Let's talk: editor@tmv.in
ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్: పోరాడి ఓడిన లక్ష్య సేన్

ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్: పోరాడి ఓడిన లక్ష్య సేన్

Shaik Mohammad Shaffee
9 మార్చి, 2026

భారత బ్యాడ్మింటన్ సంచలనం లక్ష్య సేన్ పోరాటం ముగిసింది. ప్రతిష్టాత్మకమైన ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్‌లో భారత 25 ఏళ్ల నిరీక్షణను తెరదించుతాడని ఆశించినా, ఫైనల్ మెట్టుపై అతడికి నిరాశే ఎదురైంది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత పురుషుల సింగిల్స్ ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన లిన్ చున్-యి చేతిలో లక్ష్య సేన్ ఓటమి పాలయ్యాడు. 57 నిమిషాల పాటు సాగిన ఈ హై-ఇంటెన్సిటీ పోరులో 15-21, 20-22 తేడాతో లక్ష్య సేన్ రన్నరప్‌గా నిలిచాడు. 2022 తర్వాత ఈ టోర్నీలో లక్ష్యకు ఇది రెండో ఫైనల్ కావడం గమనార్హం. ఈ విజయంతో ఆల్ ఇంగ్లాండ్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న తొలి తైపీ ఆటగాడిగా లిన్ చున్-యి చరిత్ర సృష్టించాడు.

గాయాలను లెక్కచేయని వీరోచిత పోరాటం

టోర్నీ ఆరంభం నుండి అద్భుత ఫామ్‌లో ఉన్న లక్ష్య సేన్, ప్రపంచ నంబర్ 1 ఆటగాడు షి యు కీ, ప్రపంచ నంబర్ 6 లీ షి ఫెంగ్‌లను మట్టికరిపించి ఫైనల్‌కు దూసుకొచ్చాడు. అయితే ఫైనల్ చేరే క్రమంలో అతడు గడిపిన సమయం, పడిన శ్రమ అతడిపై తీవ్ర ప్రభావం చూపింది. కెనడాకు చెందిన విక్టర్ లైతో జరిగిన సెమీఫైనల్‌లో దాదాపు 97 నిమిషాల పాటు తలపడిన లక్ష్య, తీవ్రమైన కండరాల నొప్పులు, పాదాలకు పొక్కులు వచ్చినా వెనకడుగు వేయలేదు. ఈ టోర్నీ మొత్తంలో అతను కోర్టులో 5 గంటల 16 నిమిషాల సమయం గడపగా, ప్రత్యర్థి లిన్ కంటే ఇది గంటన్నర ఎక్కువ కావడం గమనార్హం. రెండు తొడలకు కట్టు కట్టుకుని బరిలోకి దిగిన లక్ష్య సేన్, శారీరక ఇబ్బందులను అధిగమించి ఆఖరి నిమిషం వరకు పట్టుదలతో పోరాడాడు.

హోరాహోరీగా సాగిన ఫైనల్ సమరం

మ్యాచ్ ఆరంభంలో లక్ష్య సేన్ తడబడటంతో లిన్ 6-2తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. లెఫ్ట్ హ్యాండ్ స్మాష్‌లతో విరుచుకుపడిన లిన్‌ను అడ్డుకునేందుకు లక్ష్య ప్రయత్నించినా, తొలి గేమ్ 15-21తో చేజారింది. ఇక రెండో గేమ్‌లో పుంజుకున్న భారత ఆటగాడు ఒకానొక దశలో 9-4తో ఆధిక్యంలో నిలిచాడు. ఇద్దరి మధ్య జరిగిన 46 షాట్ల సుదీర్ఘ ర్యాలీ స్టేడియంలోని ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. లక్ష్య సేన్ 321 కిలోమీటర్ల వేగంతో కొట్టిన స్మాష్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. ఒకానొక దశలో 18-16తో ముందంజలో ఉన్న లక్ష్య సేన్, ఛాంపియన్‌షిప్ పాయింట్ వద్ద అద్భుతమైన డిఫెన్స్‌తో స్కోరును 20-20తో సమం చేశాడు. కానీ, చివర్లో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు, షాట్లు లైన్ బయటకు వెళ్లడంతో 20-22తో రెండో గేమ్‌ను, టైటిల్‌ను కోల్పోవాల్సి వచ్చింది.

'గర్వంగా ఉంది కానీ.. కొంత భావోద్వేగంగా ఉన్నా'

మ్యాచ్ అనంతరం లక్ష్య సేన్ మాట్లాడుతూ.. "ఈ రోజు మంచి మ్యాచ్ ఆడాననే అనుకుంటున్నాను. తొలి గేమ్‌లో ప్రత్యర్థి మెరుగ్గా ఆడాడు, రెండో గేమ్‌లో గెలిచే అవకాశం ఉన్నా ముగించలేకపోయాను. ఈ వారం నేను ఆడిన తీరు పట్ల సంతృప్తిగా ఉన్నాను. ఓటమి బాధగా ఉన్నా, ఈ టోర్నీ ద్వారా ఎన్నో సానుకూల అంశాలను నేర్చుకున్నాను. శారీరక పరిస్థితి ఆశించిన స్థాయిలో లేకపోయినా, కోర్టులోకి దిగాక నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే అనుకున్నాను" అని భావోద్వేగానికి లోనయ్యాడు. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ప్రకాష్ పడుకోన్ (1980), పుల్లెల గోపీచంద్ (2001) మాత్రమే ఈ టైటిల్ గెలవగా, లక్ష్య సేన్ రెండోసారి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.