Let's talk: editor@tmv.in
ఆలయ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి కొండా సురేఖ

ఆలయ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి కొండా సురేఖ

Gaddamidi Naveen
10 డిసెంబర్, 2025

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ముఖ్య దేవాలయాలను అనుసంధానం చేస్తూ నాలుగు ప్రధాన సర్క్యూట్‌ల ద్వారా ఆలయ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం ప్రకటించారు.

హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో మంత్రి మాట్లాడుతూ, సౌకర్యాలు మెరుగుపరచడానికి, పర్యాటకాన్ని పెంచడానికి, ఆధ్యాత్మిక వారసత్వాన్ని పరిరక్షించడానికి విజన్ 2047 కింద మాస్టర్ ప్లాన్‌లు తయారు చేస్తున్నట్లు తెలిపారు. జోగులాంబ, మన్యంకొండ, వికారాబాద్ అనంతగిరి, యాదగిరిగుట్ట, రామప్ప, భద్రాచలం, వేములవాడ, మేడారం, కాళేశ్వరం వంటి ముఖ్య దేవాలయాలను కలుపుతూ నాలుగు ప్రధాన సర్క్యూట్‌ల ద్వారా ఆలయ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి పేర్కొన్నారు.దీనితో భక్తులకు, దేశ, విదేశీ పర్యాటకులకు మెరుగైన ప్రయాణ అనుభవం, వసతి, రవాణా, సౌకర్యాలు లభించనున్నాయని తెలిపారు.

నూతన ఎకో-టూరిజం ఫ్రేమ్‌వర్క్

మంత్రి టూరిజం పాలసీ 2025–30 కింద కొత్త ఎకో-టూరిజం ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించారు. “లెస్ స్ట్రక్చర్స్, మోర్ ఎక్స్‌పీరియెన్సెస్” అనే భావనపై ఆధారపడి, తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేసి ప్రకృతి ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13 ఎకో–టూరిజం సర్క్యూట్లు ఉన్నాయని, వాటికి తోడు “డెక్కన్ వుడ్స్ అండ్ ట్రైల్స్” అనే కొత్త బ్రాండ్‌ను ప్రారంభించినట్లు వెల్లడించారు.

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య 2024 నాటికి 36కి పెరగడం ఒక ముఖ్య అంశమని ఆమె అన్నారు. నందిపేట్, తడ్వాయి, పాకాల వంటి కొత్త పర్యాటక గమ్యస్థానాల్లో ట్రెక్కింగ్ మార్గాలు, సందర్శకుల సౌకర్యాల అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. పర్యాటకుల అనుభవాన్ని మెరుగుపరచేందుకు ఆన్‌లైన్ బుకింగ్ సిస్టమ్‌ను కూడా తీసుకువస్తున్నట్లు మంత్రి తెలిపారు.

2047 నాటికి నెట్–జీరో ఎమిషన్ లక్ష్యాన్ని చేరుకునే రాష్ట్ర ప్రయత్తిలో ఈ కార్యక్రమాలు కీలక భాగమని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో 19 శాతం అటవీ ప్రాంతం ఉండగా, అడవులకు వెలుపల ఉన్న చెట్లతో కలిపి మొత్తం హరిత కవచం 22 శాతానికి చేరిందని తెలిపారు.

దేవాదాయ శాఖ పర్యవేక్షణ

దేవాదాయ శాఖ పరిధిలో ప్రస్తుతం 12,000కు పైగా దేవాలయాలు ఉండగా, 695 దేవాలయాలు ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి. భూముల ఆదాయంతో నడిచే 3,500 మందిరాలకు తోడు, ఆదాయం లేని 6,400కిపైగా దేవాలయాలకు ప్రభుత్వం ప్రాథమిక నిత్యపూజల కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అడవులు, ఎకో,టూరిజం, దేవాలయాల అభివృద్ధిపై ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రజల జీవనోపాధి, సంస్కృతి పరిరక్షణ, సుస్థిర అభివృద్ధికి పెట్టుబడులేనని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్’కు మంత్రి కొండా సురేఖ ఇందిరమ్మ చీరలో వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఆలయ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం: మంత్రి కొండా సురేఖ - Tholi Paluku