Let's talk: editor@tmv.in
ఆల్ ఐన్ మాస్టర్స్ టైటిల్ విజేత వాలిశెట్టి

ఆల్ ఐన్ మాస్టర్స్ టైటిల్ విజేత వాలిశెట్టి

Shaik Mohammad Shaffee
6 అక్టోబర్, 2025

భారత యువ షట్లర్ శ్రీయాన్షి వాలిశెట్టి తన కెరీర్‌లోనే తొలి బీడబ్ల్యూఎఫ్ సూపర్ 100 టైటిల్‌ను గెలుచుకుంది. దుబాయ్‌లోని అల్ ఐన్ మాస్టర్స్‌లో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో తోటి భారత క్రీడాకారిణి తస్నిమ్ మీర్‌పై అద్భుతమైన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ తుది పోరులో శ్రీయాన్షి 15-21, 22-20, 21-7 తేడాతో గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది.

తెలంగాణకు చెందిన 18 ఏళ్ల శ్రీయాన్షి వాలిశెట్టి.. పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. ఒక గేమ్ వెనుకబడినప్పటికీ, గొప్ప సంయమనం ప్రదర్శించి, పుంజుకుని మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. 49 నిమిషాల పాటు సాగిన ఈ సంచలన పోరులో ఆమె తిరుగులేని పోరాట పటిమను ప్రదర్శించింది.

హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరు

ఫైనల్ మ్యాచ్ తొలి గేమ్‌లో శ్రీయాన్షి మంచి ఆరంభాన్ని అందుకుంది. 8-4 పాయింట్లతో నాలుగు పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. అయితే తస్నిమ్ మీర్ వెంటనే కోలుకుని, అద్భుతమైన ర్యాలీలతో స్కోరును 14-9కు పెంచింది. ఈ క్రమంలో శ్రీయాన్షి పాయింట్లను చేజార్చుకోవడంతో, తస్నిమ్ మీర్ సునాయాసంగా తొలి గేమ్‌ను 21-15తో గెలుచుకుంది.

రెండవ గేమ్ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. ప్రారంభంలో 1-4తో వెనుకబడిన శ్రీయాన్షి, పోరాటాన్ని వీడకుండా 8-5 ఆధిక్యాన్ని సాధించింది. ఆ తర్వాత స్కోరు 17-14కు చేరింది. తస్నిమ్ గట్టి పోటీనిచ్చినప్పటికీ, ఒత్తిడిని అధిగమించిన శ్రీయాన్షి కీలకమైన పాయింట్లను గెలుచుకుని, ఈ గేమ్‌ను 22-20తో సొంతం చేసుకుని మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడవ గేమ్‌కు మళ్లించింది.

రెండవ గేమ్‌లో చూపించిన దూకుడును శ్రీయాన్షి వాలిశెట్టి మూడవ గేమ్‌లో కొనసాగించింది. ప్రారంభంలో తస్నిమ్ 6-5తో స్వల్ప ఆధిక్యం సాధించినప్పటికీ, శ్రీయాన్షి ఏ మాత్రం నిరాశ పడలేదు. ఆ తర్వాత ఆమె ఆట తీరు ఒక్కసారిగా మారిపోయింది. తనదైన పదునైన స్మాష్‌లు, అద్భుతమైన ప్లేసింగ్‌లతో తస్నిమ్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. శ్రీయాన్షి ఏకధాటిగా 15 పాయింట్ల అద్భుతమైన ర్యాలీతో స్కోరును 20-7కి పెంచింది. దీంతో తస్నిమ్ మీర్ పూర్తిగా పట్టు కోల్పోయింది. చివరకు, శ్రీయాన్షి వాలిశెట్టి 21-7తో మూడవ గేమ్‌ను, మ్యాచ్‌ను గెలుచుకుని చారిత్రక విజయాన్ని నమోదు చేసింది.

ఆల్ ఐన్ మాస్టర్స్ టైటిల్ విజేత వాలిశెట్టి - Tholi Paluku