాయి" అని నోటీసులో పేర్కొన్నట్లు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో నివేదించింది. విదేశీ లీగ్‌లలో ఆడేందుకు ఆటగాళ్లకు ఇచ్చే నిరభ్యంతర పత్రాలను వారి ప్రదర్శన ఆధారంగా ఇవ్వాలని పీసీబీ యోచిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు పాకిస్థాన్ దేశీయ ఫస్ట్ క్లాస్ పోటీలు అక్టోబర్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ కీలక టోర్నమెంట్‌కు ఆటగాళ్లందరూ అందుబాటులో ఉండాలని పీసీబీ భావిస్తోంది. అంతేకాదు ఇప్పటి నుంచే టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ 2026 కోసం తమ ఆటగాళ్లను సిద్ధం చేయాలనే యోచనలో కూడా పాక్ క్రికెట్ బోర్డు ఉంది. ఆసియా కప్‌ ఫైనల్ వరకూ వచ్చిన పాక్ భారత్ చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆటగాళ్లను మరింత రాటు దేల్చాలని పాక్ బోర్డు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఆసియాకప్‌లో ఓటమి.. పీసీబీ సంచలన నిర్ణయం - Tholi Paluku