
ఆసియాలో అతి పెద్ద గిరిజన జాతర “మేడారం “
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం ఆదివాసీ గిరిజన జాతరను మరింత ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు, మంత్రులకు తెలిపారు. జాతర ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న ముఖ్యమంత్రి నేడు ప్రత్యక్షంగా మేడారం క్షేత్ర స్థాయిలో సందర్శించనున్నారు. మేడారం జాతర కోసం గతంలో తాత్కాలిక ఏర్పాట్లు జరిగాయని, 2026లో జరిగే మేడారం జాతరను మేడారం ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనుల కోసం వంద రోజుల కార్యాచరణను నిర్ధేశించిన ముఖ్యమంత్రి స్వయంగా క్షేత్రస్థాయిలో సమీక్షించనున్నారని మేడారం పూజరులు, ఆదివాసీ పెద్దలు, మంత్రులు, గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రముఖులతో జాతర నిర్వహణ, కొత్త నిర్మాణాలపై మేడారంలో సమీక్షించనున్నారు.
మేడారం ఆదివాసీ సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ ఇలవేల్పులు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలున్న ప్రాంగణాన్ని లక్షలాది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీ ఎత్తున అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని తెలిపారు. కోట్లాది భక్తులు వచ్చే జాతరకు భారీ ఎత్తున స్వాగత తోరణాల నిర్మాణంతో పాటు గద్దెల వద్దకు భక్తులు సులువుగా చేరుకోవడం, అలాగే గద్దెల దర్శనం, బంగారం (బెల్లం) సమర్పణ జంపన్న వాగులో స్నానాలు ఆచరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొందరు మేడారం గద్దెలు మారుస్తున్నారని చేసిన ప్రచారం వాస్తవం కాదన్నారు. మేడారం అభివృద్ధి పనుల్లో గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలకు ఎటువంటి భంగం కలగవద్దనే ఉద్దేశంతో ఉన్న ప్రజా ప్రభుత్వం ప్రతి నిర్మాణం, ప్రతి కట్టడాన్ని పూర్తిగా ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా, మేడారం జాతర పూజారులు, ఆదివాసీ పెద్దల సూచనలతో ప్రభుత్వం చేపట్టనుంది. ఈ నిర్మాణాల్లో విలువైన గ్రానైట్, లైమ్‌స్టోన్ రాళ్లను వాడనున్నారు.
పురాతన ఆలయాల పునఃనిర్మాణం, ప్రసిద్ధ ఆలయాల అభివృద్ధి పనుల్లో ప్రసిద్ధుడైన స్తపతి ఈమని శివనాగిరెడ్డి సేవలను మేడారం అభివృద్ది పనులకు ప్రభుత్వం వినియోగించుకుంటుందని తెలిపారు. గతంలో ముఖ్యమంత్రులు, మంత్రులు జాతరకు వెళ్లడం, దర్శనాలతో సరిపుచ్చేకునే వారని, ఈసారి అందుకు భిన్నంగా ప్రపంచ పటంలో జాతరకు మరింత వన్నె తేవాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. ఆదివాసీల సంప్రదాయాలు, ఆకాంక్షలకు అద్దంపట్టేలా మేడారం జాతరను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. రెండేళ్లకోసారి జరిగే మహా జాతరతో పాటు ఏడాది పొడవునా అన్ని రోజుల్లో మేడారం వచ్చి గద్దెలను దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగింది.
వారాంతం, ఇతర సెలవు దినాల్లో ఈ రద్దీ మరింతగా పెరగనుంది. పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన వసతి, సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, మేడారం అభివృద్ధి పనులతో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేయటంతో పాటు ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రభుత్వం ఊతమివ్వనుంది. ఫలితంగా మేడారం సమీపంలో ఉన్న రామప్ప, ఇతర ఆలయాలకు భక్తుల సంఖ్య పెరిగి స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. మరికొన్ని రోజుల్లో ఏర్పడే రద్దీ సమస్యలు, వాహన ప్రవాహం, పార్కింగ్, పారిశుద్ద్య సమస్యలు వంటివి తగ్గనున్నాయని తెలిపారు.
