
‘ఆల్మట్టి’ ఎత్తు పెంచితే ఊరుకోం
కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచబోతున్నట్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచితే తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని.. ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో నష్టం తప్పదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ నేతలు మౌనంగా ఉన్నారా? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ వెళ్లి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తమ వాదనలు వినిపిస్తామన్నారు. సూర్యాపేట జిల్లాలో పర్యటించిన ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలు ఏమిటి?
తెలంగాణ ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ, "రాష్ట్ర ప్రభుత్వం ఈ పెంపునకు వ్యతిరేకం. నేడు ఢిల్లీ వెళ్లి వాదనలు వినిపిస్తాం" అని స్పష్టం చేశారు. డ్యామ్ ఎత్తు పెరిగితే కర్ణాటక అదనంగా 100 టీఎంసీ నీటిని నిల్వ చేసుకుంటుందని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. డ్యామ్ ఎత్తు పెంచితే తెలంగాణకు కృష్ణా జలాల వాట గణనీయంగా తగ్గుతుందని.. కృష్ణా జలాల ఆధారంగా నిర్మించిన కేఎల్ఐ వంటి ప్రాజెక్టులకు నీటి లభ్యతలో సమస్యలు వస్తాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ‘ఇప్పటికే ఆగస్టు వరకు కృష్ణా నీరు తెలంగాణ పొలాలకు చేరడం లేదు. ఎత్తు పెంచితే, 27.4 లక్షల ఎకరాల ఇరిగేషన్ ప్రాజెక్టులు దెబ్బతిని, రైతులు నష్టపోతారు’ అని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది.
"డ్యామ్ ఎత్తు పెంచితే కృష్ణా నదిలో క్రికెట్ ఆడుకోవాల్సి వస్తుంది" అని కవిత గతంలో వ్యాఖ్యానించారు. కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యూనల్ (కెడబ్ల్యూడీటీ) 2010 కేటాయింపుల ప్రకారం, కర్ణాటకకు 173 టీఎంసీ నీరు మాత్రమే ఉపయోగించే అవకాశం ఉంది. కానీ డ్యామ్ ఎత్తు పెంచితే ఈ నిబంధనను ఉల్లంఘించినట్టు అవుతుంది. ట్రిబ్యునల్ ఆదేశాలను కూడా కర్ణాటక ఉల్లంఘిస్తోంది’ అంటూ తెలంగాణ ఆరోపిస్తోంది. తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాంతాలను ఎడారిగా మారుస్తుందని, రైతుల జీవనాధారాన్ని దెబ్బతీస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ "కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతులకు మరణ శాసనం జారీ చేసింది" అని విమర్శించారు.
సుప్రీంకోర్టుకు వెళ్లిన మహారాష్ట్ర
మహారాష్ట్ర కూడా ఈ పెంపును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎందుకంటే ఇది సంగ్లీ, కోల్హాపూర్ ప్రాంతాల్లో వరదలకు దారితీస్తుందని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నది. కర్ణాటక ప్రభుత్వం తమ నిర్ణయాన్ని సమర్థిస్తూ, "మా నీరు - మా హక్కు" అని ప్రకటిస్తోంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ, "ఆల్మట్టి ఎత్తు పెంచడం మా 5 జిల్లాల రైతుల భవిష్యత్తుకు జీవనాధారం. సముద్రానికి వృథా అయ్యే నీటిని మా రైతులకు ఉపయోగించుకుంటాం" అని చెప్పారు. కృష్ణా ట్రెబ్యునల్ అవార్డు ప్రకారం తమ వాటా స్పష్టమని, మహారాష్ట్ర అభ్యంతరాలు 15 ఏళ్లుగా లేవని, ఇప్పుడు రావడం షాకింగ్ అని సీఎం సిద్ధరామయ్య అన్నారు.
బీఆర్ఎస్ విమర్శలు ఇవే..
ఆల్మట్టి డ్యామ్ పెంచడం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది. కృష్ణా నదీ జలాలు శాశ్వతంగా తగ్గిపోయి, రైతులు దెబ్బతింటారు. బీఆర్‌ఎస్ నేత బి. వినోద్ కుమార్ మాట్లాడుతూ.. "కర్ణాటక నిర్ణయం తెలంగాణకు శాశ్వత నష్టం" అని అన్నారు. ఇది 27.4 లక్షల ఎకరాల ఇరిగేషన్‌ను ప్రభావితం చేస్తుంది. ఈ నిర్ణయం కృష్ణా జలాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తెలంగాణ వాటా సాధించడం కష్టమవుతుంది. ఇప్పటికే ఏపీతో వివాదాలు ఉన్న నేపథ్యంలో, ఇది మరింత సంక్షోభాన్ని తెస్తుంది. కర్ణాటక అదనపు నీటిని నిల్వ చేసుకుంటే, దిగువ రాష్ట్రాలకు నీరు తగ్గుతుంది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఏం చెబుతారు?
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఆల్మట్టి డ్యామ్ పెంపుపై తెలంగాణ అభ్యంతరాలను వినిపిస్తారు. ట్రిబ్యునల్ సూచనలను కర్ణాటక ప్రభుత్వం ఎలా ఉల్లంఘిస్తుందో ఆయన కేంద్రానికి చెప్పే అవకాశం ఉంది. ఈ వివాదం రాష్ట్రాల మధ్య నీటి పంపకాల సమస్యను మరోసారి తెరపైకి తెచ్చింది. కేంద్రం జోక్యం చేసుకుని, ట్రిబ్యూనల్ ఆదేశాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే, రైతులు మధ్యలో నలిగిపోతారు. తెలంగాణ, కర్ణాటక రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. మరి ఈ రెండు రాష్ట్రాలు చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంది. కానీ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచి రైతులకు మరింత ప్రయోజనం చేకూరుస్తామని కర్ణాటక ప్రభుత్వం అక్కడికి రైతులకు చెబుతూ వచ్చింది. ఒక వేళ ఇప్పుడు తెలంగాణ ఒత్తిడికి తలొగ్గితే రాజకీయంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. విపక్షాల నుంచి విమర్శలు తప్పవు. కానీ తెలంగాణ ప్రభుత్వం గట్టిగా ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచడాన్ని అడ్డుకోకపోతే ఇక్కడి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. మరి ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి వ్యూహం అవలంబిస్తుందో వేచి చూడాలి.
