
ఆశే గాలం... ఖాతా ఖాళీ!
క్షణాల్లో లక్షాధికారిని కావొచ్చన్న ఆశ... ఒక్క క్లిక్‌తో జీవితం మారిపోతుందన్న భ్రమ... ఇదే సైబర్ నేరగాళ్ల పెట్టుబడి. "మీరు రూ.25 లక్షల లాటరీ గెలుచుకున్నారు" అంటూ సామాన్యుల సెల్‌ఫోన్‌కు వచ్చే ఒకే ఒక్క సందేశం, వారి జీవితకాల సంపాదనను గాల్లో కలిపేస్తోంది. నగరంలో ఈ తరహా ఆన్‌లైన్ లాటరీ మోసాలు పెరిగిపోతున్నాయని, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో గుమస్తాగా పనిచేసే రామయ్య జీవితం మూడు రోజుల క్రితం వరకు ప్రశాంతంగా సాగిపోయేది. తన సెల్‌ఫోన్‌కు వచ్చిన ఓ వాట్సాప్ సందేశం ఆ ప్రశాంతతను తుఫానులా తాకింది. "అభినందనలు! ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ నిర్వహించిన డ్రాలో మీ నంబర్ ఎంపికైంది. మీరు రూ.25 లక్షల నగదు బహుమతి గెలుచుకున్నారు" అన్నది ఆ సందేశ సారాంశం. ఆ మెసేజ్‌తో పాటు ప్రముఖ నటుడి ఫోటో, కంపెనీ లోగో ఉండటంతో రామయ్యకు ఎలాంటి అనుమానం రాలేదు.
ఆత్రంగా అందులోని లింక్‌పై క్లిక్ చేయగానే, ఒక ఫారం ఓపెన్ అయింది. పేరు, చిరునామా, బ్యాంకు ఖాతా వివరాలు నింపమని సూచించింది. ఆనందంలో మునిగి తేలుతున్న రామయ్య ఆలోచించకుండా వివరాలన్నీ నింపేశాడు. కొద్దిసేపటికే గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తనను లాటరీ కంపెనీ ప్రతినిధిగా పరిచయం చేసుకుని, "మీకు వచ్చిన బహుమతిని ప్రాసెస్ చేయడానికి, జీఎస్టీ కింద రూ.25వేలు చెల్లించాలి" అని నమ్మబలికాడు. రూ.25 లక్షలు వస్తాయన్న ఆశతో రామయ్య వెంటనే వారు చెప్పిన ఖాతాకు డబ్బు పంపాడు.
కానీ, మోసగాళ్ల కన్నింతటితో ఆపలేదు. "ట్రాన్స్‌ఫర్ ఫీజు" అని, "రిజర్వ్ బ్యాంక్ క్లియరెన్స్" అని రకరకాల కారణాలు చెప్పి విడతలవారీగా దాదాపు రూ.1.5 లక్షల వరకు దండుకున్నారు. చివరికి అనుమానం వచ్చి తాను ఫోన్ చేయగా ఆ నంబర్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాను మోసపోయానని గ్రహించిన రామయ్య సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
మోసగాళ్ల వ్యూహం ఇదే!
సైబర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ముఠాలు దేశంలోని మారుమూల ప్రాంతాల నుంచి పనిచేస్తాయి. ముందుగా బల్క్ మెసేజ్‌లు, వాట్సాప్ సందేశాల ద్వారా "లాటరీ తగిలింది", "గిఫ్ట్ కార్డ్ గెలిచారు" అంటూ లింకులు పంపుతారు. ఆకర్షణీయమైన బహుమతులు, ప్రముఖుల ఫోటోలతో నకిలీ వెబ్‌సైట్లు, ప్రకటనలు సృష్టిస్తారు. అవతలి వ్యక్తి పూర్తిగా నమ్మేలా ఎంతో మర్యాదగా మాట్లాడతారు. నకిలీ లింకుల ద్వారా బాధితుల వ్యక్తిగత, బ్యాంకు వివరాలు (ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్, పాన్‌కార్డ్) సేకరిస్తారు. ప్రాసెసింగ్ ఫీజు, ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ వంటి పేర్లతో విడతలవారీగా డబ్బులు వసూలు చేస్తారు. ఒక్కసారి డబ్బులు పంపగానే, కొత్త కొత్త కారణాలు చెప్పి మరిన్ని డబ్బులు గుంజుతారు. కొన్ని సందర్భాల్లో ఓటీపీ లు తెలుసుకుని లేదా మాల్‌వేర్ (హానికర సాఫ్ట్‌వేర్) ఉన్న లింకులు పంపి ఫోన్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని ఖాతా మొత్తాన్ని ఖాళీ చేస్తారు.
పోలీసుల కీలక హెచ్చరిక
ఆన్‌లైన్ లాటరీ మోసాల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు."మీరు లాటరీ గెలిచారు", "గిఫ్ట్ కార్డ్ మీ కోసం" అనే మెసేజ్‌లు వస్తే వెంటనే నమ్మకండి. అలాంటి అదృష్టం అంత సులభంగా వరించదని గుర్తుంచుకోండి. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకండి. అవి మీ వ్యక్తిగత వివరాలను దొంగిలించే ఉచ్చులు. ఏ నిజమైన, గుర్తింపు పొందిన సంస్థ కూడా ఇమెయిల్ , మెసేజ్ ద్వారా లాటరీలు, బహుమతులు ప్రకటించదు. మీ బ్యాంకు ఖాతా వివరాలు, డెబిట్/క్రెడిట్ కార్డ్ నంబర్లు, పిన్ , ఓటీపీ వంటి అత్యంత రహస్య సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. బహుమతి కోసం ముందుగా పన్నులు లేదా ఫీజులు చెల్లించమని ఎవరైనా అడిగితే, అది కచ్చితంగా మోసమని గ్రహించండి.
మోసపోతే తక్షణమే ఫిర్యాదు చేయండి
ఒకవేళ మీరు ఇలాంటి మోసాల బారిన పడితే ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేయండి. లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి. ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బును రికవరీ చేసే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. అత్యాశకు పోయి, కష్టార్జితాన్ని కోల్పోవద్దని వారు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
