Let's talk: editor@tmv.in
ఆలయాల పట్ల ఇదేం అపచారం: సత్తి సూర్యనారాయణ రెడ్డి

ఆలయాల పట్ల ఇదేం అపచారం: సత్తి సూర్యనారాయణ రెడ్డి

Panthagani Anusha
13 జనవరి, 2026

నియోజకవర్గంలోని హిందూ దేవాలయాల పట్ల కూటమి ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం చాలా బాధాకరం అని పేర్కొన్నారు.

కొత్తూరు గ్రామంలో ఒక భక్తుడు తన సొంత ఖర్చుతో సుమారు రూ.20 లక్షలు వెచ్చించి నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్టను ప్రభుత్వం చివరి నిమిషంలో అడ్డుకోవడంపై సూర్యనారాయణ రెడ్డి మండిపడ్డారు. ఆలయం వద్ద 144 సెక్షన్ విధించి బారికేడ్లు ఏర్పాటు చేయడంపై ఆయన నిలదీశారు. భగవంతుడి విగ్రహాలను వెనక్కి పంపడం భక్తులకు తీరని వేదన మిగిల్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు.

దేవుడి సొమ్ముతో వ్యాపారాలా?

అదేవిధంగా కుతుకులూరు అభయాంజనేయ స్వామి గుడికి సంబంధించిన నిధుల విషయంలో భారీ అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. సుమారు రూ.70 లక్షల ఆలయ నిధులను ఒక టీడీపీ నాయకుడి వద్ద ఉంచారని వైయస్‌ఆర్‌సీపీ నాయకులూ నిలదీసిన తర్వాతే ఆ మొత్తాన్ని వెనక్కి ఇచ్చారని తెలిపారు. అయితే ఆ నిధులపై రావాల్సిన రూ.15 లక్షల వడ్డీని ఆలయానికి చెల్లించకపోవడం దారుణమని దేవుడి సొమ్ముతో రాజకీయ నేతలు వ్యాపారాలు చేస్తున్నారని విమర్శించారు.

అనపర్తి విష్ణాలయం వద్ద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ వల్ల భక్తులకు కనీస పార్కింగ్ సౌకర్యం కూడా లేకుండా పోయిందని సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. పూజా కార్యక్రమాలకు, భక్తుల రాకపోకలకు ఇది పెద్ద ఆటంకంగా మారిందని తక్షణమే ఆ ఫెన్సింగ్‌ను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ నువ్వు నకిలీ బీజేపీ ఎమ్మెల్యేవి ఈవీఎంల సహకారంతో గెలిచావు కాబట్టే నీకు దేవుడంటే భయం లేదు అని విమర్శించారు. ఇప్పటికైనా చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, నియోజకవర్గంలోని ఆలయ సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆలయాల పట్ల ఇదేం అపచారం: సత్తి సూర్యనారాయణ రెడ్డి - Tholi Paluku