Let's talk: editor@tmv.in
ఆలిన్ షెరిన్.. అల్విదా

ఆలిన్ షెరిన్.. అల్విదా

Pinjari Chand
16 ఫిబ్రవరి, 2026

కేరళలో సీఎం నుంచి సాధారణ మనిషి వరకు ఇప్పుడు ఒకే పేరు చర్చలో ఉంది ఆలిన్ షెరిన్. పది నెలల బోసి నవ్వుల ఈ పసిపాప ఐదుగురి ప్రాణాలకు జీవం పోసి వెళ్లిపోయింది. తమ చిన్నారి మరణవేదనను పంటి బిగువన భరిస్తూ ఆమె అవయవాలను దానం చేసిన తల్లిదండ్రుల త్యాగానికి రాష్ట్రం మౌనంగా జేజేలు కొట్టింది. కన్నీటి నివాళులతో చిన్నారికి అల్విదా పలికింది. అవయవ దాతల చరిత్రలో ఆలిన్ షెరిన్ పేరు అజరామరంగా నిలిచిపోనుంది. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. కేరళ చరిత్రలో అతి పిన్న వయసులో అవయవ దాతగా నిలిచిన 10 నెలల చిన్నారి ఆలిన్ షెరిన్ అబ్రహాంకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సూచకంగా అధికారిక లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికింది. బ్రెయిన్ డెడ్ అనంతరం తల్లిదండ్రుల సమ్మతితో అవయవాలను దానం చేయడంతో ఐదుగురికి కొత్త జీవితం లభించింది.

పతనంతిట్ట జిల్లా మల్లప్పల్లిలోని ఆమె నివాసానికి ఉదయం చిన్నారి మృతదేహాన్ని తీసుకురాగా, కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుని కన్నీటి వీడ్కోలు పలికారు. అనంతరం అంతిమయాత్రగా కోట్టాయం జిల్లాలోని సెయింట్ థామస్ సీఎస్ఐ చర్చ్, నెడుంగడపల్లికి తరలించారు. అక్కడ నిర్వహించిన అంత్యక్రియల కార్యక్రమానికి కేంద్ర మంత్రి సురేశ్ గోపి, కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ హాజరై నివాళులు అర్పించారు.

ప్రమాదం... బ్రెయిన్ డెడ్

అరుణ్ అబ్రహాం, షెరిన్ ఆన్ జాన్ దంపతుల కుమార్తె అయిన ఆలిన్, ఫిబ్రవరి 5న కోట్టాయం సమీపంలోని పల్లం వద్ద ఎంసీ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. తల్లి, అమ్మమ్మ, తాతయ్య కూడా గాయపడ్డారు. చంగనాశేరి, తిరువల్లాలో చికిత్స అనంతరం కొచ్చికి తరలించగా, ఫిబ్రవరి 13న వైద్యులు బ్రెయిన్ డెడ్ అయ్యిందని నిర్ధారించారు.

ఐదుగురికి జీవదానం

తల్లిదండ్రుల నిర్ణయంతో అవయవ దానం చేపట్టారు. అవయవ దాన ప్రక్రియను కేరళ రాష్ట్రంలోని ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్​ప్లాంట్ ఆర్గనైజేషన్ సమన్వయం చేసింది. కాలేయాన్ని కిమ్స్ ఆసుపత్రికి , హార్ట్ వాల్వ్‌ను శ్రీ చిత్ర తిరునల్ ఇన్సిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీకి , కిడ్నీలను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తిరువనంతపురానికి పంపించారు. కళ్లను ఐ బ్యాంక్‌కు దానం చేశారు. ఆరు నెలల శిశువుకు కాలేయ మార్పిడి జరిగిందని అధికారులు తెలిపారు. అవయవాలను కేరళ నెట్ వర్క్ ఫర్ ఆర్గాన్ షేరింగ్ (కెనోస్) సమన్వయంతో, హోం శాఖ సహకారంతో వేగంగా తరలించారు.

ప్రభుత్వ గౌరవం

రాష్ట్ర ఇండస్ట్రీస్ మంత్రి పి.రాజీవ్ మాట్లాడుతూ, తీవ్ర దుఃఖంలోనూ అవయవ దానం చేసిన తల్లిదండ్రుల నిర్ణయాన్ని ప్రభుత్వం గౌరవంగా భావిస్తోందన్నారు. ఐదుగురికి జీవదానం చేసిన చిన్నారికి రాష్ట్ర గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించడం సముచితమని తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం 4.45 గంటలకు ముగిసింది. అనంతరం పోలీసు సిబ్బంది గౌరవ లాంఛనాలతో నివాళులు అర్పించారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

కమల్ హాసన్ నివాళి

ఈ ఘటనపై నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హసన్ భావోద్వేగ సందేశం విడుదల చేశారు. మన చిన్నారి ఐదుగురి జీవితాల్లో వెలుగునింపుతోంది. అరుణ్ అబ్రహాం, షెరిన్ ఆన్ జాన్ కు వందనం అంటూ తల్లిదండ్రుల ధైర్యసాహసాలను అభినందించారు. కేరళలో అవయవ దానం పట్ల అవగాహన పెంచిన సంఘటనగా ఆలిన్ షెరిన్ త్యాగం నిలిచిపోనుంది.