
ఆల్మట్టి ఎత్తు పెంచకుండా అడ్డుకుంటాం!
ఆల్మట్టి ప్రాజెక్టుపై గత కొన్ని రోజులుగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. కర్ణాటక గనక ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని.. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ఎడారి అవుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అయితే తాము ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తుపెంపును అడ్డుకొని తీరుతామని కాంగ్రెస్ చెబుతున్నది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడల్లా బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటమే అందుకు కారణంగా తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్టు విషయంలో ఏం జరగబోతుంది? ప్రభుత్వం నిర్ణయం ఏమిటి? బీఆర్ఎస్ వాదన ఏమిటి? అన్న అంశం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ-కర్ణాటక మధ్య నీటి యుద్ధం
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్నది. కర్ణాటక ప్రభుత్వం డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో రాజకీయాలు, రైతుల భవిష్యత్తు, సుప్రీంకోర్టు పాత్ర ముడిపడి ఉన్నాయి. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాము ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకొని తీరుతామని స్పష్టంగా చెప్పారు. "ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచవద్దు. ఇది రైతులకు భారీ నష్టం సుప్రీంకోర్టులో దీనిపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తామని ప్రకటించారు. గతంలో సుప్రీంకోర్టు ఈ ఎత్తు పెంపును ఆపేందుకు స్టే ఆర్డర్ ఇచ్చిందని ప్రభుత్వం చెబుతున్నది. ఆల్మట్టి ఎత్తు పెంచితే మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ విమర్శలు ఏమిటి ?
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపు విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. "సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉండటం ద్వారా తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారు" అని ఆరోపిస్తున్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే, దక్షిణ తెలంగాణ మొత్తం ఎడారి అవుతుందని, శ్రీశైలం డ్యామ్ కూడా పనిచేయకుండా పోతుందని హెచ్చరిస్తున్నారు. బీఆర్ఎస్ వాదన ప్రకారం, కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం వల్ల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకించలేదని చెబుతోంది. "ఇది కాంగ్రెస్-బీజేపీ జాయింట్ వెంచర్. 12 ఏళ్లుగా ప్రజల్ని మోసం చేస్తున్నారు" అని కేటీఆర్ అన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని కూడా ఆ పార్టీ చూస్తున్నట్టు తెలుస్తోంది.
ఎత్తు పెంపును వ్యతిరేకిస్తున్న బీజేపీ
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామ్‌చందర్ రావు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. "కర్ణాటక ఎత్తు పెంచాలని నిర్ణయించింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ హక్కులను కాపాటం లేదు అని విమర్శించారు. బీజేపీ కూడా ఎత్తు పెంపుకు వ్యతిరేకం. మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి- ఇది ఏపీ రైతులకు కూడా నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల తమ ప్రాజెక్టులు మెరుగుపడతాయని కర్ణాటక చెబుతోంది. దీని కోసం ఆ రాష్ట్రం 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నట్టు సమాచారం. అయితే ఎత్తు పెంపు 2002 బచావత్ ట్రిబ్యునల్ నిర్ణయాలకు విరుద్ధమని తెలంగాణ వాదిస్తోంది.
పదేళ్ల నాటి నీటి వివాదం
ఆల్మట్టి డ్యామ్ వివాదం కొత్తది కాదు. 1990ల నుంచి కర్ణాటక-తెలంగాణ మధ్య (ఆంధ్రప్రదేశ్‌తో కలిపి) నీటి పంపిణీ వివాదం సాగుతోంది. 2002లో బచావత్ ట్రిబ్యునల్ డ్యామ్ ఎత్తును 519.6 మీటర్లకు మాత్రమే అనుమతించింది.
గతంలో కర్ణాటక ఎత్తు పెంచాలని ట్రై చేసినప్పుడు సుప్రీంకోర్టు ఆపింది. బీఆర్ఎస్ పాలనలో కూడా ఇదే వాదనలు వచ్చాయి, కానీ ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండటం వల్ల కాస్త గందరగోళం ఏర్పడింది. సుప్రీంకోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించి వాదనలు వినిపించడం మొదలైతే, కేసు కనీసం 6-12 నెలలు పడవచ్చు. ఎత్తు పెంచకుండా స్టే వస్తే, తెలంగాణకు ఊరట. కానీ కర్ణాటక బలవంతంగా ముందుకు వెళ్తే, రెండు రాష్ట్రాల మధ్య మరింత ఉద్రిక్తత పెరుగుతుంది.
అదే సమయంలో దీన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా వాడుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కూడా రాజకీయంగా బలపడేందుకు తెలంగాణ సెంటిమెంట్ రగిలించేందుకు ఆల్మట్టి ఎత్తు పెంపును అవకాశంగా తీసుకునే అవకాశం ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలకు ఎలా చెక్ పెడుతుందో వేచి చూడాలి. కర్ణాటక ప్రభుత్వాన్ని ఆల్మట్టి ఎత్తు పెంచకుండా నిలువరించగలదా? అన్నది కూడా వేచి చూడాలి.
