
ఆసన్సోల్‌లో గెలిచినా.. ఓడినా ‘బొగ్గే’ కీలకం
ఈ నెలలో జరగనున్న 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన నియోజకవర్గాల్లో ఆసన్సోల్ దక్షిణ్ ఒకటి. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలవాలన్నా, ఓడిపోవాలన్నా నిర్ణయించేది బొగ్గు ఆర్థిక వ్యవస్థే. బొగ్గు పరిశ్రమ క్రమంగా క్షీణించడం, అక్రమ తవ్వకాలు, గుర్తింపు రాజకీయాలు వంటి అంశాలు ఈసారి ఎన్నికలలో ప్రధాన చర్చగా మారాయి. పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని రాణిగంజ్ బొగ్గు బెల్ట్‌లో ఉన్న ఈ పట్టణ–పారిశ్రామిక నియోజకవర్గం తూర్పు భారతదేశంలోని పాత గనుల పట్టణాల్లో జరుగుతున్న నిర్మాణాత్మక మార్పులను ప్రతిబింబిస్తోంది. పరిశ్రమల మందగమనం, అనధికార బొగ్గు వ్యాపారం, జనాభా నిర్మాణంలో మార్పులు ఎన్నికల చర్చలను ప్రభావితం చేస్తున్నాయి.
ఈ నియోజకవర్గాన్ని 2021లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి చేజిక్కించుకున్న బీజేపీ దానిని నిలబెట్టుకోవడానికి హిందుత్వ సమీకరణతో పాటు బొగ్గు ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన పాలనా సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఇక అధికార పార్టీ ఆల్‌ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సంప్రదాయ బెంగాలీ–అల్పసంఖ్యాక మద్దతును కూడగట్టుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రాధాన్యంగా చూపిస్తోంది.
బీజేపీ ప్రస్తుత ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్‌ను అభ్యర్థిగా మళ్లీ నిలబెట్టగా, టీఎంసీ మాజీ ఎమ్మెల్యే తపస్ బెనర్జీని బరిలోకి దించింది. ఆయన 2011, 2016లో ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి, 2021లో సమీప రాణిగంజ్‌కు మారారు. వామపక్ష పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)తరఫున శిల్పి చక్రవర్తి పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ తరఫున సౌవిక్ ముఖర్జీ బరిలో నిలుచున్నారు. 2021లో జరిగిన ఎన్నికల్లో అగ్నిమిత్రా పాల్, టీఎంసీ అభ్యర్థి సాయోని ఘోష్‌ను 4,487 ఓట్ల తేడాతో ఓడించి బీజేపీకి ముఖ్యమైన విజయాన్ని అందించారు. అయితే 2022లో జరిగిన ఆసన్సోల్ లోక్‌సభ ఉపఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి శతృఘ్న సిన్హా భారీ మెజారిటీతో గెలవడంతో ఆ ప్రాంతంలో బీజేపీకి గండి పడింది.
అభ్యర్థుల తలరాత మార్చేది బొగ్గే..
ఈ నియోజకవర్గంలో రాజకీయ చర్చలు ప్రధానంగా బొగ్గు గనుల్లో అధికారికంగా ఉపాధి తగ్గడం చుట్టూ తిరుగుతున్నాయి. ఒకప్పుడు వేలాది కార్మికులకు ఉపాధి కల్పించిన రాణిగంజ్ గనుల్లో యాంత్రీకరణ, పునర్వ్యవస్థీకరణ వల్ల ఉద్యోగాలు తగ్గిపోయాయి. దీంతో చాలా మంది అనధికార రంగాల్లోకి లేదా వలసలకు పోవాల్సి వచ్చింది. అదే సమయంలో అక్రమ బొగ్గు తవ్వకాల నెట్‌వర్క్‌లు ఇంకా కొంతమంది ఆర్థికంగా, బలహీన వర్గాలకు జీవనోపాధిగా మారాయి. దీంతో వాటిపై చర్యలు తీసుకోవడం రాజకీయంగా సున్నితమైన అంశంగా మారింది.
ఇంకో ప్రధాన సమస్య భూగర్భ గనుల కారణంగా ఏర్పడుతున్న భూమి కుంగిపోవడం (సబ్సిడెన్స్). కొన్ని ప్రాంతాల్లో భవనాల్లో పగుళ్లు, నేల అకస్మాత్తుగా కుంగిపోవడం వంటి ప్రమాదాలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పునరావాసం, పరిహారం, భద్రతా చర్యలు ఎన్నికలలో కీలక అంశాలుగా మారాయి.
దుర్గాపూర్ కళాశాల రాజకీయ శాస్త్ర ప్రొఫెసర్ సుస్మితా మజుందార్ మాట్లాడుతూ, వలస వచ్చిన హిందీభాషాభిమానుల గుర్తింపు రాజకీయాలు, భూగర్భం కుంగిపోవడం, నియంత్రణలేని గనుల తవ్వకం వంటి అంశాలు పర్యావరణ సమస్యలు మాత్రమే కాకుండా వేలాది కుటుంబాల జీవనోపాధిని ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. దశాబ్దాలుగా కార్మికుల వలసల కారణంగా ఆసన్సోల్ దక్షిణ్‌లో సామాజికంగా విభిన్న ఓటరు వర్గం ఏర్పడింది. బీహార్, జార్ఖండ్ నుంచి వచ్చిన హిందీ మాట్లాడే ఓటర్లు సుమారు 35 నుంచి 40 శాతం వరకు ఉన్నట్లు అంచనా. బీజేపీ భాషా విభేదాలను దాటుకుని హిందూ ఓటర్లను ఏకం చేయడానికి ప్రయత్నిస్తుండగా, టీఎంసీ బెంగాలీ ఓటర్లు, అల్పసంఖ్యాక వర్గాల మద్దతుపై దృష్టి పెట్టింది.
వివాదాల చుట్టూ బీజేపీ రాజకీయం
ఈసారి ప్రచారంలో రామ్ నవమి ఉత్సవాల చుట్టూ కూడా రాజకీయ చర్చలు పెరిగాయి. బీజేపీ బొగ్గు అక్రమ రవాణా, నియామకాలలో అవకతవకలు, స్థానిక సిండికేట్ల ప్రభావం వంటి అంశాలను పాలనా వైఫల్యాలుగా ప్రస్తావిస్తోంది. అగ్నిమిత్రా పాల్ మాట్లాడుతూ అవినీతి, గనుల అక్రమ తవ్వకం, భూమి కుంగిపోవడం వంటి సమస్యలు ప్రజల ప్రధాన ఆందోళనలుగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రాన్ని జనాభా మార్పుల నుంచి రక్షించాలంటే టీఎంసీని ఇక్కడి నుంచి సాగనంపాలి. ఆసన్సోల్ దక్షిణ్‌లో హిందూ ఓటర్ల సమీకరణ అవసరమని ఆమె పేర్కొన్నారు. అయితే టీఎంసీ అభ్యర్థి తపస్ బెనర్జీ, బీజేపీ ఓటర్లను విభజించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే తమ ప్రధాన అజెండా అని తెలిపారు.
ప్రధాన పోటీదారుగా కనిపించకపోయినా వామపక్షాలు కూడా ఓట్లను చీల్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సామాజికంగా విభిన్నమైన ఓటరు నిర్మాణం ఉండటంతో చిన్న మార్పులు కూడా ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉందని వారు అంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఆసన్సోల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పలు వార్డులతో పాటు అమ్రసోటా, ఎగ్రా, బల్లవ్‌పూర్, జెమారి, తిరత్‌గ్రామ్ గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇక్కడ తొలి దశలో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా, ఓట్ల లెక్కింపు మే 4న చేపట్టనున్నారు.
