Let's talk: editor@tmv.in
ఆలయాలకు భద్రతకల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలం:

ఆలయాలకు భద్రతకల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలం:

Panthagani Anusha
4 జనవరి, 2026

రాష్ట్రంలోని హిందూ దేవాలయాల పవిత్రతను కాపాడటంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. తిరుమల గోవిందరాజస్వామి ఆలయ గోపురంపై విగ్రహాల ధ్వంసం ఘటనపై శనివారం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. టీటీడీ యంత్రాంగం నిర్లక్ష్యం వల్లనే అపచారాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.

తిరుమల వంటి అత్యంత పవిత్రమైన ప్రాంతంలో మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఆలయ గోపురంపైకి ఎక్కి కలశాన్ని, విగ్రహాలను ధ్వంసం చేయడం భద్రతా లోపాలకు పరాకాష్ట అని మల్లాది విష్ణు పేర్కొన్నారు. భక్తుల భద్రతను గాలికి వదిలేసిన టీటీడీ బోర్డు, వీఐపీల సేవలకే పరిమితమైందని విమర్శించారు. వైకుంఠ ఏకాదశి వంటి మహా పర్వదినాల్లో లక్షలాది భక్తులు తరలివస్తే కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, పైగా ఆలయాలకు రావద్దంటూ సూచించడం భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని ఆయన ధ్వజమెత్తారు.

వరుస ఘటనలు.. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం

చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన నాటి నుంచే దేవాలయాల్లో వరుసగా అశుభ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని మల్లాది విష్ణు ఆరోపించారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ ముఖ్యమంత్రి చేసిన అసత్య ప్రచారమే ఈ అనర్థాలకు నాంది పలికిందని అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట, సింహాచలం, కాశీబుగ్గ ఆలయాల్లో ఘటనలు, కనకదుర్గమ్మ ఆలయంలో మూడు గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, ఇవన్నీ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనాలని పేర్కొన్నారు. సనాతన ధర్మం గురించి మాటలు చెప్పే కూటమి నేతలు ఆచరణలో మాత్రం పూర్తిగా విఫలమవుతున్నారని ఎద్దేవా చేశారు.

ద్రాక్షారామంలో శివలింగం దెబ్బతిన్న ఘటనను ప్రస్తావించిన ఆయన, నిందితుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలుడనే కారణంతో ఆ విషయాన్ని ప్రభుత్వం తొక్కిపెట్టిందని సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆలయాల్లో హుండీలకు గోశాలలకు సరైన భద్రత లేకుండా పోయిందని, ప్రసాదాల నాణ్యత కూడా తీవ్రంగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గోవిందరాజస్వామి ఆలయ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన సమాధానం ఇవ్వాలని, భక్తుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించాలని డిమాండ్ చేశారు.

అర్ధరాత్రి ఆలయంలో హైడ్రామా

ఇదిలా ఉండగా, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఉన్న వ్యక్తి తీవ్ర కలకలం సృష్టించాడు. ఏకాంత సేవ ముగిసిన అనంతరం ఆలయంలోకి అక్రమంగా ప్రవేశించిన అతడు, ఆలయ గోపురంపైకి ఎక్కి నినాదాలు చేశాడు. విషయం తెలుసుకున్న వెంటనే అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, తిరుపతి ఈస్ట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని కిందకు దిగాలని పలుమార్లు సూచించారు. అయితే అతడు కిందకు రావడానికి నిరాకరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సుమారు మూడు గంటలపాటు కొనసాగిన హైడ్రామా అనంతరం తాళ్లు, నిచ్చెనల సహాయంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది గోపురంపైకి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సురక్షితంగా కిందకు దించి అనంతరం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

నిందితుడు తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా కూర్మవాడ పెద్దమల్లారెడ్డి కాలనీకి చెందిన తిరుపతిగా పోలీసులు గుర్తించారు. ఆలయం మూసివేసిన తర్వాత భద్రతా సిబ్బంది కళ్లుగప్పి లోపలికి చొరబడిన అతడు, మహాద్వారం లోపల ఉన్న ఆలయ గోపురంపైకి ఎక్కి కలశాలు, విద్యుత్ దీపాలను స్వల్పంగా ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. గోపురం నుంచి దిగేందుకు “క్వార్టర్ మద్యం బాటిల్ ఇస్తేనే కిందకు దిగుతాను అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. నిందితుడికి మానసిక స్థితి సరిగా లేనట్టుగా అనుమానిస్తున్నారు.

ఈ ఘటనతో టీటీడీ విజిలెన్స్ వ్యవస్థ పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ఆలయంలోకి అక్రమంగా ప్రవేశించిన విషయాన్ని ముందుగానే గుర్తించడంలో విజిలెన్స్ విఫలమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తుల విశ్వాసానికి ప్రతీకైన ఆలయంలోకి ఇలాంటి వ్యక్తి సులభంగా చొరబడటం భద్రతా లోపాలను స్పష్టంగా బయటపెట్టిందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.