Let's talk: editor@tmv.in
‘ఆల్మాంట్-కిడ్’ సిరప్‌ వాడకం నిలిపివేయాలి: తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్

‘ఆల్మాంట్-కిడ్’ సిరప్‌ వాడకం నిలిపివేయాలి: తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్

Gaddamidi Naveen
11 జనవరి, 2026

పిల్లల్లో అలర్జీలు, హే ఫీవర్, ఆస్తమా చికిత్సకు ఉపయోగించే ఆల్మాంట్ కిడ్ సిరప్ వాడకాన్ని వెంటనే ఆపాలని తెలంగాణ డ్రగ్స్ నియంత్రణ శాఖ అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఈ సిరప్‌లో అత్యంత విషపూరితమైన ఎథిలీన్ గ్లైకాల్ కలిసివున్నట్టు ప్రయోగశాల నివేదికలో తేలినట్లు అధికారులు తెలిపారు.

కేంద్ర డ్రగ్స్ ప్రామాణిక నియంత్రణ సంస్థ, కోల్‌కతా తూర్పు విభాగం నుంచి వచ్చిన హెచ్చరిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డ్రగ్స్ నియంత్రణ శాఖ వెల్లడించింది. ప్రయోగశాల పరీక్షల్లో లెవోసెటిరిజిన్ డైహైడ్రోక్లోరైడ్, మాంటెలూకాస్ట్ సోడియం సిరప్గా విక్రయించే ఈ ఔషధం కల్తీగా ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో ప్రజలు తమ వద్ద ఈ సిరప్ ఉన్నట్లయితే వెంటనే వినియోగాన్ని నిలిపివేసి, సమీప డ్రగ్స్ నియంత్రణ అధికారులకు సమాచారం అందించాలని శాఖ సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు, సహాయ సంచాలకులను అప్రమత్తం చేసి, అన్ని రిటైల్ దుకాణాలు, హోల్‌సేల్ వ్యాపారులు, పంపిణీదారులు, ఆసుపత్రుల్లో ఉన్న స్టాక్‌ను తక్షణమే నిల్వలో ఉంచి విక్రయాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రజలు తమ వద్ద ఈ ఔషధం ఉన్నట్లయితే లేదా ఎక్కడైనా విక్రయిస్తున్నట్టు గమనిస్తే, తెలంగాణ డ్రగ్స్ నియంత్రణ శాఖ టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా నేరుగా సమాచారం ఇవ్వవచ్చని అధికారులు తెలిపారు. ప్రజారోగ్యానికి ఎలాంటి ప్రమాదం కలగకుండా అవసరమైన చట్టపరమైన చర్యలు ఇప్పటికే ప్రారంభించామని, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని శాఖ స్పష్టం చేసింది.

ఎథిలీన్ గ్లైకాల్ ప్రభావం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ సిరప్ వివరాలు ఇలా ఉన్నాయి. బ్యాచ్ నెంబర్ ఏఎల్-24002, తయారీ సంస్థ – ట్రిడస్ రెమెడీస్, బిహార్.

‘ఆల్మాంట్-కిడ్’ సిరప్‌ వాడకం నిలిపివేయాలి: తెలంగాణ డ్రగ్స్‌ కంట్రోల్ - Tholi Paluku