Let's talk: editor@tmv.in
ఆర్లీన్స్‌ మాస్టర్స్: మెయిన్‌ డ్రాలోకి ఆకర్షి కశ్యప్‌

ఆర్లీన్స్‌ మాస్టర్స్: మెయిన్‌ డ్రాలోకి ఆకర్షి కశ్యప్‌

Shaik Mohammad Shaffee
18 మార్చి, 2026

ఫ్రాన్స్‌ వేదికగా జరుగుతున్న 'ఆర్లీన్స్‌ మాస్టర్స్‌' సూపర్‌ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణి ఆకర్షి కశ్యప్‌ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వాలిఫైయింగ్‌ రౌండ్లలో వరుసగా రెండు విజయాలు సాధించి మెయిన్‌ డ్రాకు అర్హత సాధించింది. ప్రపంచ 63వ ర్యాంకర్‌ అయిన ఆకర్షి, తొలి రౌండ్‌లో స్వదేశీ ప్లేయర్ శ్రీయాన్షి వలిశెట్టిపై 21-19, 17-21, 21-13తో హోరాహోరీగా పోరాడి గెలుపొందింది. అనంతరం జరిగిన రెండో రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన లీ వై హెచ్‌పై 21-17, 21-19తో వరుస సెట్లలో విజయం సాధించి ముందంజ వేసింది. మెయిన్‌ డ్రాలో ఆమె సింగపూర్‌కు చెందిన యో జియా మిన్‌తో తలపడనుంది.

పోరాడి ఓడిన సుబ్రహ్మణ్యం

పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత షట్లర్‌ ఎస్‌. సుబ్రహ్మణ్యంకు నిరాశ ఎదురైంది. క్వాలిఫైయింగ్‌ రౌండ్‌లో మలేషియా స్టార్ ప్లేయర్, పారిస్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత లీ జి జియాతో తలపడ్డ సుబ్రహ్మణ్యం 12-21, 18-21తో ఓటమి పాలయ్యాడు. 2025 సీజన్‌లో వెన్ను సమస్యల కారణంగా శస్త్రచికిత్సకు బదులు రిహాబిలిటేషన్ ఎంచుకున్న లీ జి జియా, ఈ టోర్నీ ద్వారా మళ్లీ ఫామ్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. బలమైన ప్రత్యర్థి నుంచి ఎదురైన సవాలును తట్టుకోలేక సుబ్రహ్మణ్యం టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

మహిళల డబుల్స్‌లో నిరాశ

మహిళల డబుల్స్‌ విభాగంలో భారత జంట అశ్విని భట్-శిఖ గౌతమ్ తమ పోరును ఆరంభించకుండానే ముగించారు. జపాన్‌కు చెందిన రుయ్ హిరోకామి-సయాకా హోబరా జంటతో జరగాల్సిన మ్యాచ్‌లో భారత జోడీ వాకోవర్‌ ఇచ్చింది. దీంతో జపాన్ జంట నేరుగా తదుపరి రౌండ్‌కు చేరుకుంది. వ్యక్తిగత కారణాలు, ఫిట్‌నెస్‌ సమస్యల వల్ల భారత జోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.